శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Eswar
Last Modified: శుక్రవారం, 25 జులై 2014 (17:58 IST)

చనిపోతేనే లైన్ క్రాసింగ్‌ వద్ద గేట్లు... మిగిలినవి అంతే... మొద్దు రైల్వే

ఏటా రైల్వే బడ్జెట్లో కోట్లకు కోట్లు కేటాయించే కేంద్రం... రైల్వే క్రాసింగ్‌ల భద్రతను మాత్రం గాలికొదిలేసింది. ఈసారి ఏకంగా బుల్లెట్‌ ట్రైన్లు తెస్తామని చెప్పిన కేంద్ర సర్కారు.. రైల్వే క్రాసింగ్ వద్ద గార్డులను ఏర్పాటు చెయ్యడం మాత్రం విస్మరించింది. అసలు పౌరులకు రైల్వేక్రాసింగ్‌ల నుంచి భద్రత లేదా? లెవల్ క్రాసింగ్‌ల మీద కక్కోదర్ కమిటీ సూచనలు ఇక ఎప్పటికీ అమలు జరగవా? అసలు రైల్వేల్లో ప్రజల భద్రత పట్టాలెక్కేదెన్నడు?
 
మన దేశంలో రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాల చరిత్ర ఇప్పటిది కాదు. ఇప్పటివరకూ ఇలాంటి ఎన్నో ప్రమాదాల్లో వేలాదిమంది బలయ్యారు.. 1964 డిసెంబర్ 9న దియోరా లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద ఓ బస్సును రైలు ఢీకొట్టిన ప్రమాదంలో 29 మంది మరణించారు, 72 మంది గాయపడ్డారు. 1986 సెప్టెంబర్ 11న అస్సాంలోని పథాలిపహార్ లెవెల్ క్రాసింగ్‌ వద్ద రైలు ఢీకొట్టడంతో బస్సులో ఉన్న 28 మంది మరణించగా, 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
1991 మార్చి 20న మధ్యప్రదేశ్‌లోని అన్నాపూర్ లెవెల్‌ క్రాసింగ్ దగ్గర బస్సును రైలు ఢీకొన్న ప్రమాదంలో 35 మంది మరణించారు. 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. 1993 డిసెంబర్ 10న మహారాష్ట్రలో పూనా లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద ఓ స్కూలు బస్సును సహ్యాద్రి ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టడంతో 38 మంది పిల్లలు విగతజీవులుగా మారారు. మరో 41 మంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.
 
1996 మే 14న ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి దగ్గర లెవెల్‌ క్రాసింగ్‌లో పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్‌ను రైలు ఢీకొట్టడంతో పెళ్లి కుమార్తెతో సహా, 25 మంది మరణించారు. 1996 మే 25... కేరళలోని అలెప్పీ దగ్గర లెవెల్‌ క్రాసింగ్‌లో ఓ బస్సును రైలు ఢీకొట్టడంతో 35 మంది దుర్మరణం పాలయ్యారు. 
 
1999 ఏప్రిల్‌ 5న జుకియా లెవెల్ క్రాసింగ్‌ వద్ద జరిగిన ప్రమాదంలో ఓ పెళ్లి బస్సును రైలు ఢీకొట్టడంతో వధూవరులతో సహా 45 మంది చనిపోయారు. 2005 జూన్‌ నాగ్‌పూర్ లెవెల్‌ క్రాసింగ్‌ దగ్గర ప్రమాదంలో 55 మంది దుర్మరణం పాలయ్యారు. 2011 జులై 7న ఉత్తరప్రదేశ్‌లోని ధరియాగంజ్‌ లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద ఓ పెళ్లి బృందాన్ని రైలు ఢీకొట్టడంతో 38 మంది మరణించగా, 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడే అధికారులు కళ్లు తెరిచి ఉంటే ఇప్పుడీ దారుణం జరిగేది కాదు. 
 
దేశ వ్యాప్తంగా కాపలా లేని రైల్వే క్రాసింగ్‌ నరకానికి దారులు తెరుస్తున్నాయి. గత మూడేళ్లలో ఇలాంటి రైల్వే క్రాసింగ్‌ల వద్ద జరిగిన ప్రమాదాల్లో 200 మంది మరణించారు. 2013లో రైల్వే క్రాసింగ్‌ వద్ద ప్రమాదాల్లో 48 మంది చనిపోగా 2012లో 115 మంది మరణించారు. ఇక అంతకుముందు ఏడాది 31 మంది చనిపోయారు. ఇక ఇప్పుడు 16 మంది చిన్నారులు బలయ్యారు. ఇలా మన దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ ఇలాంటి అన్‌మ్యాన్డ్ రైల్వే క్రాసింగ్స్‌ వద్ద జరిగిన ప్రమాదాల్లో 12,582 మంది మరణించినట్లు అంచనా. 
 
ఏటా రైల్వేల ఆధునికీకరణకు కోట్లు తగలేస్తున్నామంటున్న రైల్వే శాఖ, ఇలాంటి గేట్ల భద్రతను గాలికొదిలేస్తోంది. కొత్తగా ఏర్పాటు చేసే రైల్వే లైన్ల మార్గంలో బ్రిడ్జిగానీ, లేదా గార్డును కానీ ఏర్పాటు చేయాలని 2012-17 మధ్య 12వ పంచవర్ష ప్రణాళికలో నిర్ణయించారు. ఈ లెవెల్‌ క్రాసింగ్‌ల మీద నియమించిన అనిల్‌ కక్కోదర్ కమిటీ.. దేశంలోని అన్‌ మ్యాన్డ్ లెవెల్‌ క్రాసింగ్‌ల వద్ద ఫ్లైఓవర్లు, గార్డులను ఏర్పాటుకు 50 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేసింది. ఏటా వందల కోట్లు ప్రమాదం జరిగాక ఎక్స్‌గ్రేషియాకి ఇవ్వడానికి రైల్వే శాఖ దగ్గర, రాష్ట్ర సర్కార్ల దగ్గరా ఉంటుంది కానీ, ప్రమాదాలు నివారించేలా చిన్న ఫ్లైఓవర్ కట్టేందుకు మాత్రం నిధులుండవు. 
 
మరి ఈ కమిటీ నివేదిక ఇప్పటికీ పట్టాలెక్కలేదు. విదేశాల్లో ఆటోమేటెడ్ రైల్వే లెవెల్‌ క్రాసింగ్ వ్యవస్థలున్నాయి. అవి లేనిచోట్ల జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ మనదేశంలో మాత్రం ఇంకా అన్‌మ్యాన్డ్‌ రైల్వే క్రాసింగ్‌లను గాలికొదిలేసి ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. పాసింజర్‌ ట్రైన్లతోనే ఇంతటి భీభత్సం జరుగుతోంటే.. మన పాలకుల ఈ పట్టాలపైనే బుల్లెట్‌ ట్రైన్లు వేస్తానని చెప్తున్నారు. అసలు నగరాల్లో కూడా రైల్వే క్రాసింగ్‌ వద్ద చిన్న ఫ్లైఓవర్ కట్టలేని పాలకులు, బుల్లెట్‌ ట్రైన్లు తెస్తారంటే నమ్మగలమా?
 
ఎక్కడివరకో ఎందుకు హైదరాబాద్‌లో సాక్షాత్తూ రాజ్‌భవన్ ముందున్న రైల్వే గేటు దగ్గరే ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా ఇప్పటికీ ఇక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాటు చెయ్యలేదు. ఇలా దేశవ్యాప్తంగా ఎన్నో లెవెల్‌ క్రాసింగ్‌లు ఉన్నాయి. వాటిలో ఏటేటా ఇలాగే ఎందరో అమాయకులు బలవుతూనే ఉన్నారు. ప్రమాదం జరిగాక అధికారులు, అమాత్యులు సంతాపాలు తెలపడం తప్ప చేస్తోందేమీ లేదు. ఇంకా ఈ రైల్వే క్రాసింగ్‌లను ఇలాగే వదిలేస్తారో? లేక యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపట్టి గేట్లు నిర్మిస్తారో తెలియదు? పళ్లూడగొట్టి పన్నులు వసూలు చేసే ప్రభుత్వాలు, మోయలేనంతగా ఛార్జీలు పెంచే రైల్వే శాఖ.. ఇప్పటికైనా శాశ్వత ప్రాతిపదిక చర్యలు చేపట్టకపోతే... ఇలా ఇంకెందరు అమాయకులు బలవ్వాల్సి వస్తుందో?