శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : బుధవారం, 27 జనవరి 2016 (05:38 IST)

లక్ష నాగళ్ళతో దున్నుతానన్న నోటితోనే రామోజీకి కేసీఆర్ సిఫార్సా?.. ఛీ అది నోరా.. బురదగుంటా?

దేశంలో రెండో అత్యుత్తమ పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ తెలుగు మీడియా మొఘల్ రామోజీ రావును వరించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ అవార్డుల జాబితాలో రామోజీ రావు పేరు చోటుచేసుకుంది. అయితే, రామోజీకి ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణం ఆయన పేరును రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిపార్సు చేయడమే. ఇదే ఇపుడు చర్చనీయాంశంగా మారడమే కాకుండా.. ప్రత్యర్థులు కేసీఆర్‌పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. 
 
నిజానికి తెలుగుదేశం పార్టీకి ఈనాడు పత్రిక ఓ కరపత్రంలాంటిదని విపక్షనేతలు కొన్నేళ్లుగా ప్రచారం చేస్తున్నారు. అలాగే, రామోజీ రావుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత దగ్గరి సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. దీంతో ఆయన పద్మ అవార్డు కోసం ఏపీ ప్రభుత్వం తరపున రామోజీ రావు పేరును సిఫార్సు చేశారు. 
 
అయితే, రామోజీ రావు పేరును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిఫార్సు చేయడమే ఇపుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్‌ శివార్లలో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్ళతో దున్నుతానంటూ ప్రగల్భాలు పలికారు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, కేసీఆర్ సీఎం కావడం, తెరాస సర్కారు మరో మూడునెలల్లో రెండేళ్లు పూర్తి చేసుకోనుండటం అంతా చకచకా జరిగిపోయింది. 
 
కానీ, రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్ళతో దున్నించిందీ లేదు కదా.. వారిద్దరు మంచి మిత్రులయ్యారు. పైగా... రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ రోజంతా విహరించి... రామోజీ రావు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు కూడా. అంతేనా.. ఇపుడు రామోజీకి పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేసి.. తన మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన ఉండని కేసీఆర్ మరోమారు నిరూపించారు. అందుకే ఇరువురు ముఖ్యమంత్రులకు రామోజీ రావు ధన్యవాదాలు తెలుపుతూ... ఈ అవార్డును ప్రజలకు అంకితమిస్తున్నట్టు ప్రకటించారు. ఎంతైనా పెద్దోళ్లు.. పెద్దోళ్లే కదా.