గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : మంగళవారం, 29 సెప్టెంబరు 2015 (08:19 IST)

వచ్చే యేడాది మంత్రివర్గంలో మార్పులు... బడ్జెట్ సమావేశాల తరువాతే..

ఎప్పటి నుంచో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా పావులు కదుపుతున్నారు. అందుకు అవసరమైన గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. సాధారణంగా మంత్రివర్గంలో మార్పులు చేయాలంటే ఓ బలమైన కారణం చూపాలి. మంత్రులుగా ఉన్నవారికి తగిన సమయం ఇవ్వాలి. అయితే ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి వివిధ శాఖలపై కారాలు మిరియాలు నూరుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సీనియర్లు మంత్రివర్గంలో చోటు కోసం కాచుకుని ఉన్నారు. వీటన్నింటికి సమతుల్యం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు. వచ్చే ఏడాదిలో మార్పులు ఉండవచ్చుననే సంకేతాలు అందుతున్నాయి. 
 
రాష్ట్రం విడిపోయిన తరువాత తొలి సారిగా ఎన్నికలు జరిగి గత ఏడాది జూన్‌ 8 న తన మంత్రివర్గ బృందంతో కలిసి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. కానీ చాలా సందర్భాలలో చంద్రబాబు మాత్రం మంత్రుల పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్త్రీ,శిశుసంక్షేమ శాఖ, రెవెన్యూ, ఆరోగ్యశాఖ, సమాచార, సాంకేతిక శాఖలపై మండిపడుతూనే ఉన్నారు. అయితే వారిని తప్పించాలంటే అందుకు తగిన కారణాలు చూపాలి. అసమర్థులనే అర్థం తీసుకురావాలి. కొత్త రాష్ట్రం కాబట్టి కొంత సమయం కూడా వారికి ఇవ్వాలనేది ఆయన చేస్తున్న యోచన ఇలాంటి సమయంలో కనీసం యేడాదిన్నర సమయమైనా వారికి కేటాయించకుండా ఓ నిర్ణయానికి రావడం సరియైంది కాదని భావించారు. అయితే ఇప్పటికే 15 నెలలైంది. ఈ యేడాది చివరకు వరకూ ఆగితే యేడాదిన్నర పూర్తవుతుంది. అప్పటికే వారిని తప్పుబట్టి అర్థం ఉంటుందని అనుకుంటున్నారు. 
 
తరువాత బడ్జెట్ సమావేశాలు సమీపిస్తాయి. బడ్జెట్ సమావేశాలలో మంత్రులను మార్చినా, శాఖలలో మార్పులు చేర్పులు చేసినా గందరగోళ పరిస్థితి నెలకొంటుందని భావిస్తున్నారు. అందుకే వచ్చే యేడాది మార్చి తరువాత మంత్రి వర్గంలో మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం మంత్రివర్గంలో మరో ఆరుగురిని అదనంగా చేర్చుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. మంత్రివర్గంలో బెర్తుల కోసం అనేక మంది ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు సీనియర్లు శాసనమండలికి ఎన్నిక కావడంతో మంత్రి పదవులకు పోటీ పెరిగింది. 
 
ఈ మధ్యలో చంద్రబాబు తనతో భేటీ అయ్యే మంత్రులతో ఒకే మాట మాట్లాడుతున్నారు. శాఖలపై పట్టు పెంచుకోవాలని ప్రభుత్వ ప్రతిష్టను పెంచాలని కోరుతున్నారు. కొందరిపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటిని గమనిస్తే వచ్చే మార్చి లేదా ఆపై నెలలో మంత్రి వర్గమార్పులు ఖాయమని తెలుస్తోంది.