శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : బుధవారం, 15 జులై 2015 (15:06 IST)

పార్టీపై చంద్రబాబు పట్టుకోల్పోతున్నారా.. ఇంటిపోరును చక్కదిద్దలేకున్నారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత పార్టీ తెలుగుదేశంపై పట్టుకోల్పోతున్నారా? అందుకే ఇంటిపోరును చక్కదిద్దలేక చిక్కుల్లో పడుతున్నారా? ఈ కారణంగానే ఇసుక రీచ్ వ్యవహారంలో సొంత పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై విజయవాడ ఎంపీ కేశినేని నానిలు తమ రౌద్రాన్ని ప్రదర్శించారా? వంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 
 
పదేళ్ళపాటు ప్రతిపక్షంలో కూర్చొన్న చంద్రబాబు... నానా కష్టాలుపడి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చారు. ఓవైపు పార్టీ అధినేతగా, ప్రభుత్వాధినేతగా ఆయన క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు. దీంతో పార్టీ కార్యకలాపాలపై అంతగా శ్రద్ధ చూపడం లేదు. ఫలితంగా పార్టీ నేతలు గాడితప్పినట్టు కనిపిస్తున్నారు. 
 
ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు పరిస్థితి పూర్తిభిన్నంగా వుందని చెప్పొచ్చు. తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఎండమావిగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాదని ఒక్క అడుగు కూడా వేయలేని స్థితి. టీఆర్‌ఎస్‌లో కర్త, కర్మ, క్రియ కూడా కేసీఆర్‌ మాత్రమే! 
 
కానీ, తెలుగుదేశం పార్టీలో కూడా పైకి అటువంటి వాతావరణమే కనిపిస్తున్నప్పటికీ, అంతర్గతంగా మాత్రం పరిస్థితి వేరు. ఇందుకు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌తో తెలుగుదేశం ఎంపీలు పెట్టుకున్న పేచీ, ఇసుక రీచ్‌ వివాదంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ప్రదర్శించిన దుందుడుకు వైఖరులే కారణం. 
 
నిజానికి ఆవేశపరుడైన హీరో పవన్‌ కల్యాణ్‌ ఓటుకు నోటు, సెక్షన్ 8, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఇందులో ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై తన స్పష్టమైన వైఖరిని వెల్లడించనే లేదు. కానీ సెక్షన్ 8 వద్దని తేల్చిచెప్పారు. పనిలోపనిగా సీమాంధ్ర ఎంపీలపై విమర్శలు గుప్పించారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీలకు ఎక్కడలేని రోషం వచ్చింది. 
 
దీంతో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, విజయవాడ ఎంపీ కేశినేని నానిలు రెచ్చిపోయారు. ఎపుడో మీడియా ముందుకు వచ్చే కనిపించే పవన్ కళ్యాణ్ మాటలను సీరియస్‌గా తీసుకుని గాలికిపోయే కంపను నెత్తినవేసుకున్నట్టుగా వ్యవహరించారు. ముఖ్యంగా కేశినేని నాని శృతిమించి స్పందించారు. దీనికి ప్రతిస్పందనగా పవన్‌ కల్యాణ్‌ అభిమానులు కూడా ఊగిపోయారు. దిష్టిబొమ్మల దహనం వరకు పరిస్థితి వెళ్లింది. 
 
అలాగే, కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా ఎంపీలు వ్యాపారాలు చేసుకోకూడదా? అని ప్రశ్నిస్తూనే.. మీ అన్న (చిరంజీవి) చేస్తున్నదేంటని పవన్‌ను నిలదీశారు. దీనికి ప్రతిగా ఎంపీలు వ్యాపారాలు మాత్రమే చేసుకోకూడదని పవన్‌ కల్యాణ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈ వ్యాఖ్య తగలాల్సిన చోటే తగిలింది. వాస్తవానికి టీడీపీలో సుజనా చౌదరికి ఆ స్థానం దక్కిందంటే అది కేవలం ఓ పారిశ్రామికవేత్తగానే అనే విషయం జగమెరిగిన సత్యం. ఈ వాస్తవాన్ని సుజనా చౌదరి ఇంకా గ్రహించినట్టు లేదు. మొత్తంమీద పవన్ కళ్యాణ్ వ్యవహారం సీరియస్‌గా వెళ్లడంతో మేల్కొన్న చంద్రబాబు పార్టీ నేతల నోటికి తాళం వేశారు. 
 
ఇకపోతే.. ఇసుక రీచ్ వ్యవహారంలో సొంత పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దూకుడు చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా చేసింది. వాస్తవానికి దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేనిది ఆది నుంచీ దుందుడుకు స్వభావమే! ఫలితంగానే ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారి ముఖ్యమంత్రి చంద్రబాబుకు తలపోటుగా పరిణమించింది. 
 
కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్‌ వనజాక్షి సరిహద్దులను అతిక్రమించి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇసుక రీచ్‌లో తవ్వకాలను అడ్డుకోవడం తప్పే అయినప్పటికీ.. ఆమె ఒక మహిళ అన్న సంగతి విస్మరించి చింతమనేని ప్రభాకర్‌ అనుచితంగా ప్రవర్తించడం అధికారపక్షాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఇలా సొంత పార్టీ నేతలు అదుపుతప్పడం చంద్రబాబుకు పార్టీపై పట్టుజారితుందని చెప్పేందుకు కొన్ని ఉదాహరణలు.