శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ESHWAR
Last Updated : మంగళవారం, 22 జులై 2014 (12:25 IST)

చేపా.. చేపా.. ఎక్కడున్నావ్..? ఏమైపోయావ్..?

మన చిన్నప్పడు మన అమ్మమ్మో.. తాతమ్మో చెప్పిన పేదరాశి పెద్దమ్మ కథ ఇది. ఇది మనందరికీ గుర్తుండే ఉంటుంది. అనగనగా ఒక పెదరాశి పెద్దమ్మ.. ఆ పెద్దమ్మకు ఏడుగురు కొడుకులు.. ఆ ఏడుగురు కొడుకులూ వేట కెళ్లి ఏడు చేపలు తెచ్చారు. అందులో ఆరు చేపలు ఎండితే ఒక చేప ఎండలేదు... చేపా.. చేపా ఎందుకు ఎండలేదు అంటే... నాకు గడ్డివాము అడ్డొచ్చింది అంటుంది... గడ్డివామా..గడ్డివామా ఎందుకు అడ్డొచ్చావ్ అంటే నన్ను ఆవు మేయలేదు అంటూ... ఇలా కథ సాగుతోంది. అయితే ఈ కథనే మనం రేపటి తరాల పిల్లలకి మార్చి చెప్పాల్సి ఉంటుంది. అది ఎలా అంటే పేదరాశి పెద్దమ్మకి ఏడుగురు కొడుకులు ఉన్నారు.. ఆ ఏడుగురు కొడుకులూ వేటకు వెళ్లినా ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి వెళ్లలేక ఆ కొడుకులు.. కొడుకులు జాడ తెలియక ఆ పెద్దమ్మ... ఇలా తల్లీకొడుకులు అందరూ చనిపోయారని. ఇలా ఈ కథ పిల్లలకు చెప్పాలా? అని బాధపడుతున్నా రేపటి తరానికి ఏర్పడబోయే పరిణామాలివే. 
 
సగటు మనిషి చేస్తున్న తప్పిదాలకు ఇప్పటికే పర్యావరణం ప్రమాదంలో పడింది. కార్పోరేట్ కంపెనీలు సోకాల్డ్ అభివృద్ధి పేరుతో చేసే వనరులు వినియోగం వల్ల సముద్రగర్భంలో అనేక జలరాశులు అంతరించిపోతున్నాయి. దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు వాపోతున్నారు. ప్రకృతి మానవుని మనుగడ కోసం వనరులు రూపంలో వరాలు ఇచ్చింది. కానీ వాటి వినియోగంలో స్వార్థం, సంపాదన అనే అంశాలు ముడిపడడంతో నదులలో ఉండే ఇసుకను ఇష్టానుసారం దోచేసుకుంటున్నారు.
 
సహజవాయువుల నిక్షేపాల కోసం సముద్రగర్భాన్ని తవ్వి పారేస్తున్నారు. దీనిప్రభావం సముద్రంలో జీవించే వేలాది జలరాశులపై ప్రత్యక్షంగాను పరోక్షంగాను తీవ్రంగా పడుతోంది. వివిధ రకాల పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను నదీజలాల్లోకి వదలడం, సముద్ర గర్భంలో సహజవాయువుల వెలికి తీయడం కోసం జరగుతున్న త్రవ్వకాలు మూలంగా అనేక రకాల చేపలు మాయమైపోతున్నాయి. ఇప్పటికే నీటిగుర్రం, సొరచేప, టైగర్ రొయ్యి వంటి రకాల చేప జాతులను వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్‌లో అంతరించిపోతున్న చేపల జాబితాలో చేర్చారు. అందుకే వీటిని వేట ఆడకూడదని చట్టం చెపుతోంది. అయితే దీన్ని అమలు చేసే యంత్రాంగం లేదన్నది బహిరంగ రహస్యం.
 
గత కొన్ని సంవత్సరాల క్రితం వేటకు వెళ్లే మత్స్య కారులకు మత్స్య సంపద పుష్కలంగా లభించేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ధర అధికంగా వుందన్న సంతోషం తప్ప అప్పట్లో లభించినంత మత్స్య సంపద ఇప్పుడు దొరకడం లేదని వాపోతున్నారు వీరు. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల కూడా మత్స్య సంపద అభివృద్ధికి విఘాతం కలుగుతుందని అంటున్నారు. ఇప్పటికే రుస, కాటుకమేను, వాలు, వంజ్రం, సొర, మాగ, టైగర్ రొయ్యి వంటి రకాలు ఉనికి కనిపించటలేదంటున్నారు. 
 
సముద్రంలో సంచరించే జలరాశులు పర్యావరణ పరిరక్షణలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్రం గర్భాన్ని శుద్ధి చేయడంలో అనేక జలరాశులు పాత్ర ఉంటుందని వాటిని పరిరక్షించవలసి ఉందని అంటున్నారు. విశాఖ నుంచి చెన్నై వరకూ పెట్రో కారిడార్ నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే సముద్రం తీరం వెంబడి అనేక పరిశ్రమలు నిర్మాణంలో వున్నాయి. భవిష్యత్‌లో వీటివల్ల సముద్రంలో జీవించే జలరాశులకు ఎలాంటి ప్రమాదం పొంచివుందో అన్న ఆందోళన పర్యావరణ శాస్త్రవేత్తల్లో నెలకొంది. భవిష్యత్‌‌లో మత్స్యకారుల జీవనోపాధికి ఆటంకం కలగకుండా, జలరాశులు అంతరించిపోకుండా పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా, ప్రభుత్వాలు, పర్యావరణ పరిరక్షకులు, కృషిచేయవలసిన అవసరం ఎంతైనా వుంది. చేపలను బతికించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.