గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : గురువారం, 28 జులై 2016 (15:31 IST)

తెలుగుదేశం పార్టీకి దూరంగా చిత్తూరు ఎమ్మెల్యే..! కారణమేంటి..!

రాజకీయాలు రోజుకో విధంగా మారిపోతున్నాయి. రాజకీయ నాయకులశైలి కూడా అదేవిధంగా తయారైంది. ఏ నాయకుడు, ఏ నాయకురాలు ఎప్పుడు ఏ విధంగా ఉంటారో ఎవరికీ తెలియదు.

రాజకీయాలు రోజుకో విధంగా మారిపోతున్నాయి. రాజకీయ నాయకులశైలి కూడా అదేవిధంగా తయారైంది. ఏ నాయకుడు, ఏ నాయకురాలు ఎప్పుడు ఏ విధంగా ఉంటారో ఎవరికీ తెలియదు. పార్టీలో తమకు సముచిత స్థానం ఇవ్వకపోయినా, పార్టీపై వీరే అలిగినా చివరకు వీరికే నష్టం. అది రాజకీయం. పార్టీలో తమ వారు కీలకంగా ఉంటూ మరణిస్తే ఆ పదవిని వారి బంధువులకే అప్పగిస్తే పార్టీ నాయకులు ఇచ్చే గౌరవం ఏ పాటిదో అందరికీ తెలిసిందే. చనిపోయిన నాయకుడికి ఇచ్చేంత మర్యాద కొత్తగా వచ్చిన వారి బంధువులకు ఇవ్వరనేది అందరికీ తెలిసిన విషయమే. అదే పరిస్థితి ప్రస్తుతం చిత్తూరు ఎమ్మెల్యే డి.కె.సత్యప్రభ ఎదుర్కొంటున్నారు. కొంతమంది పార్టీ నాయకుల వ్యవహార శైలి నచ్చక ఆమె పార్టీకే దూరంగా ఉంటూ వస్తున్నారు. అసలు డి.కె.సత్యప్రభ ఎందుకు మౌనంగా ఉంటున్నారు..కారణమేంటి.
 
డి.కె.ఆదికేశవుల నాయుడు. తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నాయకుడిగా ఉండడమే కాకుండా ఎంపిగా పనిచేసిన వ్యక్తి. అంతేకాదు వ్యాపారవేత్తగా కూడా ఈయనకు మంచి పేరే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా కూడా కొంతకాలం పనిచేశారు. అయితే అనారోగ్యం కారణంగా డి.కె.ఆదికేశవుల నాయుడు మరణించారు. అయితే ఆయన మరణానంతరం డి.కె.వారసులే రాజకీయాల్లోకి వస్తారని అందరూ భావించారు. అయితే చివరకు డి.కె.ఆదికేశవులు సతీమణి డి.కె.సత్యప్రభ రాజకీయ ప్రవేశం చేశారు.
 
రాజకీయంగా ఎలాంటి అనుభవం డి.కె.సత్యప్రభకు లేకున్నా ఎమ్మెల్యే సీటును ఇచ్చారు చంద్రబాబు నాయుడు. కారణం ఆదికేశవులనాయుడిపై బాబుకు ఉన్న మంచి అభిప్రాయమే. దాంతో పాటు సానుభూతి ఓట్లతో సత్యప్రభ గెలుస్తుందన్న నమ్మకంతో కూడా. అనుకున్న విధంగానే సత్యప్రభ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధిగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు.
 
అయితే ఇక్కడే ఉంది అసలు సమస్య. డి.కె.ఆదికేశవుల నాయుడు బతికి ఉన్నప్పుడు ఇచ్చిన మర్యాదలో కనీసం కొంతభాగం కూడా సత్యప్రభకు ఇవ్వడం లేదట తెలుగుదేశం పార్టీ నాయకులు. కనీసం ఎమ్మెల్యేగా కూడా స్థానిక నాయకులు గుర్తించడం లేదట. ఏదో సాధారణ నాయకురాలిగా కార్యక్రమాలకు హాజరై సైలెంట్‌గా వచ్చి వెళుతున్నారు డి.కె.సత్యప్రభ. తనకున్న అనుచరగణంతో మాత్రమే ఆమె పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. వారి అనుచరులు మాత్రమే సత్యప్రభకు గౌరవిమస్తున్నారు తప్ప పార్టీలోని ఏ ఒక్కరు ఆమెకు గౌరవం ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని కొంతమంది సీనియర్‌ నాయకులతో కూడా సత్యప్రభ చర్చించినట్లు తెలుస్తోంది. 
 
చాలారోజులుగా పార్టీలోని సీనియర్‌ నాయకులు చెబుతూ వచ్చిన డి.కె.సత్యప్రభ చివరకు సీనియర్లు కూడా వినకపోవడంతో మిన్నకుండిపోయారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతమైతే ఏ కార్యక్రమానికి డి.కె.సత్యప్రభ అసలు హాజరుకావడమే లేదట. తాను సీనియర్లకు చెప్పిన విషయాన్ని వారు పట్టించుకుని కార్యకర్తలు, నాయకులకు నచ్చజెబితే తప్ప వచ్చే ప్రసక్తే లేదని భీష్మించుకుని కూర్చున్నారట. 
 
గత కొన్నిరోజులుగా ఈ వ్యవహారం నడుస్తోంది. పార్టీ కార్యక్రమాలు ఒకటే కాదు ప్రభుత్వానికి సంబంధించిన ఏ కార్యక్రమానికి కూడా డి.కె.సత్యప్రభ హాజరుకావడం లేదట. తనకు బాగా కావాల్సిన వారు వచ్చి పిలిస్తే తప్ప మిగిలిన ఏ కార్యక్రమానికి సత్యప్రభ హాజరుకావడం లేదని తెలుస్తోంది. మొత్తం మీద డి.కె.పార్టీకి దూరంగా ఉంటూ వస్తుండడం మాత్రం ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.