శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : శనివారం, 19 సెప్టెంబరు 2015 (09:35 IST)

దిగ్విజయ్‌కు చెక్ పెట్టనున్న రాహుల్.. దూకుడు నేతలకే కోటరీలో చోటు!

దిగ్విజయ్ సింగ్ అలియాస్ డిగ్గీరాజా. ఢిల్లీ, టెన్ జన్‌పథ్‌కు అత్యంత సన్నిహితుడు. ఇక్కడ ఏ పార్టీకి లేనంత సాన్నిహిత్యం ఆయనకు ఉంది. అయితే, గత కొంతకాలంగా ఆయన గ్రహస్థితి ఏమాత్రం బాగోలేదు. ముఖ్యంగా రాజ్యసభ టీవీలో యాంకర్‌గా పనిచేస్తూ వచ్చిన అమృతా రాయ్‌ను లేటు వయస్సులో వివాహం చేసుకున్న తర్వాత ఆయన పరిస్థితి మరింతగా దిగజారింది. దీంతో ఆయనను పార్టీ పదవుల నుంచి తప్పించనున్నారనే వార్తలు షికారు చేస్తున్నారు. 
 
నిజానికి కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీకి దిగ్విజయ్ సింగ్ అత్యంత సన్నిహితుడు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి కాంగ్రెస్ చివరి ముఖ్యమంత్రి ఈయనే. అక్కడ పార్టీ చిత్తుగా ఓడిపోయిన తర్వాత జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కొంత కాలం ఏ పదవీ లేకుండానే గడిపారు. ఆయన సేవల్ని గుర్తించిన హైకమాండ్.. దిగ్విజయ్‌కు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించడంతో పాటు తెలుగురాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్‌ పార్టీ ఇన్‌చార్జ్ బాధ్యతల్ని అప్పగించింది. కానీ, ఆ బాధ్యతలను ఆయన సక్రమంగా నిర్వర్తించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 
 
దీనికితోడు.. డిగ్గీరాజా ఇటీవల రెండో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కొత్త దంపతులు హాయిగా ఎంజాయ్‌ చేస్తున్నారు. పెళ్లికి ముందు, తర్వాత.. టోటల్‌గా కొంత కాలంగా దిగ్విజయ్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన ఇన్‌చార్జ్‌గా ఉన్న రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి కూడా అంత గొప్పగా లేదు. దీంతో ఆయన్ని పక్కన పెట్టాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. దిగ్విజయ్ సింగ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నా.. క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని కొంతమంది నేతలు నేరుగా రాహుల్‌కి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. 
 
ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఢీకొట్టే విషయంలో ఆయన సీరియస్‌ వ్యవహరించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే... పార్టీలో యువతకు పెద్ద పీట వేయడం, దూకుడుగా వ్యవహరించే వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఉన్న రాహుల్.. పనిలో పనిగా డిగ్గీరాజాను పక్కన పెట్టాలనుకుంటున్నారట. పార్టీ హైకమాండ్ అలాంటి నిర్ణయమే తీసుకుంటే... కొత్తగా పెళ్లైన ఉత్సాహంలో ఉన్న ఈ కొత్త పెళ్లికొడుక్కి కొంత నిరాశ ఎదురైనట్లే.