శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : శుక్రవారం, 8 మే 2015 (14:02 IST)

ఆర్టీసీ కార్మికులకు చంద్రబాబు వార్నింగ్: మనుగడే ముప్పు కేర్ ఫుల్!

ఆర్టీసీ కార్మికులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. సమ్మెతో ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. మీ చర్యలతో ఆర్టీసీ మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితి తీసుకువచ్చారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఏ విషయాన్నైనా చర్చలతో పరిష్కరించుకోవచ్చని, తెగేదాకా లాగొద్దని అన్న ఆయన, తక్షణం సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు.
 
సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశామని వెల్లడించిన ఆయన ఉపసంఘం నివేదిక వచ్చే వరకూ వేచి చూడాలని కోరారు. సమ్మె కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. కాగా, ఆర్టీసీ సమ్మె మూడవ రోజుకు చేరగా, పలు డిపోల ముందు కార్మికులు ధర్నాలు నిర్వహించి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 
మరోవైపు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా మారింది. తమ కోరికలు తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, ఆర్టీసీ ఉద్యోగి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన మెదక్ జిల్లా జహీరాబాద్ డిపో ఎదుట ఈ తెల్లవారుజామున జరిగింది. ఆర్టీసీలో కండక్టరుగా పనిచేస్తున్న చంద్రయ్య(42) ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 
 
వెంటనే స్పందించిన సహ ఉద్యోగులు చంద్రయ్యను సమీపంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన ఉద్యోగులు డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో, పోలీసులు బందోబస్తు పెంచారు. ఆత్మహత్యాయత్నంపై కేసు నమోదు చేశామని పోలీసులు వివరించారు. కాగా, చంద్రయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.