శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : బుధవారం, 30 సెప్టెంబరు 2015 (10:41 IST)

ఇక్కడ తమ్ముడు... అక్కడ అన్న.. నందమూరి ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసిన బాబు

అపరచాణుక్యుడు అనే పేరును చంద్రబాబు మరోమారు రుజువు చేసుకున్నారు. అంతర్గతం వచ్చే సమస్యలను అవలీలగా పరిష్కరించగల దిట్ట.. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ ఒగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో కూడా తెలిసిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కమిటీలను ప్రకటించడంలో కూడా చాలా సమతుల్యాన్ని పాటించారు. రాష్ట్ర అసెంబ్లీలో బాలకృష్ణకు అవకాశం కల్పించిన ఆయన, కేంద్ర కమిటీలో నందమూరి హరికృష్ణకు అవకాశం కల్పించి నందమూరి కుటుంబం నుంచి విమర్శలు రాకుండా జాగ్రత్త పడ్డారు. 
 
తెలుగుదేశం పార్టీలో నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీయార్‌లకు ప్రాధాన్యత తగ్గించిన విషయం తెలిసిందే. జూనియర్‌ను దాదాపుగా పట్టించుకోని స్థాయికి వెళ్లిపోయారు. జూనియర్ కూడా దూరంగానే ఉన్నారు. హరికృష్ణను మాత్రం అలా పెట్టి ఉంచారు. ఎన్నికల సమయంలో నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ లేకపోతే ఇబ్బంది కలుగుతుందనే విషయాన్ని గ్రహించిన చంద్రబాబు హిందూపురం నుంచి బాలకృష్ణను రంగంలోకి దింపారు. ఆయనను అసెంబ్లీలోకి తీసుకున్నారు. అయితే హరికృష్ణ మాత్రం టచ్ మీ నాట్ అన్నట్లే వ్యవహరించారు. తరువాత పోలిట్ బ్యూరో సభ్యుని స్థాయిలో మహానాడులో కనిపించారు. 
 
అదే మహానాడులో తెలుగుదేశం పార్టీని జాతీయ స్థాయి పార్టీ చంద్రబాబు ప్రకటించారు. అనంతరం తాను అధ్యక్షుడుగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే తాజాగా ఆ పార్టీకి జాతీయ స్థాయి, రెండు తెలుగు రాష్ట్రాలకు కమిటీలను ప్రకటించారు. ఈ ప్రకటనలో చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. జాతీయ స్థాయి కమిటీలో నందమూరి ఫ్యామిలీ ప్రాతినిథ్యం ఉండేలా చూసుకున్నారు. అందుకే నందమూరి హరికృష్ణను పోలిట్ బ్యూరోలో సభ్యత్వం కలిగించారు. ఇక్కడ తమ్ముడు బాలకృష్ణకు శాసనసభలో స్థానం కలిగించారు. ఇలా నందమూరి ఫ్యామిలీని బాబు బ్యాలెన్స్ చేశారు. 
 
ఇదిలా ఉండగా తెలంగాణలో సమస్య తలెత్తే అవకాశం రావడంతో అక్కడ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసి ఆ బాధ్యతలను రేవంత్ రెడ్డికి అప్పగించారు. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో ప్లోర్ లీడర్‌గా దయాకర్ రావును కేంద్ర పోలిట్ బ్యూరోలోకి కూడా తీసుకున్నారు. ఇక తన కుమారుడి స్థానం, ప్రాధాన్యత తగ్గకుండా చూసుకున్నారు. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా పోలిట్ బ్యూరోలోకి, ఉపాధ్యక్షుడిగా కేంద్ర కమిటీలో స్థానం కల్పించడం విశేషం. అంటే పార్టీపై తన కొడుకుకు అన్ని రాష్ట్రాలలో పట్టు సాధించే దిశగా ప్రయత్నాలు చేశారు. చివరకు ఆ స్థానంలో ఆయనను నిలిపారు. అయినా అక్కడక్కడా అసమ్మతి సెగలు రేగకుండా ఉండే అవకాశం లేకపోలేదు.