బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : మంగళవారం, 10 ఫిబ్రవరి 2015 (15:08 IST)

లోక్‌సభలో కాంగ్రెస్‌కు బీజేపీ చేతిలో.. ఢిల్లీలో బీజేపీకి ఆప్ చేతిలో...

గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బీజేపీ మట్టికరిపిస్తే.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఆప్ పార్టీ అవమానకర రీతిలో దెబ్బకొట్టింది. గత సార్వత్రిక ఎన్నికలకు మొదలుకుని.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందువరకు జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన ఓట్లు, సీట్లను సాధిస్తూ వచ్చింది. కానీ, ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రం పని చేయలేదు. ఫలితంగా కమలనాథులకు గర్వభంగం తప్పలేదు. ఈ ఎన్నికల్లో కేవలం మూడంటే మూడు సీట్లకే పరిమితమైంది. అంటే.. లోక్‌సభలో బీజేపీకి ఘనంగా పట్టం కట్టిన ఓటర్లే.. ఇపుడు ఛీకొట్టారు. 
 
సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో ప్రతిపక్ష హోదాను కోల్పోగా... ఇపుడు ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి ఆ పరిస్థితి ఎదురైంది. అంతేకాకుండా, ప్రతిపక్ష హోదా దక్కించుకోవడానికి అవసరమైనన్ని సీట్లు సాధించని కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఎలా కట్టబెట్టేదంటూ, బీజేపీ నేతలు అపహాస్యం చేయగా.. ఇపుడు అదే పరిస్థితిని ఆప్ నేతల నుంచి బీజేపీ నేతలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.
 
మొత్తం 70 స్థానాలు గల ఢిల్లీ అసెంబ్లీలో సామాన్యుడి పార్టీ అయిన ఆప్ ప్రభంజనం సృష్టించింది. ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్‌పై అత్యంత విశ్వాసాన్ని ప్రకటించారు. ఫలితంగా ఏకంగా 67 సీట్లను కైవసం చేసుకోగా, బీజేపీకి మూడు సీట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో, ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా మరే పార్టీకి దక్కే అవకాశమే లేదు. మోడీ ప్రభంజనంతో ఒక్కో రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ వస్తున్న బీజేపీ... ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అత్యంత దారుణంగా చతికిల పడి, ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేని స్థితికి దిగజారిపోవడం బీజేపీ అగ్రనేతలకు మింగుడుపడని అంశమే.