శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PYR
Last Modified: బుధవారం, 4 ఫిబ్రవరి 2015 (18:05 IST)

కరకట్ట ఆక్రమణతో బీజేపీ, టీడీపీల సంబంధాలు కంచికేనా..?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కొత్త ఆధ్యాయం ఆరంభం కానున్నది. కరకట్ట ఆక్రమణలతో తెలుగుదేశం, బీజేపీల సంబంధాలు కంచికి చేరనున్నాయి. కృష్ణ కరకట్టపై గోకరాజు గంగరాజు నిర్మించిన భవనాల కూల్చివేతకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా వాడీవేడిగా ఉన్న ఈ సంబంధాల తెగేందుకు కరకట్ట అక్రమ నిర్మాణాలు వేదిక కానున్నాయి. అయితే కరకట్ట రాజకీయాలు కేవలం సాకు మాత్రమే. 
 
కరకట్టపై నిర్మాణాలు విజయవాడలో వేడి పుట్టిస్తున్నాయి. కరకట్టపై నర్సాపురం ఎంపి గోకరాజు గంగారాజు చాలా కాలం నుంచి 2700 స్క్వైర్ యార్డులలో అందమైన భవనాన్ని నిర్మించారు. అక్కడ అడుగడుగునా నిబంధనలను తుంగలో తొక్కారు. దీనిపై మొదటగా నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెరపైకి తీసుకు వచ్చారు. వాటిపై ఉన్న కట్టడాలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగానే బీజేపీ అధ్యక్షుడు అమిషాను అదే అందమైన భవంతికి తీసుకెళ్ళి మంత్రికి గోకరాజు గంగరాజు సవాల్ విసిరారు. పైగా అక్కడే బీజేపీ కార్యాలయానికి శంఖుస్థాపన వేయించి పుండు మీద కారం చల్లారు. 
 
ఇదంతా ఒక ఎత్తైతే.. చంద్రబాబు, నరేంద్ర మోడీల మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. గుజరాత్ అల్లర్ల సమయంలో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర రాజకీయాలలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు అద్వానీ, వాజ్ పేయిలతో అల్లర్ల విషయమై మాట్లాడారు. వెంటనే మోడీని ముఖ్యమంత్రిగా తీసేయాలనే ప్రతిపాదన కూడా చేశారు. అయితే అందుకు అప్పటి బీజేపీ నేతలు నిరాకరించారు. ప్రస్తుతం మోడీయే ప్రధాన మంత్రి కావడంతో చంద్రబాబును దూరం పెడుతున్నారని తెలుస్తోంది. 
 
మరోవైపు ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీలేవి నిలబెట్టుకోలేదు. రాజధానికి నిధులిచ్చే విషయం లోటు బడ్జెట్టు, పోలవరం నిధులు, ప్రత్యేక హోదా ఇలా అన్ని హామీలను బీజేపీ పెడచెవిన పెట్టింది. ఇది కేవలం తెలుగుదేశం పార్టీని ఇరుకుపెట్టి తమ పార్టీని బలోపేతం చేసుకోవడంలో భాగమే. చివరకు విభజన చట్టంలోని అంశాలను కూడా బీజేపీ పక్కన పెట్టేసింది. దీనిపై చంద్రబాబు కూడా నోరు మెదపలేని స్థితి. ఇలాంటి స్థితిలో దుమ్మెత్తిపోసి సంబంధాలను తెంచుకుంటే జనం నుంచి చీత్కారం ఎదురవుతుందని చంద్రబాబు ఆలోచన. పార్టీ ఇమేజ్, తన ప్రతిష్ట దెబ్బ తినకుండానే భారతీయ జనతా పార్టీని ముద్దాయిని చేసి బయటకు రావాలని యోచిస్తున్నారు. 
 
బీజేపీ, తెలుగుదేశం నాయకుల మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. మాటకు మాట ఇచ్చుకుంటూనే ఉన్నారు. ఇదిలా ఉండగానే కరకట్టపై బీజేపీ కార్యాలయ నిర్మాణ ఫైలు రాష్ట్ర ప్రభుత్వం ఎదుట వచ్చింది. అది అక్కడే ఉంది. ఈ అంశాన్ని కూడా బీజేపీతో రాజకీయ విడాకులు తీసుకోవడానికి ఉపయోగపడేలా తెలుగుదేశం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగమే కరకట్ట అక్రమ నిర్మాణాలపై నీటిపారుదల శాఖ మంత్రి విచారణకు ఆదేశించారు. కరకట్టపై ఉన్న అన్ని అక్రమ కట్టడాలను ఆయన స్వయంగా మీడియాను వెంటబెట్టుకుని వెళ్ళి చూపించారు. ఇక్కడ నుంచి రెండు పార్టీ మధ్యన పోరు మొదలయ్యింది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాల్సిందే. ఈ సంబంధాలు కంచి చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.