గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : గురువారం, 13 ఆగస్టు 2015 (07:25 IST)

బాబు ఘీంకరించారు...! మోదీ పలకరించారు..!! హోదాపై ఏం జరుగుతోంది..?

ప్రత్యేక హోదాపై రాష్ట్రంలో రకరకాల ఉద్యమాలు జరుగుతున్నా బాబు ఆచీతూచీ అడుగేశారు. ఎక్కడా స్పష్టమైన వ్యాఖ్యలు చేయలేదు. ఉద్యమాలతో పరిస్థితి చేయి దాటిపోతోందనే విషయాన్ని ఆయన గ్రహించినట్లున్నారు. అంతే రెండు రోజులుగా కసరత్తు చేస్తున్నారు. కేంద్ర మంత్రులతో మాట్లాడారు. తన వైఖరిని తేల్చి చెప్పేశారు. ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే వీలు కాలేదు. ఇదే బాబులో అసహనాన్ని పెంచేసింది. కీలక సమయంలో మిత్రపక్షం ఇలా చేస్తోందేనే అనుమానం ఆయనలో బలపడింది. ఇక స్వరం పెంచారు. ప్రత్యేక హోదాపై తమ బాధ్యతను మిత్రపక్షానికి గుర్తు చేశారు. మీడియా సమావేశంలో తమ వైఖరేంటో కుండబద్ధలు కొట్టారు. ఇదే కేంద్రంలో కదలిక తీసుకొచ్చింది. మోదీ నుంచి ఫోనొచ్చింది. అంటే తెరవెనుక వేడి పుట్టిందనే అంశం స్పష్టంగా కనిపిస్తోంది. అది ప్రత్యేక హోదానా..? లేక ప్రత్యేక ప్యాకేజీనా..? 
 
ప్రత్యేక హోదా అంశంపై ప్రస్తుతం టీడీపీ, బీజేపీ నేతల మధ్య ఢిల్లీలో తర్జనభర్జనలు నడుస్తున్నాయి. ఈ చర్చల్లో ఒక అంశంపై స్పష్టత వచ్చింది. తాము నేరుగా ప్రత్యేక హోదా ఇవ్వలేమని, దాని బదులు అంతకంటే మెరుగైన ప్రయోజనాలుండే ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా వల్ల ఏడాదికి రూ.2-3 వేల కోట్లకు మించి ఫలం దక్కదని, తాము ప్రతిపాదిస్తున్న ప్రత్యేక ప్యాకేజి వల్ల అంతకంటే మెరుగైన ప్రయోజనం ఉంటుందన్నదనేది వారి వాదన. ఊరికే ప్యాకేజి అంటే సరి పోదని, అందులో ఏముందో తొలుత తమతో చర్చించి తమకు సమ్మతమైతేనే ప్రకటించాలని టీడీపీ నేతలు సూచించారు.
 
హోదా బదులు ప్యాకేజివైపే కేంద్రం మొగ్గు చూపిస్తోందని స్పష్టమైన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు దానిపై దృష్టి సారించారు. ఈ ప్యాకేజి ఎలా ఉండాలని కోరుకొంటున్నామో నిర్దిష్టంగా కేంద్రానికి తెలపాలని, దీనిపై చర్చించడానికి గురువారం పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత విజయవాడ రావాలని ఆయన కేంద్ర మంత్రి సుజనా చౌదరిని ఆదేశించారు.
 
 ప్రత్యేకహోదాకే పోరాటం చేయాలని కోరారు. అలాకాని పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు పెట్టేవారికి ఆకర్షణీయ రాయితీలు, పన్ను మినహాయింపులు ఇవ్వాలని, పదేళ్లు లేదా ఐదేళ్ల పాటు ఏపీకి ఇచ్చే కేంద్ర పథకాలు, విదేశీ రుణాల్లో తొంభై శాతం గ్రాంటుగా ఇవ్వాలని, ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక సహాయం ఈ ప్యాకేజిలో ఉండాలన్నది ఏపీ ప్రతిపాదన. కానీ ఇందులో కొన్ని అంశాలపై కేంద్రం, ఏపీ సర్కార్ల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. కేంద్రం కొత్తగా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) తేవాలని అనుకొంటోంది. అదే అడ్డంకిగా మారుతోంది. 
 
ఇలాంటి పరిస్థితిలలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం ఒక్కటే మార్గమని తెలుగుదేశం భావిస్తోంది. ‘కేంద్రంలో కదలిక తేగలిగాం. ఈ వేడిని తగ్గనీయొద్దు. మనకు కావాల్సిన లేదా రావాల్సిన వాటిపై ఢిల్లీలో గట్టిగా పనిచేయండి. మనకు రాష్ట్రం... ప్రజలు ముఖ్యం. అందరూ కలిసి వెళ్లి మాట్లాడుతూ ఉండండి’ అని టెలికాన్ఫరెన్స్‌లో టీడీపీ ఎంపీలను చంద్రబాబు ఆదేశించారు. హోదా ఇస్తే మంచిది లేకపోతే ప్రత్యేక ప్యాకేజీ కూడా తాము కోరుకున్నట్లు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ పట్టుబడుతోంది. ప్రత్యేక హోదానా... ప్రత్యేక ప్యాకేజీనా.. వేచి చూడాల్సిందే.