శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2015 (17:45 IST)

కాల్పులే... ‘ఎదురు’ లేదు... ప్రాణాలు పోయింది ఎర్ర కూలీలవే.. స్మగ్లర్లవి కాదు

పోలీసులకు ఎర్రచందనం స్మగ్లర్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో తిరుపతి సమీపంలోని శేషాచల అడవుల్లో 20 మంది మరణించారు. ఇది పోలీసుల ఎన్ కౌంటర్. అయితే జరిగింది కాల్పులా...? ఎదురు కాల్పులా..? అనేది పోలీసులకు మాత్రమే తెలిసిన ప్రశ్న. ఇక్కడ ఎర్రకూలీలు చెట్లను నరకడం చట్ట విరుద్ధమా..? చట్టబద్ధమా..? అనేది ప్రశ్న కాదు. కానీ అక్కడ జరిగింది ఎన్ కౌంటరా.. ? కాదా..? అనేది మాత్రమే ప్రశ్న..  సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎవ్వరికైనా వంద ప్రశ్నలు తలెత్తుతాయి. అక్కడ జరింగింది కాల్పులే.. ఎదురు కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ మరణించిన వారిలో దాదాపుగా అందరూ కరుగట్టిన లేదా ఓ మోస్తరు స్మగ్లర్లుగా ఫారెస్టు అధికారులు గుర్తింపు పొందిన వారు కాదు. వారెవరో కూడా తెలియని వారు.. ఇలాంటి వారు కాల్పుల్లో చనిపోతే దానిని ఎన్ కౌంటర్ అంటామా..? వారి చేతుల్లో ఆయుధాలు లేవు. రాళ్ళు లేవు. కత్తుల్లేవు.. కటార్లు కనిపించలేదు.. కానీ అది ఎన్ కౌంటరేనని పోలీసు ఉన్నతాధికారులు పదేపదే చెబుతున్నారు. ఎన్నో అనుమానాలను లేవనెత్తుతున్నారు. మరి అది ఎలా ఎన్ కౌంటర్ అవుతుందో అక్కడున్న పరిస్థితులను పరిశీలిద్దాం. 
 
శేషాచల అడవుల్లోని అపారమైన ఎర్రచందనం నిల్వల కోసం స్మగ్లర్లు ఎప్పుడూ కూలీలను పురమాయిస్తూనే ఉంటారు. వారు నిత్యం అడవుల్లోకి వెళ్ళి ఎర్రచందనం చెట్లను నరికి డ్రెస్సింగ్ చేసి ( తాట తీసి) స్మగ్లర్లకు అప్పజెప్పుతారు. ఇలాంటి పనికి అత్యధిక కూలీ లభిస్తుందన్న ఏకైక కారణంతోనే తమిళనాడు నుంచి కూలీలు వస్తున్నారు. ఇక్కడ సోమవారం రాత్రి జరిగింది కూడా అదే. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో వారు అడవిలోకి వెళ్లేందుకు దారి పట్టారు. సరిగ్గా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్సు వారిని శాసినవాడి బండ వద్ద చుట్టుముట్టింది. అరకిలోమీటరు దూరంలో ఇంకో గుంపునూ చుట్టుముట్టారు. పోలీసులు ఎదురు పడడంతో రాళ్ళు రువ్వారనీ అందుకే ఎదురు కాల్పులు జరిపామని అధికారులు చెబుతున్నారు. కాల్పులు ఎప్పుడు జరపాలి అనేందుకు మన చట్టంలో కొన్ని నియనిబంధనలు ఉన్నాయి. మరి పోలీసులు ఇవన్నీ పాటించారా..?అది అనుమానమే.
 
అడుగడుగునా అనుమానమే..
 
సాధారణంగా సంఘ విద్రోహకశక్తులు, తీవ్రవాదుల, స్మగ్లర్లనైనా సజీవంగా పట్టుకోవడానికే ప్రయత్నిస్తారు... వినకుండా ఎదురుదాడి చేస్తే గాలిలోకి కాల్పులు చేస్తారు. అక్కడికి వినకపోతే శరీరంలో ప్రాణాపాయం లేని ప్రాంతంలో కాల్పులు జరుపుతారు. మరి ఇక్కడ అలా జరిగిందా...? శాసినవాడి బండ సమీపాన జరిగిన ఒక్క సంఘటనలోనే 11 మంది మృతి చెందారు. అయితే వీరిలో చాలామందికి ఛాతీ లేదా తల భాగంలోనే బుల్లెట్ గాయాలున్నాయి. ఒకరిద్దరి చేయికి, కాళ్లకు గాయాలయ్యాయి. అంటే ఇక్కడ గాలిలో కాల్పులు జరిగాయా..? అనుమానమే.. అలాగే కూలీలు కాల్పుల సమయంలో అటూఇటూ పరుగెడుతుంటే ఒక్క బుల్లెటైనా పక్కనున్న చెట్టుకో పుట్టకో తగలదా... అలాంటి వాతావరణమేమీ అక్కడ కనిపిస్తున్న దాఖలాలు లేవు.
 
ఇక ఒక్కొక్క మృతుడి వద్దకు వద్దాం... బ్లూ ఎలాస్టిక్ చెడ్డీ వేసుకున్న ఒక మృతుడిని గమనిద్దాం. ఇతనికి వెనుక నుంచి బుల్లెట్ దూరిపోతే రక్తం కక్కుకుని బోర్లా పడిపోయాడు. ఇక రెండవ శవం.. లైట్ బ్లూ ఎలాస్టిక్ కలిగిన డ్రాయర్ వేసుకున్న వ్యక్తికి తలలో బుల్లెట్ వెనుక భాగానా దూరిపోయింది. అంటే ఎంత దగ్గర నుంచి కాల్చి ఉండాలి?. తెల్లని బనియన్ వేసుకున్నా కుర్రాడు.. ఇతనికి వెన్నులోంచి బుల్లెట్ దూసుకుపోయింది.  ఇక నాలుగో వ్యక్తికి మెడ వెనుక నుంచి బుల్లెట్ దూసుకుపోయింది. ఇతనికి మొదటి బుల్లెట్ కుడి చెయ్యికి తరువాత రెండో బుల్లెట్టు తలకి తగిలింది. అతను నొప్పి భరించలేక నేలకేసి తల రాసుకున్నట్లు కనిపిస్తోంది. ఎర్ర బనియన్ వేసుకున్న వ్యక్తికి నేరుగా చాతీలోంచి బుల్లెట్ దూసుకుపోయింది. 
 
ఇక ఏడు వ్యక్తి చాలా చిన్నవాడు. ఇతను కూడా చాతీ ఎడమ భాగాన బుల్లెట్ దూసుకుపోయింది. ఎనిమిదో అతనికి తలలోనే వెనుక భాగం నుంచి బుల్లెట్ దూసుకుపోయింది.  ఇలా దాదాపు అందరికి నడుము పైభాగాన ఖచ్చితంగా బుల్లెట్ గాయాలున్నాయి. ఇక్కడ టాస్క్ ఫోర్సు చట్టాన్ని అనుసరించిందా..? అనే సందేహాలను లేవనెత్తుతున్నారు. పడి ఉన్న ఈ పదకొండు మంది కూడా కేవలం 16 నుంచి 18 మీటర్ల పరిధిలోనే ఉన్నారు. అక్కడెక్కడా పెద్ద చెట్లు కూడా ఏమీ లేవు. దాదాపుగా చిన్న చిన్న చెట్లతో కూడిన బైళ్ళనే చెప్పాలి. వారు నిజంగా కొత్త చెట్లను నరికి తీసుకు వస్తూ ఉంటే అక్కడ ఉన్న ఎర్రచందనం దుంగలు దాదాపుగా తాజావిగా లేవనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఎండిన దుంగలు చాలా పాతగా కనిపిస్తున్నాయి. అంటే వారు తాజాగా చెట్లను నరికి తీసుకురావడం లేదనేది చిన్న పిల్లాడికైనా అర్థమైపోతుంది. 
 
ఎదురు కాల్పులైతే తుపాకులు లేవేం..? 
 
అంటే అడవుల్లోకి వెళుతున్న సమయంలో వెనుక నుంచి కాల్పులు జరిపారనే అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. పైగా అక్కడున్న దాదాపు చెట్లన్నీ 6 అడుగులకు మించి లేవు. అంటే దాదాపు ఒకరికి ఒకరు కనిపించే పరిస్థితి. ఇలా సంఘటనా స్థలాన్ని పరిశీలించినప్పుడు ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గొడ్డళ్లతోనూ... రాళ్ళతోనూ దాడి చేశారని చెబుతున్నారు.. మరీ ఏ మృతుడి చేతిలో ఒక్క రాయి లేదు. ఒక్క గొడ్డలి లేదు. ఒక్క తుపాకీ లేదు.

ఈ ఎన్ కౌంటర్ పై ఇప్పుడు తమిళనాడులో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే మరో వందమందికి పైగా పారిపోయారని చెబుతున్నారు. వారిలో ఏ ఒక్కిరికి గాయాలైనా వారు కనీసం కిలోమీటరు నడిచి వెళ్ళలేరు. వెళ్లినా ఎక్కడో ఒక్క చోట బయటపడుతుంది. ఇంతవరకూ ఏ ఒక్కరూ దొరకలేదు. ఎర్రచందన స్మగ్లింగ్ చేయడం ఖచ్చితంగా నేరం. అందులో అనుమానం లేదు. ఐతే స్మగ్లర్లిచ్చే డబ్బు కోసం పొట్ట పోసుకునేందుకు వచ్చిన ఈ కూలీలను ఇలా కాల్చి వేయడంపైనే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇపుడు తమిళనాడు అట్టుడుకుతోంది. స్వరాష్ట్రంలోని విపక్షాలు సైతం మండిపడుతున్నాయి.