శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Modified: బుధవారం, 18 మార్చి 2015 (16:05 IST)

చంద్రబాబుకు వయస్సు మీద పడుతోందా..? యోగా బాబా చెప్పిన పాఠాలు పని చేయలేదా..?!

చాలా సహనంగా ఓపికగా కనిపిస్తూ అపరచాణిక్యుడుగా కనిపించే ఆయన ఈ మధ్యలో నోరు పారేసుకుంటున్నాడు.. తనపై వచ్చే ఏ చిన్న విమర్శను కూడా తట్టుకోలేకపోతున్నాడు.. ఎందుకు..? చంద్రబాబుకు వయసు మీద పడుతోందా...! సుధీర్ఘ కాలం రాష్ట్ర రాజకీయాలలో తిరుగులేని నాయకుడుగా ఇటు ముఖ్యమంత్రిగా, అటు ప్రతిపక్ష నేతగా సక్సెస్ ను సాధించిన ఆయన ప్రతిపక్షాన్ని ఎందుకు భరించలేక పోతున్నారు..? యోగా బాబా ఇచ్చిన చిట్కాలేవి పని చేయడం లేదా...? కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలి వలన కలుగుతున్న ఒత్తిడిని భరించలేకపోతున్నారా..? ఆయన వ్యవహర శైలి చూస్తే అవే అనుమానాలు కలుగుతాయి. 
 
చంద్రబాబు అంటే ఎన్నికలకంటే ముందు చాలా పెద్దగా ఆశలు ఉండేవి. పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తి పెద్దగా లెక్క చేయకపోయినా ఏ మాత్రం తొందరపడకుండా భేషిజాలకు పోకుండా నేరుగా ఆయన ఇంటికి వెళ్ళి తనకు అనుకూలంగా మార్చుకున్న తెలివితేటలున్న వ్యక్తి చంద్రబాబు. రాష్ట్ర విభజన సమయంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. లేఖలు ఇచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని విపక్షాల ఆరోపణలను చాలా తెలివిగా తిప్పి కొట్టగలిగారు. ఇక అధికారంలోకి రావడం కష్టమేననుకుంటున్న సమయంలో కూడా సిద్ధాంతపరంగా తమతో ఏ మాత్రం సరిపోరని తెలిసినా వారిని పార్టీలో చేర్చుకుని రాష్ట్ర ఎన్నికలలో అధికారంలోకి వచ్చారు... 
 
రాష్ట్ర విభజన తరువాత తాను ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయితే అప్పటి నుంచి సీన్ మారిపోయింది. రాష్ట్ర ఆయన ప్రతీ చిన్న విషయానికి చిర్రెత్తిపోతున్నారు. ఇందుకు కారనం ఏంటి..? కేంద్రం నుంచి భారీ స్థాయిలో నిధులు వరదలా వస్తాయని భావించారు. కానీ మోడీ రిక్త హస్తం చూపించడంతో బాబు అరికాలి మంట నెత్తికెక్కుతోంది. అలాగని నోరు మెదిపే పరిస్థితి లేదు. నోరు తెరిచి విమర్శలు చేస్తే ఉన్న ఆసరా కూడా పోతుందనే భయం.
 
మరోవైపు జగన్.. ప్రతిపక్ష నేతగా కూడా సక్సెస్ కాలేరేమోనని అనుకున్నారు. ఒక్క చంద్రబాబే కాదు. బయట ఉన్న విశ్లేషకులు కూడా ఇదే అనుమానాలను మొదట్లో వ్యక్తి చేశారు. దీంతో చంద్రబాబు తన ప్రభుత్వాన్ని నల్లేరుపై నడకలా సాగించవచ్చని అనుకున్నారు. అయితే రాజధాని భూసేకరణ మొదలుకుని సాగు నీటి ప్రాజెక్టుల వరకూ జగన్ ప్రతిపక్ష నేతగా రాటుదేలుతున్నారు. అధికార పక్షం రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా సమాధానాలు చెబుతూ, అధికార పక్షాన్ని ఎండగట్టే పనిలో నిమగ్నమై ఉంటున్నారు. దీంతో చంద్రబాబుకు ఇంటా బయటా అన్ని చోట్ల ఎదురీత తప్పడం లేదు. 
 
ఒకవైపు వయస్సు మీద పడుతోంది. మరోవైపు ఒత్తిళ్ళు పెరుగుతున్నాయి. ఇచ్చిన రుణమాఫీ హామీ అంతంత మాత్రంగానే నెరవేర్చగలిగారు. ఇక డ్వాక్రా రుణాల మాఫీ ఊసే లేదు. ఉద్యోగ ఉపాధి అవకాశాల ఆనవాళ్ళు కనిపించడం లేదు. అన్నింటి మీద ఆశలు పెట్టుకున్న వారి నుంచి ఒత్తిడి పెరుగుతోంది. వీటిని భరించే సహనాన్ని చంద్రబాబు కోల్పోతున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఆయన అసెంబ్లీలో వ్యవహరించిన తీరు ఒక్కటి చాలు ఆయన ఎంతగా సహనాన్ని కోల్పోతున్నారనేందుకు ఉదాహరణ. సమాధానం చెప్పలేక అంతుతేలుస్తా... వదిలి పెట్టననే పదాలతో ఒక రకంగా చెప్పాలంటే బెదిరింపులకు దిగుతున్నారనే చెప్పాలి. 
 
ఎమ్మల్యేలకు ఎంపిలకు, మంత్రులకు ఆ మధ్యలో ఆయన యోగా బాబాతో పాఠాలు చెప్పించారు. యోగా శిక్షణ కూడా ఇప్పించారు. ఆయన కూడా యోగా చేశారు. ఇదంతా ఒత్తిడి భరించడానికేనని సెలవిచ్చారు కూడా.. మరి యోగా బాబా చెప్పిన పాఠాలు బుర్రకెక్కలేదా.. లేక ఆసనాలు పనిచేయలేదో బాబుకే తెలియాలి.