గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 నవంబరు 2015 (11:01 IST)

బీహార్‌లో ఓటమి.. అమిత్ షాపై వేటు తప్పదా?.. రథసారిథిగా రాజ్‌నాథ్?

బీహార్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీజేపీకి చెందిన సీనియర్లు వర్సెస్ బీజేపీ కేంద్ర మంత్రులుగా పరిస్థితి మారిపోయింది. బీహార్ ఎన్నికల ఫలితాలను కేంద్రంగా చేసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అధ్యక్షుడు అమిత్ షాలపై విమర్శలు గుప్పించిన సీనియర్లపై చర్య తీసుకోవాలని కేంద్ర మంత్రి, మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించడంతో పరిస్థితి మరింతగా విషయమించినట్టయింది. 
 
ఎన్నికల ప్రచారానికి నేతృత్వం వహించిన వారే ఓటమికి కూడా జవాబుదారీ కావాలని సీనియర్లతో పాటు మరో వర్గం డిమాండ్ చేస్తుంటే.. పార్టీ మొత్తం సమిష్టి బాధ్యత వహించాలని మరో వర్గం వ్యాఖ్యానిస్తోంది. దీంతో పరిస్థితి చేయిదాటి పోయింది. ఓటమిపై ఎంపీలు, నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతుండటంతో క్రమశిక్షణ ఉల్లంఘించవద్దని బీజేపీ నాయకత్వం హుకుం జారీ చేసింది. 
 
అయినా.. దీన్ని తోసి రాజంటూ సీనియర్ నేతలు అద్వానీ, మురళీమనోహర్‌జోషి, శాంతాకుమార్, యశ్వంత్ సిన్హాలు సమావేశమై ఏడాదిన్నరగా నిర్ణయాలు తీసుకుంటున్న ఒకరిద్దరు నేతలపై చర్య తీసుకోవాలంటూ మోడీ, అమిత్ షాలను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పైగా, అద్వానీ ప్రభృతులు బహిరంగ విమర్శలు చేయడంతో మోడీ, అమిత్‌ షా ధ్వయం పట్ల వ్యతిరేకతతో, అసంతృప్తితో ఉన్న కమలనాథులకు ధైర్యం వచ్చిందని అంటున్నారు. 
 
దీంతో కేంద్ర మంత్రులు, మోడీ అనుకూలురుగా ముద్రపడిన రాజ్‌నాథ్, వెంకయ్య, నితిన్ గడ్కరీలు రంగంలోకి దిగారు. ఓటమికి సమిష్టి బాధ్యత వహించాలంటూ వ్యాఖ్యానించారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 2004 ఎన్నికల్లో, 2009లో అద్వానీ నేతృత్వంలోనూ పార్టీ ఓటమి పాలైందని వెంకయ్య గుర్తుచేశారు. అయితే, గడ్కరీ మాత్రం ఓ అడుగు ముందుకేసి బాధ్యతారాహిత్య ప్రకటనలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది పుండుమీద కారం చల్లిన చందంగా మారింది. 
 
వెంటనే రాజ్‌నాథ్‌ సింగ్ జోక్యం చేసుకుని సీనియర్ల సూచనలు, సలహాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటామని, ఓటమిపై లోతుగా విశ్లేషిస్తామన్నారు. అసమ్మతి స్వరం వినిపిస్తున్న వారిని అణచివేయలేమని తేల్చిచెప్పారు. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో అమిత్‌షా స్థానంలో మళ్లీ రాజ్‌నాథ్‌సింగ్ పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయని తెలుస్తున్నది. జనవరిలో జరిగే పార్టీ సంస్థాగత ఎన్నికల్లో తిరిగి రాజ్‌నాథ్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశాలు ఉన్నట్టు ఢిల్లీ బీజేపీ వర్గాల సమాచారం.