మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : మంగళవారం, 16 జూన్ 2015 (15:36 IST)

ఓటుకు నోటు కేసు : నోటీసులు ఏ చంద్రబాబు నాయుడుకి...? టీడీపీ అధ్యక్షుడికా.. ? ఆంధ్రా ముఖ్యమంత్రికా..?

ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ట్రాలలో దుమారం రేపుతోంది. రెండు రాష్ట్రాలలో రాజకీయ వేడి పుట్టిస్తోంది. తెలుగుదేశం నాయకులలో ఆందోళనకర వాతావరణం నెలకొని ఉంది. ఆడియో టేపుల ద్వారా, రేవంత్ విచారణ సారాంశాన్ని బట్టి చంద్రబాబు నాయుడుని నిందితుడిగా చేర్చే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక వేళ తెలంగాణ అధికారులు నోటీసులు ఇస్తే ఎవరికి ఇస్తారు.? తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకా..? లేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకా..? అనే అంశం ఆసక్తికరంగా మారింది. 
 
ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రూ. 50 లక్షలు స్టీఫెన్ సన్ కు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఆ సందర్భంగా ఆయన చెప్పిన బాస్ ఎవరు అనేది అందరికి తెలిసిందే అయినా... ఇక్కడ ఏ చంద్రబాబు నాయుడు అనేది పెద్ద ప్రశ్న.. ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడా..? తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడా..? ఇద్దరు ఒకటే అయినా ఇక్కడ సాంకేతికంగా ఇద్దరు వేర్వేరు. రేవంత్ ను విచారించిన ఏసీబీ అధికారులు బలమైన ఆధారాలనే సేకరించారు.
 
అయితే అది తెలుగుదేశం పార్టీ చేసిన వ్యవహారం. ఓటుకు నోటు పూర్తిగా తెలంగాణ అంతర్గత వ్యవహారం కాబట్టి వారు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకే నోటీసులు ఇచ్చినట్లు బయట ప్రచారం జరుగుతోంది. అందుకే ఎన్టీయార్ ట్రస్టుభవన్ వద్ద అంతటి హడావుడీ నెలకొందనే తెలుస్తోంది. ఎక్కడెక్కడో ఉన్న ప్రధానమైన నాయకులు ఎన్టీయార్ ట్రస్టు భవన్ చేరుకుంటున్నారు. ఒక వేళ ఇచ్చినా.. ఇవ్వబోయినా అధ్యక్షుడి స్థానంలో ఆయన అందుకోవాల్సి ఉంటుంది.
 
తెలంగాణ అధికారులు హడావుడి చేస్తున్నారే గానీ, ఇచ్చారని ఎక్కడ చెప్పడం లేదు. ఇక తెలుగుదేశం పార్టీ కూడా ఈ విషయాన్ని ఎలా ఇస్తారని చెబుతోందనే తప్ప ఇచ్చారా లేదా అనే అంశాన్ని మాట్లాడడం లేదు. మొత్తం వాతావరణం వాడివేడిగా ఉంది. సమావేశాలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక వేళ తెలుగుదేశం అధ్యక్షుడి స్థాయిలో నోటీసులు వచ్చినా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.