శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By chj
Last Modified: గురువారం, 15 సెప్టెంబరు 2016 (13:31 IST)

ప్రపంచం మెచ్చిన ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య... డీటిపి ఆపరేటర్‌గా మారుతున్న నేటి ఇంజినీర్... ఎందుకు?

ఆనకట్టల రూపశిల్పి మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజనీర్స్ డే జరుపుకోవడం ఆనవాయితీ. ఈ శుభ తరుణాన నేడు ఇంజనీరింగ్ విద్యా విలువలు ఏ విధంగా ఉన్నాయి? ఇంజనీరింగ్ కళాశాలలు ఎలాంటి విద్యార్థులను తయారుచేస్తున్నాయి? ఎంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు భావి జీవితం

ఆనకట్టల రూపశిల్పి మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజనీర్స్ డే జరుపుకోవడం ఆనవాయితీ. ఈ శుభ తరుణాన నేడు ఇంజనీరింగ్ విద్యా విలువలు ఏ విధంగా ఉన్నాయి? ఇంజనీరింగ్ కళాశాలలు ఎలాంటి విద్యార్థులను తయారుచేస్తున్నాయి? ఎంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు భావి జీవితంలో తాము ఆయా రంగాలలో రాణిస్తున్నారనే విషయాన్ని గూర్చి విశ్లేషించుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది. గతంలో సంయుక్త తెలుగు రాష్ట్రంలో 15 ఇంజనీరింగ్ కళాశాలలు ఉండేవి. ఆనాడు ఇంజనీరింగ్ చదవడమంటే చాలా గొప్పగా ఉండేది. ఆయా కళాశాలలు అంతే విలువలతో ముందుకు సాగేవి. 
 
నేడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో 650 పైగా ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ఇంజనీరింగ్ విద్యార్థులు కోర్సులు ముగించుకొని బయటకు వస్తున్నారు. కళాశాలలు పెరిగే కొద్దీ ఇంజనీరింగ్ విద్యలో విద్యా విలువలు పడిపోయాయనేది అందరూ అంగీకరించాల్సిన నిత్య సత్యం. నేడు కళాశాలలో చదివే విద్యార్థులు లేక సీట్లు మిగిలిపోతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయంబర్స్‌మెంట్ వల్ల అప్పటివరకు సామాన్యులకు అందని ద్రాక్షగా ఉన్న ఇంజనీరింగ్ విద్య అందరికీ అందుబాటులోకి వచ్చింది. అనేకమంది పేదలు ఇంజనీరింగ్ పట్టభధ్రులయ్యారు. సంతోషం. కానీ ఫీజ్ రీయంబర్స్ మెంట్ విధానమే ఇంజనీరింగ్ విద్యా విలువలను నీరు గార్చిందనే విమర్శలు బలంగా ఉన్నాయి.
 
రాష్ట్రంలో టాస్క్‌ఫోర్స్ కమిటీలు 686 కాలేజీల్లో తనిఖీలు చేయగా వాటిల్లో 95 శాతం కాలేజీల్లో లోపాలు ఉన్నట్టు తేలింది.  ప్రధాన కాలేజీల్లోనూ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ లేరు. దాదాపు 90 శాతం కళాశాలలు బోధన సిబ్బందికి ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఆరో వేతన కమిషన్ పేస్కేలు ఇవ్వడం లేదు. అలాగే బోధనేతర సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న 9వ పీఆర్‌సీ వేతనాలు అమలుచేయడం లేదు. కొన్ని కాలేజీలు భారీగా వేతనాలు ఇస్తున్నట్టు బ్యాంకు ఖాతాల్లో మాత్రమే చూపుతున్నాయి. ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక ఫ్యాకల్టీ ఉండాల్సి ఉన్నా 75 శాతం కాలేజీల్లో ఆ నిష్పత్తిలో ఫ్యాకల్టీ లేరు. 164 కాలేజీలు మాత్రమే ఆరో వేతన స్కేళ్లను అమలు చేస్తున్నా, అదీ అందరికి ఇవ్వడం లేదు. ఫ్యాకల్టీకి ఎంటెక్, పీహెచ్‌డీ అర్హతలు ఉండాల్సి ఉన్నా 70 శాతం ఫ్యాకల్టీ బీటెక్ విద్యార్హతతోనే పనిచేస్తున్నారు. వారికి రూ.6 నుంచి రూ. 10 వేలు చెల్లిస్తూ బోధన కొనసాగిస్తున్నాయి. 60 శాతం కాలేజీల్లో ప్రయోగశాలలు, పరికరాలు లేవు.
 
దేశంలో ఎక్కడా లేనన్ని ఇంజనీరింగ్‌ కాలేజీలు ఒక్క ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రావడం గర్వకారణంగా ఉన్నప్పటికీ, ఆ కాలేజీల నిర్వహణలో అనేక లోపాలు తొంగిచూస్తున్నాయి. నాలుగేళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ కోర్సు పూర్తిచేసిన విద్యార్థి నెలకు నాలుగు వేలు, ఐదువేల రూపాయలకో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. అంటే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేయాల్సిన విద్యార్ధులు డిటిపి ఆపరేటర్లుగా కూడా సరిగా పనిచేయలేకపోతున్నారు. అంటే ప్రస్తుతం ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన విద్యార్థులలో కేవలం 16 నుంచి 20 శాతం మంది విద్యార్థులు మాత్రమే తగిన స్థాయి గల ఉద్యోగులుగా స్థిరపడుతున్నారు. మిగిలిన 84 శాతం మందికి చిల్లర మల్లర ఉపాధులే దిక్కవుతున్నాయి.
 
లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్‌లు తీసుకుని ఇంజనీరింగ్‌ కాలేజీలలో సీటు పొందిన విద్యార్థులు చివరకు ఎందుకూ పనికిరాకుండా పోవడానికి ప్రభుత్వ, తల్లిదండ్రుల పాత్రే అధికంగా ఉంటుంది. వాస్తవంగా చెప్పుకోవాలంటే కాలేజీలు స్థాపించిన యాజమాన్యాల పాత్ర చాలా తక్కువ. అప్పటి అవసరాల మేరకు ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలకు అనుమతులిచ్చేందుకు ద్వారాలు తెరిచిన సర్కారు, ఆయా కాలేజీలపై నియంత్రణ చేయలేదు. వ్యాపార దృష్టితో ఎన్ని కాలేజీలు వచ్చినా, వాటికి ఇష్టానుసారంగా అనుమతులు ఇస్తూ వచ్చింది. ఏ స్థాయిలో కూడా నాణ్యత లేని కాలేజీలను అడ్డుకోలేదు. దీంతో పుట్టగొడుగుల్లా ఇంజనీరింగ్‌ కాలేజీలు పుట్టకొచ్చాయి. సీట్లు కూడా అవసరానికి మించి పెరిగిపోయాయి. దీంతో కాలేజీలలో సీట్ల భర్తీ గగనంగా మారింది.
 
ఇంటర్మీడియేట్‌ పూర్తిచేసిన ప్రతిఒక్క విద్యార్థి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కావాలనే కోరుకున్నారు కాని సీట్లు తక్కువ, డిమాండ్‌ ఎక్కువ కావడంతో ప్రతి ప్రైవేట్‌ కాలేజీ యజమాన్యం ఈ కోర్సు నిర్వహిచడానికి ఏఐసిటిఈకి దరఖాస్తు పెట్టుకోవడం, ఇష్టానుసారంగా అనుమతులు తెచ్చుకోవడం సర్వసాధారణంగా మారింది. ఆ తర్వాత ఐటి రంగం కుదేలు కావడంతో ఆ కోర్సులో అడ్మిషన్‌ పొందడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. ఈ క్రమంలో సీట్ల సంఖ్య భారీ సంఖ్యలో మిగలడం ఆనవాయితీగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 687 ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలలో 90 శాతం కాలేజీలలో ప్రమాణాలు లోపించాయి. విద్యాబోధన పూర్తిగా కొరవడింది. ఆయా కాలేజీలలో బోధకులు కరవయ్యారు. ఎంటెక్‌, పిహెచ్‌డీ పట్టాలు పొందినవారితో పాఠాలు చెప్పించాల్సిన కాలేజీ యాజమాన్యాలు బిటెక్‌ సీనియర్‌ అభ్యర్థులతోనే పాఠాలు బోధింపచేస్తున్నాయి. దీన్ని బట్టి, ఆయా కాలేజీలు ఏఐసిటిఈ నిబంధనల ప్రకారం కనీస ప్రమాణాలు పాటించడం లేదన్న స్పష్టత వచ్చింది. 
 
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఫీజు రియింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశ పెట్టి పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల తరుపున సర్కారే ట్యూషన్‌ ఫీజు మొత్తాన్ని కాలేజీ యాజమాన్యాలకు చెల్లించే ఏర్పాటు చేసింది. దీంతో నాణ్యత లేకపోయినా, ఫీజు రియింబర్స్‌మెంట్‌ రూపంలో యాజమాన్యాలకు డబ్బు వచ్చి పడుతుంది. ఈ డబ్బు రుచి చూసిన యాజమన్యాలు మరికొన్ని ఇంజనీరింగ్‌, ఫార్మసీ, ఎంబిఎ, ఎంసిఎ కాలేజీల స్థాపనకు ముందు రావడమే కాదు, దొడ్డి దారిన అనుమతులు కూడా తెచ్చుకున్నాయి. ఇంజనీరింగ్‌ కాలేజీలలో గతంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఇకనుంచెైనా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిండానికి ప్రభుత్వం కృషి చేయాలి. కాలేజీలపై తనకున్న నియంత్రిణ అధికారాలను ఉపయోగించి ఇంజనీరింగ్ విద్యను గాడిలో పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. 
 
ఇందులోభాగంగానే టాస్క్‌ఫోర్స్‌ల ద్వారా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించి విద్యా విలువలను, నాణ్యతలను పాటించని కళాశాలలపై కొరడా ఝళిపించాలి. దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలన్న చందంగా ఫీజు రియింబర్స్‌మెంట్‌ నిధులు పూర్తిగా దుర్వినియోగం కాకముందే సర్కారు కళ్లు తెరవాలి. ఇకనుంచెైనా యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గకుండా నియమ నిబంధనల ప్రకారం పనిచేసుకుంటూ పోవాలి. అప్పుడు మాత్రమే విద్యార్థులకు సాంకేతిక విద్యలో నాణ్యతను పెంపొందింపచేయడం సాధ్యపడుతుంది. మంచి ఇంజనీర్లను తీర్చిదిద్దేందుకు అవకాశాలు కల్పించవలసిన బాధ్యత కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. ఈ బాధ్యతను ఇకనైనా సక్రమంగా నిర్వహిస్తే భవిష్యత్తులో సామర్ధత, సామర్ధ్యం ఉన్న భావి ఇంజనీర్లను సమాజానికి అందించగలిగినవారవుతారు.