గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : బుధవారం, 27 జూన్ 2018 (14:29 IST)

తెరాసకు గుడ్‌బై... మళ్లీ సొంత గూటికి ధర్మపురి...?

ధర్మపురి శ్రీనివాస్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారుండరు. ఈయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన డ

ధర్మపురి శ్రీనివాస్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారుండరు. ఈయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన డీఎస్.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. పైగా, రాష్ట్ర మంత్రిగా కూడా పని చేశారు. అలా ఓ వెలుగు వెలిగిన డీఎస్... రాష్ట్ర విభజన తర్వాత ఆయన హవా తగ్గిపోయింది. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అంతర్రాష్ట్ర జల వ్యవహారాల సలహాదారునిగా నియమితులయ్యారు.
 
అయితే, నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన మళ్లీ కాంగ్రెస్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ కీలక నేతలతో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. టీఆర్‌ఎస్‌లో తగిన ప్రాధాన్యం దక్కడం లేదని కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్న ఆయన ఎట్టకేలకు పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 
 
డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ టీఆర్‌ఎస్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా టీఆర్‌ఎస్ నేతలు డీఎస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. డీఎస్‌కు గ్రూపులు కట్టే అలవాటుందని.. అవినీతి చేసే అవకాశం లేకపోవడంతోనే టీఆర్‌ఎస్‌ను వీడాలని నిర్ణయించుకున్నారని నేతలు కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. 
 
టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న డీఎస్ తన కొడుకును బీజేపీలోకి పంపించారని ఆరోపించారు. కొడుకు ఎదుగుదల కోసం బీజేపీ పెద్దల దగ్గర మోకరిల్లారని డీఎస్‌పై లేఖలో తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణలపై తీవ్ర మనస్తాపం చెందిన డీఎస్.. ఇపుడు తిరిగి సొంతగూటిగి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.