శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: గురువారం, 25 జూన్ 2015 (20:39 IST)

మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టిన ఆ నలుగురు లేడీ మినిస్టర్స్...

'అచ్చే దిన్' అంటూ ఏడాది పాలన ముగిసిన సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో సంబరంగా చెప్పుకున్నారు. అంతకుముందు విదేశీ పర్యటనలతో మోదీ.... మోదీ... మోదీ అంటూ జైకొట్టించుకున్నారు. ఇక దేశంలో మచ్చలేని పాలనను అందించే ప్రభుత్వానికి నాయకుడైన మోదీకి తిరుగులేదనుకున్నారు అంతా. అనూహ్యంగా ఆయన చుట్టూ ఇప్పుడు సమస్యల వలయం చుట్టుకుంది. 
 
ఎన్డీఎ సర్కారులో, అది కూడా భాజపాకు చెందిన మంత్రులు ఆయా ఆరోపణలను ఎదుర్కోవడం ఆ పార్టీని కలవరపెడుతోంది. మాది యూపీఎ టైపు కాదు... రాజీనామాలు చేయడానికి... మా మంత్రులు సచ్చీలురు అని గృహమంత్రి రాజ్ నాథ్ సింగ్ చెపుతున్నప్పటికీ భాజపాలో ఒక వర్గం మాత్రం ఆ నలుగురు మహిళా మంత్రులు... స్మృతి ఇరానీ, సుష్మా స్వరాజ్, వసుంధరా రాజె, పంకజ్ ముండెలను పదవుల నుంచి తొలగించాల్సిందేనని వాదిస్తున్నారు. ఇంతకీ ఈ నలుగురు మంత్రులు ఏం చేశారన్నది ఒక్కసారి చూస్తే...
 
కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ లలిత్ మోదీకి వీసా....
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ ఛైర్మన్ లలిత్ మోడీకి బ్రిటన్ వీసా కోసం భారత విదేశాంగ మంత్రి హోదాలో సుష్మా స్వరాజ్ సిఫార్సు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఇది నరేంద్ర మోదీకి తలనొప్పి కలిగిస్తోంది. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ భార్య క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆమెకు బ్రిటన్‌లో చికిత్స చేయించే నిమిత్తం లండన్‌కు వెళ్లేందుకు వీసా మంజూరు చేయాలని సుష్మా ఇమ్మిగ్రేషన్ అధికారులకు సిఫార్సు చేశారు. మంత్రిగారి సిఫార్సు వ్యవహారం కాస్త బట్టబయలు కావడంతో ప్రతిపక్ష కాంగ్రెస్ ఒంటికాలిపై లేచింది. 
 
సుష్మా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. విషయం తెలిసిన ప్రధాని నరేంద్ర మోడీ కూడా సుష్మా తీరుపై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇదిలావుండగానే సుష్మా స్వరాజ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఒకవైపు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీకి వీసా పత్రాలు త్వరగా మంజూరయ్యేలా సిఫారసు చేసిన వివాదం నుంచి ఆమె బయటపడనే లేదు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించుకున్న వివాదంలో చిక్కుకున్నారు. 
 
ఆమె భర్త స్వరాజ్‌ కౌశల్, కూతురు బాంసూరి స్వరాజ్‌లను మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయవాదులుగా నియమించుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్ సర్కార్ 2010 అక్టోబర్ 10న స్వరాజ్‌ కౌశల్‌ను, 2013 ఫిబ్రవరి 27న బాంసూరి స్వరాజ్‌ను ప్రభుత్వ న్యాయవాదులుగా నియమించింది.
 
ఈ విషయం ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ప్రతినిధి అజయ్ దుబే దాఖలు చేసిన ఆర్టీఐ పిటిషన్ ద్వారా వెల్లడైంది. ఆ ఇద్దరి నియామకం ప్రభుత్వ పారదర్శక పాలనా విధానానికి వ్యతిరేకమని ఆర్టీఐ కార్యకర్తలు విమర్శిస్తున్నారు. పలుకుబడిగల వారికి లబ్ది కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం పక్షపాతంతో ఆ నియామకాలు చేసిందని అజయ్ దుబే ఆరోపించారు. ఇలా సుష్మా స్వరాజ్ పీకల్లోతు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇన్ని ఆరోపణలు వస్తున్నా ఆమెను పదవి నుంచి ఎందుకు తొలగించడంలేదో చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
 
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతపై రభస....
కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖామంత్రి స్మృతి ఇరానీ చిక్కుల్లోపడ్డారు. ఆమె సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లలో తప్పుడు విద్యార్హత సమాచారం పేర్కొన్నారంటూ దాఖలైన పిటీషన్‌ను ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో స్మృతి ఇరానీకి సమన్లు పంపించేందుకు వీలుగా సాక్ష్యాధారాలను, ఇతర వివరాలను ఆగస్టు 28వ తేదీన రికార్డు చేయాలంటూ మేజిస్ట్రేట్ ఆకాశ్ జైన్ ఆదేశించారు. 
 
సార్వత్రిక ఎన్నికలు, రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన రెండు సందర్భాల్లో స్మృతి వేరువేరు విద్యార్హతలను చూపుతూ నామినేషన్ దాఖలు చేశారని పేర్కొంటూ అహ్మర్ ఖాన్ అనే రచయిత ఈ పిటిషన్ దాఖలు చేశారు. కాగా తప్పుడు విద్యార్హత పత్రాలు సమర్పించిన కేసులో ఢిల్లీ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ ఇప్పటికే పదవిని పోగొట్టుకుని జైల్లో కాలం గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక స్మృతి ఇరానీ విద్యార్హతల విషయమై తప్పు జరిగినట్టు తేలితే, ఆమె కూడా మంత్రి పదవిని వదులుకోవడమే కాకుండా, జైలు ఊచలు లెక్కించే పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఆప్ కార్యకర్తలు గురువారం మంత్రి ఇంటి ముందు ధర్నా చేశారు. తక్షణమే ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
 
లలిత్ మోదీ మంచోడని సంతకం చేశారంటూ... రాజస్థాన్ సీఎం వసుంధర రాజెపై ధ్వజం
రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె కూడా లలిత్ మోదీ వ్యవహారంలో చిక్కుకున్నారు. ఇటీవల లలిత్ మోదీ మాంటెనీగ్రోలో అక్కడ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. వసుంధరా రాజె, సుష్మా స్వరాజ్‌ కుటుంబాలతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. యూపీఏ ప్రభుత్వం తనను ఇరికించిందని, తన భార్య ప్రస్తుతం అనారోగ్యంతో ఉందని, అందువల్ల తనకు సహాయం చేయాలని సుష్మ, వసుంధరలను తాను కోరానని చెప్పారు. 
 
తాను బ్రిటన్లో నివాసం ఉండడానికి వసుంధరా రాజె 2011 ఆగస్టులో సంతకం చేశారు. లిఖితపూర్వకంగా అంగీకరించారు. అంతేనా, పోర్చుగల్‌లో నా భార్యకు శస్త్ర చికిత్స జరిగినప్పుడు రాజస్థాన్‌ సీఎం అక్కడే ఉన్నారు. ఇక సుష్మ కుటుంబం తనకు పాతికేళ్లుగా తెలుసని మోదీ వివరించారు. ఇంకా విశేషం ఏమిటంటే, బ్రిటన్‌ నుంచి పోర్చుగల్‌ వెళ్లడానికి తనకు ట్రావెల్‌ డాక్యుమెంట్లు రావడానికి శరద్‌ పవార్‌, ప్రఫుల్‌ పటేల్‌, రాజీవ్‌ శుక్లా తదితరులు కూడా సహకరించారని వెల్లడించారు.
 
అయితే, లలిత్‌ మోదీ కుటుంబం తనకు తెలుసని, అయితే, తాను సంతకం చేశానంటూ మీరు చెప్పే పత్రాలు ఏమిటో తెలియదంటూ వ్యాఖ్యానించిన రాజె, తాజాగా ఆ సంతకం తనదేనంటూ తేల్చేశారు. మూడు పేజీల మోదీ ఇమిగ్రేషన్‌ పత్రాల్లో.. ‘లలిత్‌ మోదీ ఇమిగ్రేషన్‌ దరఖాస్తుకు మద్దతుగా నేను ఈ ప్రకటన ఇస్తున్నాను. అయితే, ఇందుకు ఒక కచ్చితమైన షరతు కూడా పెడుతున్నాను. మోదీకి నేను సహాయం చేసిన విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ అధికారులకు తెలియరాదు’ అని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే, మోదీ న్యాయవాది మహమూద్‌ అబ్ది విడుదల చేసిన ఆ పత్రాలపై వసుంధరా రాజె సంతకం లేకపోవడం గమనార్హం. మొత్తమ్మీద వసుంధర రాజె ఎన్డీఎలో మంత్రి కానప్పటికీ భాజపా పాలిత ప్రాంత ముఖ్యమంత్రి కావడంతో ఇది ప్రధాని మోదీపై ఆరోపణలకు దారితీస్తోంది.
 
పేద పిల్లలు పుస్తకాలు... వస్తువుల్లో గిల్లుడు... రూ 200 కోట్లు స్వాహా...?
మహారాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజ ముండేపై మరో ఆరోపణ. ఆమె ఏకంగా 200 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆరోపణ. అది కూడా పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన వస్తువుల కొనుగోళ్లలో ఆమె అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణతో మహా సర్కార్ గిలగిలలాడుతోంది. ఈ కుంభకోణానికి సంబంధించిన సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అంటోంది. 
 
విషయం ఏమంటే ఆమె పిలవాల్సిన టెండర్లన్నీ ఇ-టెండర్ల ద్వారా జరిగాయనేది ఆరోపణ. మొత్తమ్మీద ఈ 200 కోట్ల కుంభకోణం వ్యవహారం ఇప్పటికే ఆరోపణల సముద్రంలో ఈదుతున్న సుష్మా స్వరాజ్, స్మృతి ఇరానీ, వసుంధర రాజెల పక్కన నిలబెట్టాయి. కాగా, పంకజ ముండే బీజేపీ దివంగత నేత గోపీనాథ్ ముండే కుమార్తె. పై నలుగురు మంత్రులు భాజపాకు చెందినవారు కావడంతో విపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీపై గురిపెట్టాయి. విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి.