శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 జులై 2016 (11:21 IST)

కేసీఆర్ వెన్నులో వణుకు! కొడుకు కేటీఆర్.. మేనల్లుడు హరీష్‌ రావులపై నిఘా పెట్టారట.. ఎందుకబ్బా?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వెన్నులో మొదలైందా? అందుకే తన మంత్రివర్గంలో కీలక మంత్రులుగా ఉన్న తన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావులపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు సమాచారం. అసలు కేటీఆర్, హరీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వెన్నులో మొదలైందా? అందుకే తన మంత్రివర్గంలో కీలక మంత్రులుగా ఉన్న తన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావులపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు సమాచారం. అసలు కేటీఆర్, హరీష్ రావులపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది...? ఇంటిలిజెన్స్‌ తాజా నివేదికలు ఏం చెబుతున్నాయి..? ఇందులో కేసీఆర్‌కు ఆగ్రహం తెప్పించిన అంశాలేమిటి..? అసలు మంత్రుల శాఖలలో జరుగుతున్నదేమిటి..? తదితర ఆంశాలపై విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన వివరాలను పరిశీలిస్తే.. 
 
కొద్ది రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సచివాలయం వైపు కన్నెత్తి చూడటం లేదు. క్యాంపు కార్యాలయంలోనే కేసీఆర్‌ సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో అమాత్యులందరూ అక్కడికే వెళుతున్నారు. దీంతో మంత్రులు కూడా సచివాలయానికి సరిగా రావడం లేదు.. ఇదే మహద్భాగ్యంగా... సదవకాశంగా భావించారు మంత్రుల పేషీల్లోని ముఖ్యులు. ఒక్కో మంత్రి పేషీలో ఒక్కో విధమైన పైరవీ చేసుకుంటున్నారు. మొన్నామధ్య ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి కూడా! 
 
దీంతో సాదాసీదాగా కాకుండా ఈసారి పకడ్బందీగా... దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా సీఎం కేసీఆర్ స్కెచ్‌ వేశారు. సచివాలయంలో మంత్రులు తమ చాంబర్‌లో లేనప్పుడు అసలు ఏం జరుగుతోంది... వారు ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చెప్పాలని నిఘా వర్గాలను ఆదేశించారు. తాజా ఇంటిలిజెన్స్‌ నివేదికతో కొత్త విషయాలు బయటకు వచ్చాయి.. సినిమాను తలపించే రీతిలో సెక్రటేరియట్‌లో జరిగిన సంఘటనలతో కేసీఆరే ఒకింత ఆశ్చర్యానికి గురి అయ్యారట!
 
ఇందుకోసం ఇంటెలిజెన్స్ అధికారే ఓ సాధారణ వ్యక్తిగా మారిపోయి.. ఓ మంత్రి చాంబర్‌కు వెళ్లారు. కానీ మంత్రి మాత్రం లేరు.. మంత్రిగారు లేరా అని అక్కడున్న సిబ్బందిని అడిగారు. లేరుగానీ పనేంటో చెప్పు చేసేస్తాం అంటూ సమాధానమిచ్చారు. లేదు... మంత్రితోనే పనుంది అంటూ ఆ వ్యక్తి చెప్పుకొచ్చారు. మంత్రికి చెప్పినా మళ్లీ తామే చేయాలంటూ గట్టి స్వరంతో మంత్రి పేషీలోని కొందరు ఉద్యోగులు. అంతేనా... ఫైల్‌ కదలాలంటే ఏం చేయాలి? ఎలా చేయాలి? వంటి వివరాలను చెప్పారట. అసలు పనేమిటో తెలుసుకోకుండానే ఎంత కావాలో కూడా చెప్పేశాడట. ఇక్కడే బండారం బయటపడింది. 
 
అలా ఆ మంత్రి చాంబర్‌లోని సిబ్బంది పనితీరుపై నిఘా అధికారి సీఎంకు నివేదిక ఇచ్చారు. ఇది సీఎం కేసీఆర్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చినంతపని అయిందట. ఇలా అన్ని మంత్రుల పేషీలపై నిఘా అధికారులు నివేదికలు సమర్పించారట. ఈ నివేదికను చూసిన కేసీఆర్.. కేటీఆర్, హరీష్ రావులతో పాటు.. మంత్రులందరినీ పిలిచి క్లాస్‌ తీసుకోనున్నరానే వార్తలు వెలువడుతున్నాయి.