గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Modified: గురువారం, 4 ఆగస్టు 2016 (13:11 IST)

ఓకే... దేవినేనికి సైకిలెక్కేందుకు లైన్ క్లియర్... బాబుతో ఎదురెదురుగా కూర్చుంటే...

కాకలుతీరిన రాజకీయ ఉద్దండుడు.. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్‌(నెహ్రూ) తెలుగుదేశం పార్టీలో చేరికకు రంగం సిద్ధం అయింది. నెహ్రూను పార్టీలోకి చేర్చుకోవాలని టీడీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. నెహ్రూ చేరిక జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పూర్తిస్థాయి జవసత్వాల

కాకలుతీరిన రాజకీయ ఉద్దండుడు.. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్‌(నెహ్రూ) తెలుగుదేశం పార్టీలో చేరికకు రంగం సిద్ధం అయింది. నెహ్రూను పార్టీలోకి చేర్చుకోవాలని టీడీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. నెహ్రూ చేరిక జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పూర్తిస్థాయి జవసత్వాలను అందిస్తుందన్న ఉద్దేశంతో సీనియర్‌ నేతలంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు జిల్లాకు చెందిన ముఖ్యనేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, కేశినేని శ్రీనివాస్‌(నాని), గద్దె రామ్మోహన్‌, బొండా ఉమామహేశ్వర రావు, బోడె ప్రసాద్‌ తదితర నేతలతో మాట్లాడి నెహ్రూను పార్టీలోకి చేర్చుకునే విషయాన్ని చెప్పారు. 
 
నెహ్రూను పార్టీలోకి తీసుకునే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నట్టు నేతలకు కళా వెంకటరావు చెప్పినట్టు సమాచారం. నెహ్రూను పార్టీలోకి తీసుకోవాలని సీఎం కూడా సుముఖంగా ఉన్నందున తమకేమీ అభ్యంతరం లేదని జిల్లా నేతలు అంగీకారం తెలిపారు. జిల్లా నేతలు కూడా సుముఖంగా ఉండటంతో నెహ్రూ చేరికపై క్లియరెన్స్‌ వచ్చింది. సీఎం చంద్రబాబు, దేవినేని నెహ్రూ ఇప్పటివరకు ముఖాముఖి కలిసి మాట్లాడుకున్న సందర్భంలేదు. వీరిద్దరూ ముఖాముఖి కలిస్తే ఓకే అయినట్టే. నెహ్రూ టీడీపీలో చేరతారన్న ఊహాగానాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. వైసీపీలోకి వెళతారని, టీడీపీలోకి వెళతారని ప్రచారం జరిగింది. వీటన్నింటినీ ఊహాగానాలుగా నెహ్రూ కొట్టిపారేశారు.
 
1983లో టీడీపీ తరపున దేవినేని నెహ్రూ పోటీ చేశారు. నాలుగుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1995లో టీడీపీలో చీలిక వచ్చిన సందర్భంలో నెహ్రూ లక్ష్మీపార్వతి వైపు ఉండిపోయారు. 1997లో చంద్రబాబు ప్రభుత్వంలో నెహ్రూ స్వతంత్రంగా ఉన్నారు. ఈ సమయంలో నెహ్రూ అనుచరులు వేధింపులకు గురయ్యారు. ఏ పార్టీలో లేకపోతే రాజకీయ మనుగడ ఉండదన్న ఉద్దేశ్యంతో నాడు నెహ్రూ అయిష్టంగానే కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. ఎన్టీఆర్‌ అంటే నెహ్రూకు ఎంతో అభిమానం. ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. తప్పని పరిస్థితిలో కాంగ్రెస్‌ పార్టీలోకి చేరుతున్న విషయాన్ని కన్నీళ్ళు పెట్టుకుని మరీ దేవినేని నెహ్రూ చెప్పారు. 
 
కాంగ్రెస్‌లో చేరిన తర్వాత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి బాగా చేరువయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా.. దేవినేని రాజశేఖర్‌తోనే వైఎస్‌ ఎక్కువుగా మాట్లాడేవారు. జిల్లా పార్టీ పరిస్థితులు, మంచిచెడుల గురించి చర్చించేవారు. కాంగ్రెస్‌లో ఉండగానే 2009లో రెండోసారి నెహ్రూ పరాజయం పాలయ్యారు. 2014న విభజన అంశం తెరమీదకు రావటంతో ఆయన కుమారుడు దేవినేని అవినాష్‌ సమైక్య ఆంధ్ర కోసం ఉద్యమాలు నిర్వహించి మంచి నాయకుడిగా ఎదిగాడు. విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గం తరపున కూడా అవినాష్‌ పోటీచేశారు. 
 
కాంగ్రెస్‌ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతో నెహ్రూను కూడా పార్టీలోకి చేర్చుకుంటే జిల్లాలో టీడీపీ గట్టిగా ఉంటుందని చంద్రబాబు అభిప్రాయ పడుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీలో ఉన్న సీనియర్‌ నేతలు కూడా నెహ్రూను తీసుకోవటం పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, నెహ్రూ ముఖాముఖిగా కూర్చుంటే టీడీపీలో నెహ్రూ భవితవ్యం ఏమిటన్నది, నెహ్రూతో పాటు ఆయన తనయుడు కూడా ఉన్నందున వీరికి పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారన్నది తెలుస్తుంది. నెహ్రూ పార్టీలోకి వస్తే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే ఆలోచన ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది.