శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2016 (17:35 IST)

సీట్ల పెంపుపై ఉన్న ఊపు.. ప్రత్యేక హోదాపై ఎందుకు లేదు వెంకయ్య గారూ...?!

కేంద్రంలో గానీ, రాష్ట్రంలో గానీ ప్రజల సమస్యల కంటే రాజకీయ ప్రయోజనాలపైనే రాజకీయ నేతలు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇందుకు ఏపీలో సీట్ల పెంపు- ఏపీ ప్రత్యేక హోదా అంశాలే నిదర్శనం. కేంద్రంలో కొలువు తీరే ఏ పార్టీ అయినా.. ప్రజల సమస్యల్ని పక్కన బెట్టి రాజకీయ ప్రయోజనాలపైనే దృష్టి పెడుతుందని రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. 

ఈ క్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పార్టీలకు.. నేతలకు మాత్రమే రాజకీయ ప్రయోజనాన్ని కలిగించే అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం ఎంత సీరియస్‌గా పని చేస్తుందో.. ఎంత స్పీడ్‌గా ప్రాసెస్ జరుగుతుందో తాజాగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి మాటల్ని వింటే ఇట్టే తెలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు విషయాన్ని కేంద్రం సీరియస్‌‍గా తీసుకుందని.. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టే దిశగా ప్రయత్నాలు సాగుతున్నట్లు వెల్లడించారు.
 
తెలుగు రాష్ట్రాల సీట్ల పెంపుకు సంబంధించిన ఫైలు న్యాయశాఖ వద్ద ఉందన్న విషయాన్ని చెప్తున్న వెంకయ్య.. అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత హోంశాఖ ఈ ప్రక్రియను షురూ చేస్తుందన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. ఏ సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంటులోకి తెస్తామన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేనని చెప్పిన వెంకయ్య..వీలైనంత త్వరగా పార్లమెంటులో ప్రవేశ పెడతామని చెప్పుకొచ్చారు.
 
కేవలం రాజకీయ పార్టీలకు.. నాయకులకు మాత్రమే లబ్థి చేకూర్చే ఈ అసెంబ్లీ సీట్ల పెంపు వ్యవహారంలో ఇంతగా అప్ డేట్ చేస్తున్న వెంకయ్య.. ఏపీకి అత్యవసరమైన ప్రత్యేక హోదా గురించి సూటి మాట చెప్పటానికి మాత్రం నీళ్లు నమలటం ఏమిటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక హోదాపై మోడీ సర్కారు నత్తనడకన ప్రక్రియను సాగించడం.. అసలు ప్రత్యేక హోదా ఇస్తారా లేదా అనే అంశాన్ని నాన్చుతున్న తరుణంలో.. తెలుగు ప్రజలు రాజకీయ పార్టీలపై గల నమ్మకాన్ని కోల్పోతున్నారు. 
 
ప్రజా సమస్యలు పరిష్కరించే విషయంలో కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా మీనమేషాలు లెక్కేస్తుందని.. అదే రాజకీయ లబ్ధి కోసమంటే మాత్రం చకచకా పనులు చేసేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.