గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Eswar
Last Modified: శుక్రవారం, 1 ఆగస్టు 2014 (20:14 IST)

మోడీ లైట్ తీస్కుంటున్నారా...? ఏం జరుగుతోంది? లెక్క తప్పిందా బాబూ?

వడ్డించేవాడు మనవాడైతే …. ఎక్కడ కూర్చున్నా నష్టం లేదు.. ఇంతకాలం చంద్రబాబు ఇదే ధైర్యంతో ఉన్నారా? ఇప్పుడా భరోసా పోతోందా? అనుకున్నంత ప్రాధాన్యత దొరకటం లేదా? బాబు సర్కారును కేంద్రం లైట్ తీసుకుంటోందా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లోపించిందా? అసలు రెండు ప్రభుత్వాలకూ సరైన రోడ్ మ్యాప్ లేదా? ఏపీ ప్రజలను రెండు ప్రభుత్వాలూ వదిలేశాయా? ఏం జరుగుతోంది? లెక్క తప్పిందా...బాబూ!
 
నాడు ప్రచారార్భాటం... నేడు సందిగ్ధం 
జూన్ 8, 2014 నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణం. అశేష ప్రజానీకం మధ్య చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, అగ్రనేతలు ఎల్ కె అద్వానీతో పాటు ఎంతోమంది బిజెపీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ వేడుక జరిగిన తీరు చూస్తే టీడీపీ, బిజెపీ మధ్య ఉన్న అనుబంధంతో ఏపీ దశ తిరుగిపోతుందని అనుకున్నారు కూడా. కానీ తరువాతే అసలు కథ మొదలైంది.
 
పొంతనలేని స్టేట్‌మెంట్లు, పస లేని వాదనలు.., ఢిల్లీలో ఓ మాట.. ఆంధ్రా గల్లీల్లో మరో మాట.  వెరసి సామాన్యుడికి అయోమయం. ఉచిత హామీలు కురిపించి గద్దెనెక్కిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఇదే తీరులో కనిపిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు లెక్కలు తారుమారయ్యాయా అనే సందేహం రావటంలో ఆశ్చర్యపడాల్సిందేం లేదు.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కానీ అసలు విషయం బోధపడటం లేదనిపిస్తుంది.. పగ్గాలు చేపట్టి రెండు నెలలు పూర్తి కావస్తున్నా హామీలపై స్పష్టత లేదు. పైగా రుణాల మాఫీపై చంద్రబాబు అస్పష్ట ప్రకటనలు మరింత గందరగోళం సృష్టిస్తున్నాయి. 
 
కోటయ్య కమిటీ సూచనల మేరకు  రైతు రుణ మాఫీ ఒక్కో కుటుంబానికి  లక్షన్నర వరకు మాఫీ చేస్తామని ప్రకటించారు. డ్వాక్రాలో ఒక్కొక్క గ్రూపుకు లక్ష రూపాయలే మాఫీ చేస్తామని ప్రకటించడంతో మహిళల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. రైతు రుణమాఫీపై కేంద్రం చేతులెత్తేయడంతో రుణాల రీషెడ్యూల్ కోసం చంద్రబాబు రిజర్వ్ బ్యాంకును ఆశ్రయించారు. అయితే రుణాల రీషెడ్యూలుకు రిజర్వ్ బ్యాంక్ షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. రీషెడ్యూలు చేసిన రుణాలను మూడేళ్లలోపు చెల్లించాలని షరతు విధించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఏడేళ్ల గడువు కోరుతోంది. ప్రజా వ్యతిరేకత రాకుండా చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. 
 
స్పష్టత లోపించి..
రాజధాని నిర్మాణానికి అయిదు లక్షల కోట్ల రూపాయిలు అవసరమని చంద్రబాబు అంచనా వేశారు. అయితే కేంద్రమంత్రి వెంకయ్య నాయుడి మాట ప్రకారం రాజధాని కేవలం పరిపాలనా కేంద్రంగానే రాజధాని వుంటుంది. మిగిలినవన్నీ వికేంద్రీకరణ దిశగా ఏర్పాటు అవుతాయి. ఇలా లెక్క చేసుకుంటే లక్షల కోట్లు రాజధానికి అవసరమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బడ్జెట్‌కు ముందు ఎంపీల సమావేశంలో చంద్రబాబు రాజధాని నిర్మాణానికి ఈ బడ్జెట్‌లో కనీసం అయిదువేల కోట్లు ఇవ్వాలని కోరారు.
 
గతంలో కేవలం రాజధాని ప్లానింగ్ కే 2500 కోట్లు అవుతుందని పేర్కొన్న బాబు బడ్జెట్‌లో ఐదు వేల కోట్లు కోరడం వెనక కారణం ఏంటి? ఐదు లక్షల కోట్లు అవసరం అనుకున్నపుడు కనీసం లక్ష కోట్లన్నా అడగాలి కదా. మోడీ ప్రభుత్వం అంత ఇవ్వదన్న అనుమానం బాబుకు కలిగిందా? లేక కేంద్రం 5 వేల కోట్లే ఇస్తుందన్న సూచనలు వచ్చాయా? అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణానికి ప్రధాని మోడీ హామీ ఇచ్చారని, నిధులపై కేంద్రం భరోసా ఉందని మున్సిపల్‌ మంత్రి, రాజధాని సలహా కమిటీ చైర్మన్ పి.నారాయణ పేర్కొన్నారు. అయితే రాజధానికి ఎంత నిధులు ఖర్చవుతాయో తెలియదని, ప్రస్తుతం లక్షా 40 వేల కోట్లు అంచనా వేస్తున్నామని ఆయన అంటున్నారు. 
 
ఆశ..  నిరాశ 
అరుణ్ జైట్లీ బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి నిరాశే ఎదురైంది. బడ్జెట్‌లో పోలవరంకు చట్టబద్దత కల్పించడం, ఎయిమ్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయం మంజూరు తప్ప ఆంధ్రప్రదేశ్‌కు పెద్దగా ఒరిగిందేమి లేదన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి నిధుల కేటాయింపుపై స్పష్టతే ఇవ్వలేదు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తుందన్ని ఆశించారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే అన్ని రాష్ట్రాల నుంచి డిమాండ్లు వస్తాయని భావించిన కేంద్రం దాని జోలికే వెళ్లనే లేదు. ఇక తీరప్రాంత అభివృద్ధి గురించి కానీ, విశ్వవిద్యాలయాల ఏర్పాటులో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి , కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఎలాంటి స్పష్టత లేదనే చెప్పాలి. ప్రతి అంశం కేంద్రం వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా నడుస్తోంది. బయటకి మాత్రం అన్యోన్యంగా కనిపిస్తున్నా లోపల కనిపించని లుకలుకలున్నాయని పరిశీలకుల వాదన. 
 
ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తికావచ్చినా ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అమలుపరచకుండా అవే వాగ్దానాలను తిరిగి తిరిగి చెప్తున్నారు. టిడిపి ఎన్డీఏ ప్రభుత్వంతో భాగంగా ఉంది. దీంతో నిధుల వరద పారుతుందనే భ్రమలు బాగా కల్పించారు. ఒకవైపు వెంకయ్య నాయుడేమో దేశంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో ఏపి ఒకటి అని మాట్లాడుతుండగా, మోడీ అసలు ఏపీ ఊసే ఎత్తడం లేదు. బీజేపీ రాష్ట్ర నాయకత్వమేమో ఆ హామీలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. అవి కేవలం టీడీపీ హామీలు అని చెప్తోంది. మొత్తానికి బీజేపీ, టీడీపీ, రాష్ట్ర బిజెపీల మధ్య మూడు స్తంభాలాట నడుస్తోంది.  
 
ఎన్నికల ప్రచారం సమయంలో బాబు వస్తే జాబు వస్తుంది అని హామీ ఇచ్చారు. ఎన్డీఏ వస్తే ఉద్యోగాలు వస్తాయి అని ప్రజలు ఆశించారు. కానీ ఎలాంటి ప్రణాళిక లేకుండా హామీలు గుప్పించారు. అసలు వారిద్దరి రోడ్ మ్యాప్ ఏంటి అనేది స్పష్టత లేదు.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని కోరుకుని దేశ ప్రజలు మోడీని ఎన్నుకున్నారు. కానీ మోడీ మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వ్యవసాయాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు. విద్యుత్ రంగం పట్ల అభివృద్ధి ఎలా సాధిస్తారు ఈ  విషయాల్ని రెండు ప్రభుత్వాలు ప్రకటించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా మరో పెద్ద విషయంగా మారింది. 
 
రుణమాఫీ సహా అన్ని అంశాలపై దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఏ విధమైన న్యాయం ఉంటుందో అదే మాదిరిగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు వర్తిస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అంటున్నారు. పైగా  ప్రధాని నరేంద్రమోడీ ఎవరి ఒత్తిడికి తలొగ్గరని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. దీంతో, చంద్రబాబు ప్రభుత్వం నిధుల వేటలో పడింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో అర్థమవుతున్న విషయం ఒకటే. ఎన్నికల్లో విజయం కోసం ఎత్తులు తప్ప నిజంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదేమోనన్నది.  
 
లైట్ తీస్కో బాబు ... 
అక్కడ మోడి, ఇక్కడ బాబు. ముందున్నవన్నీ మంచి రోజులు అనే ఇంప్రెషన్ బాగా ఇచ్చారు. కానీ, జరుగుతున్నది మాత్రం వేరు.. అటు కేంద్రం బాబు సర్కారుని, ఆంధ్రప్రదేశ్‌ని తేలిగ్గా తీసుకున్నట్టే అనిపిస్తుంది. కొత్త రాజధాని, కొత్త రాష్ట్రానికి ఉన్న సమస్యలు, హామీల అమలు ఇవన్నీ అంత తేలిక కాదనే సూచనలే బలంగా కనిపిస్తున్నాయి. గెలుపు కోసం నోటికొచ్చిన హామీలన్నీ ఇస్తే, అమలు చేయటంలో కచ్చితంగా ఇలాంటి సమస్యలే వస్తాయి. ఇవన్నీ కోరితెచ్చుకున్న సమస్యలుగా మారుతున్నాయి. వీటి నుంచి చంద్రబాబు నాయుడు సర్కారు ఎలా గట్టెక్కి వచ్చే ఐదేళ్లకు క్లీన్ మ్యాప్ తయారు చేసుకుంటుందో వెయిట్ అండ్ సీ.