బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Eswar
Last Updated : సోమవారం, 7 జులై 2014 (16:34 IST)

భవనాల కింద నలిగిపోతున్న కూలీ బతుకులు... ఆపేదెలా...?

భవనాలు కుప్పకూలిన ఘటనల్లో దేశవ్యాప్తంగా ఏడాదికి కనీసం 2,600 మంది చనిపోతున్నారని నివేదికలు చెబుతున్నాయి. గతవారం ఢిల్లీ, చెన్నైల్లోనే భవనాలు కుప్పకూలి సుమారు వందమంది వరకూ మరణించారు. చెన్నైకు సమీపంలోని తిరువళ్లూరులో ఆదివారంనాడు గోడ కూలిన దుర్ఘటనలో 11 మంది చనిపోగా అందులో 9 మంది తెలుగువారున్నారు. ఇంకా గత వారం క్రితం పోరూరులోని మాన్‌గాడులో భవనం కుప్పకూలి సుమారు 80 మంది చనిపోగా అందులో 20 మందికి పైగా తెలుగువారే కావడం గమనార్హం. 
 
పూర్తిగా శిథిలాల తొలగింపునకే ఐదురోజుల వరకూ పట్టింది. గతవారం ఉత్తర ఢిల్లీలోని ఐదంతస్థుల భవనం ఇంద్రలోక్ కుప్పకూలిన ఘటనలో పదిమంది వరకూ చనిపోయారు. నిర్లక్ష్యం కారణంగా పదిమంది మృతికి కారణమైన అక్రమ నిర్మాణాన్ని చేపట్టిన భవన యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. అదే రోజు సాయంత్రం చెన్నై సమీపంలోని మాన్‌గాడులో నిర్మాణంలో వున్న 11 అంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనలో 80 మంది దాకా చనిపోయారు. భవనం కుప్పకూలిన రెండు ఘటనల్లో సుమారు ఇప్పటికి వందమంది చనిపోగా, చాలామంది క్షతగాత్రులయ్యారు. ఒక్కరోజే ఇటువంటి భారీ ప్రమాదాలు జరగడాన్ని చూస్తే ఏడాది మొత్తంగా ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా ఎన్నో జరుగుతున్నాయి. ఇటువంటి ఘటనలు ప్రజలకు ప్రమాద ఘంటికల్ని మోగిస్తున్నాయి.
 
భవనాలు కుప్పకూలి చనిపోయిన ఘటనల్లో దేశవ్యాప్తంగా ఏడాదికి సుమారు 2,658 మంది మృత్యువాత పడుతున్నారు. అంటే రోజుకు ఏడుమంది చనిపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క 2011 లోనే ఇలాంటి ఘటనలు జరిగి 3,161 మంది మృత్యువాత పడ్డారు. అధికారిక నివేదికల ప్రకారం డ్యాంలు, బ్రిడ్జిలు, భవంతులు, బీటలు వారిన ఇళ్లు కూడా ఇందులో వున్నాయి. ఇందులోనే ప్రత్యేకంగా ఇళ్లు, భవంతులు కూలిన ఘటనల్లో సంవత్సరానికి 1,260 మంది చనిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 
 
జనజీవనం ఎక్కువగా వున్న పట్టణాలు, నగరాల్లోనే భవంతులు, ఇళ్లు కూలిపోతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఒక్క ముంబయిలోనే రెండుమూడు వారాలకొకసారి భవనాలు కుప్పకూలుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. 2014 ఏప్రిల్‌లో ముంబాయిలో ఓ భవనం కుప్పకూలి 74 మంది చనిపోయారు. 2013 సెప్టెంబరులో మాజ్గాన్ పట్టణంలోని మున్సిపల్ భవనం కుప్పకూలిన ఘటనలో 61 మంది మృత్యువాత పడ్డారు. ఈ రెండు ఘటనల్లోనూ కుప్పకూలిన భవంతులు కాలం చెల్లినవి మాత్రం కావు. ముంబైలోని ముంబ్రాలోని భవనం అయితే నిర్మాణంలో వుండగానే కుప్పకూలింది. ముంబ్రాలో కూలిన భవనానికి స్థానిక అధికారుల నుంచి ఎటువంటి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను కూడా తీసుకోలేదు.
 
దేశవ్యాప్తంగా చూస్తే ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి ఏడాదికి సుమారు 150 మరణాలు భవనాలు కుప్పకూలిన ఘటనల్లోనే నమోదవుతున్నాయి. అయితే భవనాలు కుప్పకూలుతున్న ఘటనలన్నింటికీ భవన నిర్మాణానికి నాణ్యత లేని మెటీరియల్‌ను వాడటం, నిర్మాణం పూర్తయిన భవనాలకు పూర్తిస్థాయి నిర్వహణ పర్యవేక్షణ లేకపోవడాలే కారణాలుగా కనిపిస్తున్నాయి. ఒక్కసారి ప్రమాదం జరిగిందని తెలిసినప్పటకీ విపత్తు నిర్వహణ అధికారులు సకాలంలో స్పందించకపోవడం వల్ల కూడా చాలామంది చనిపోతున్నారు.
 
''భవనానికి ఏర్పడిన చిన్న పగుళ్లను కూడా నిర్లక్ష్యం చేయడం, ప్రమాదం జరిగేంత వరకూ దాన్ని పట్టించుకోక పోవడం వంటి ఘటనలు కేవలం మన దేశంలో మాత్రమే చూస్తున్నామని ముంబయికి చెందిన ఎడ్వకసీ గ్రూపు విపత్తు నిర్వహణ సంస్థ వ్యవస్థాపకులు రాధీ చెబుతున్నారు. భవనాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి ఏవైనా కొద్దిపాటి పగుళ్లు ఏర్పడితే, వెంటనే భవనంలో నివాసం వుంటున్న వారు యజమాని దృష్టికి తీసుకెళ్లాలి. ఇలా చేయడం ద్వారా చిన్నచిన్న పగుళ్లను కూడా సకాలంలో మరమ్మత్తులు చేపట్టి పెద్ద పెద్ద ప్రమాదాల్ని నివారించే అవకాశం వుంటుందని రాధీ చెప్పారు.
 
ఇలా భవనాలు కుప్పకూలిన ఘటనలకు యజమానుల్నే బాధ్యుల్ని చేయాలి. ఢిల్లీ , ముంబాయి వంటి నగరాల్లో భవనాలు కుప్పకూలి మృతిచెందిన ఘటనలకు భవన యజమానుల్నే బాధ్యులుగా చేస్తూ పోలీసులు అరెస్టులు కూడా చేశారని అడ్వకసీ గ్రూపు విపత్తు నిర్వహణ సంస్థ అధికారి సావ్లా తెలిపారు. ఇంకా భవనాలు కుప్పకూలిన ఘటనల్లో మరణాల సంఖ్య తగ్గించేందుకు విపత్తు సంస్థలు పూర్తి సామర్థ్యంతో పనిచేయడంతో పాటు వేగంగా స్పందించాల్సిన అవసరముందన్నారు. 
 
కేవలం మన దేశంలో మాత్రమే భవనాలు కూలిన ఘటనల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సావ్లా తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రాథమిక సహాయక చర్యల్ని గంటలో పూర్తి చేయాలని అంతర్జాతీయ ప్రమాణాలు చెబుతుండగా మన దేశంలో మాత్రం ప్రాథమిక సహాయక చర్యలు పూర్తి చేయడానికి రెండు మూడు రోజులు సమయం పడుతోందిన. మాన్‌గాడులో కూలిన భవనాలను పూర్తిగా తొలగించేందుకు ఏకంగా ఐదు రోజులు పట్టింది. అన్ని రోజుల పాటు శిథిలాల క్రిందే ఉండిపోవడం వల్ల మరణాల సంఖ్య పెరిగిపోతుంది.