శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: ఆదివారం, 19 అక్టోబరు 2014 (18:35 IST)

షాక్ లో కాంగ్రెస్ పార్టీ... కాంగ్రెస్ ఇక లేవలేదా... విభజన పాపమేనా...?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పాపమో, కాంగ్రెస్ పార్టీకి పట్టిన శాపమో కానీ 2014 సార్వత్రిక ఎన్నికల సమరం దగ్గర్నుంచి ఎన్నికల కదనరంగంలో ఆ పార్టీ ఘోర పరాజయాలనే చవిచూస్తోంది. పెట్టనికోటలుగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీని ఛీ... ఛీ అంటూ కనీసం ప్రతిపక్ష హోదాను కూడా ఇవ్వడంలేదు. కాంగ్రెస్ పార్టీపై దేశ ప్రజలలో అంతలా ఏహ్యభావం ఎందుకు కలిగిందన్నది అంతులేని ప్రశ్నగా మిగులుతోంది. 
 
కానీ ఏపీ విభజన విషయంలో అప్పటి యూపీఎ వ్యవహరించిన తీరు, కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ బృంద సభ్యుల హడావుడి అంతా దేశంలోని ప్రజలకు ఎంతమాత్రం రుచించలేదని పలువురు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి వీలు చిక్కినప్పుడల్లా ఇలా గుణపాఠం చెపుతున్నారని అంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం కష్టమేనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 
 
ఇక తాజా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం పలుకరించింది. ఎన్నోమార్లు ఒకవైపు పోయినా ఇంకోవైపు అన్నట్లు నెట్టుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ చూసినా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ అధికారం కోల్పోయి, మిత్రపక్షాలను దూరం చేసుకుని ఒంటరిగా మిగులుతోంది ఆ పార్టీ. మరి భవిష్యత్తులోనైనా ఆ పార్టీకి ఏమైనా వైభవం వస్తుందేమో చూడాలి.