బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Eswar
Last Modified: బుధవారం, 23 జులై 2014 (20:52 IST)

కాంగ్రెస్ పార్టీలో ముసలం... హస్తం ఏమవుతుందో...?

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభాలు ముదురుతున్నాయి. ముఖ్యమంత్రులపై మంత్రులు తిరుగుబావుటా ఎగరేస్తున్నారు. ఈ సంక్షోభాలు రాహుల్‌ సమర్ధతకు పరీక్షగా మారుతున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీలో ముసలం మొదలైంది. పార్టీ సీనియర్‌ నేత, పరిశ్రమల మంత్రి నారాయణరాణే రాజీనామా చేశారు. 
 
ముఖ్యమంత్రి పృధ్విరాజ్‌ చవాన్‌ తీసుకుంటున్న నిర్ణయాల్లో జాప్యం విపక్షాలకు అస్త్రంగా మారిందని.. ఓడిపోయే జట్టులో తాను భాగస్వామిగా ఉండలేనంటూ రాజీనామా చేశారు. శివసేన తరపున ముఖ్యమంత్రిగా పనిచేసిన రాణే 2005లో కాంగ్రెస్‌లో చేరారు. రాణే పార్టీ వీడడంతో కాంగ్రెస్‌లో కల్లోలం మొదలైంది.
 
అసోంలోనూ ఇదే కథ 
అటు అసోంలో కూడా అధికార కాంగ్రెస్‌ కష్టాల్లో పడింది. సీనియర్ నాయకుడు, నెంబర్‌ 2గా ఉన్న మంత్రి హిమంత బిశ్వాల్‌ శర్మ పార్టీని అడ్డంగా చీల్చారు. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలను వెంట తీసుకెళ్లి గవర్నర్‌కు రాజీనామా సమర్పించారు. ముఖ్యమంత్రిపై తమకు విశ్వాసం లేదంటూ లేఖ సమర్పించారు. ఎన్నికలకు రెండేళ్లు గడువుండగానే మొదలైన అసమ్మతి కాంగ్రెస్‌ సర్కార్‌ను ఆత్మరక్షణలో పడేసింది. 
 
తరుణ్‌గొగాయ్‌ను ఇంకా ముఖ్యమంత్రిగా కొనసాగించాలని అధిష్టానం భావిస్తే తమ నిర్ణయాలు మరొరకంగా ఉంటాయని సొంతపార్టీ ఏర్పాటుపై సంకేతాలు పంపారు. 78 సీట్లున్న అసెంబ్లీలో 2011లో 40 సీట్లు కాంగ్రెస్‌ గెలుచుకుంది. ఇటీవల పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమితో సీనియర్‌ నేతల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి.
 
హర్యానాలోనూ సేమ్ టు సేమ్ 
అటు హర్యానాలో కూడా అసమ్మతి గళాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి భూపిందర్‌ సింగ్‌ హుడాను తొలగించాలని సీనియర్ కాంగ్రెస్‌ నాయకుడు బీరేందర్‌ సింగ్‌ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు. హైకమాండ్‌ నుంచి ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పార్లమెంట్‌ ఎన్నికలు ముగిసిన వెంటనే కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో అసమ్మతీ గళాలు మొదలయ్యాయి. మహరాష్ట్ర, హర్యానా, అసోం సీఎంలను తొలగిస్తారని ప్రచారం జరిగింది. 
 
కానీ ఎన్నికల ముందు తొలగించడం కంటే కొనసాగించడం మంచిదని అధిష్టానం భావించింది. దీంతో అసమ్మతి గళాలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటిమి భారంతో అప్రతిష్ట మూటగట్టుకున్న రాహుల్‌గాంధీకి రాష్ట్రాల్లో సంక్షోభాలు తలనొప్పిగా మారింది. ఆయన సమర్ధతకు పరీక్షగా మారుతున్నాయి. జాతీయ మీడియా అంతా ఇప్పటికే రాహుల్‌ను టార్గెట్‌ చేస్తున్నాయి.