శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Updated : మంగళవారం, 28 అక్టోబరు 2014 (17:34 IST)

ఫడ్నవిస్‌కు ప్లగ్... ప్రత్యేక విదర్భ డిమాండ్‌ వస్తే ఓకే... నితిన్ గడ్కరీ

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పీఠాన్ని భాజపాకు చెందిన దేవేంద్ర ఫడ్నవిస్ ఇంకా అధిష్టించలేదు కానీ అప్పుడే ముసలం మొదలైనట్లు కనిపిస్తోంది. ఎన్నికల్లో ప్రత్యేక విదర్భ గురించి ఎలాంటి రచ్చ లేకపోవడంతో భాజపా అత్యధిక స్థానాల్లో గెలుపొంది ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే స్థాయికి ఎదిగింది. ఐతే ముఖ్యమంత్రి పగ్గాలను అందుకునేందుకు కావలసిన సంఖ్యాబలం లేకపోవడంతో మళ్లీ శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది భాజపా. 
 
ఐతే మహారాష్ట్రలో త్వరలో మరో ముసలం చెలరేగబోతున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. విషయం ఏంటంటే... చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు భాజపా కట్టుబడి ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ సహకరిస్తే మహారాష్ట్రను విభజించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు గడ్కరీ ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. 
 
సోమవారంనాడు ఆయన మహారాష్ట్రలోని అమ్రావతిలో విలేకరులతో ఈ విషయంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఉటంకించారు. తెలంగాణ కోసం అక్కడి ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు అంతా ఏకమై రోడ్డెక్కారనీ, అలాంటి పరిస్థితులు ఇక్కడ లేవని అన్నారు. అంటే అలాంటి పరిస్థతి ఉత్పన్నం కావాలని గడ్కరీ కోరుకుంటున్నారా... అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
 
ఇక్కడ ట్వస్ట్ ఏమంటే.... శుక్రవారంనాడు భాజపాకు చెందిన దేవంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు. ఐతే నితిన్ గడ్కరీ అంతకంటే ముందుగానే... అంటే ఆదిలోనే హంసపాదు అన్నట్లు విదర్భ ఏర్పాటుపై ప్రకటన చేయడం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్న చర్చ జరుగుతోంది. చూడాలి 'మహా'లో భాజపా పరిపాలన ఏ రీతిన సాగుతుందో...?!!