శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By RB
Last Modified: శుక్రవారం, 8 జులై 2016 (16:38 IST)

వినాయక చవితి 'విగ్రహం' ఎత్తు కష్టాలు... గణనాథా... ఏంటిది...?!!

ఒక్కొక్కసారి టీవీ ఛానెల్స్ చూస్తూ ఉంటే ఆశ్చర్యంగానూ, హాస్యాస్పదంగానూ ఉంటాయి. ఎన్నో ఉపయోగకరమైన అంశాలను విడిచిపెట్టి మన హిందూ సాంప్రదాయలకు సంబంధించిన అంశాలను ఎక్కువగా చర్చిస్తూ ఉంటారు. ఆ చర్చల్లో పాల్గొనేవారు హిందువులు, మతాధిపతులు.

ఒక్కొక్కసారి టీవీ ఛానెల్స్ చూస్తూ ఉంటే ఆశ్చర్యంగానూ, హాస్యాస్పదంగానూ ఉంటాయి. ఎన్నో ఉపయోగకరమైన అంశాలను విడిచిపెట్టి మన హిందూ సాంప్రదాయలకు సంబంధించిన అంశాలను ఎక్కువగా చర్చిస్తూ ఉంటారు. ఆ చర్చల్లో పాల్గొనేవారు హిందువులు, మతాధిపతులు.
 
ఈమధ్య కాలంలో ఒక టీవీ ఛానల్లో వినాయకచవితికి తయారుచేసే విగ్రహాల ఎత్తు ఎంత ఉండాలి అనే అంశంపైన చర్చ జరిగింది. చర్చ జరిపించే వ్యక్తి తటస్థంగా ఉండి చర్చ జరపాలి. చర్చ ముగిసిన తర్వాత దాని ఫలితాలను వెల్లడించాలి. కానీ చర్చ జరిపే వ్యక్తే మన హిందూ ఆచారాలను వ్యతిరేకిస్తూ చర్చ మొదలుపెడితే ఆ చర్చ ఎలా ఉంటుందో ఊహించుకోండి. 
 
ఒక కాషాయం ధరించిన మఠాధిపతి, వినాయకుని పెద్దపెద్ద విగ్రహాలు ఊరేగించడం ధర్మశాస్త్రంలో లేదు. వాటికి పెట్టే ఖర్చు సంఘ సేవకు పెట్టాలని చెప్పాడు. వినాయకుని విగ్రహం ఎత్తు 14 అడుగులకు పైన ఉండకూడదని న్యాయస్థానం, ప్రభుత్వం చెప్పందని చర్చ జరిపే వ్యక్తి చెప్పాడు. ప్రతి ఒక్కటి మనం ధర్మశాస్త్రం ప్రకారమే జరుపుకుంటున్నామా? అలా జరుపుకుంటున్న అంశాలలో రాజకీయ వేత్తలు జోక్యం కల్పించుకోవడంలేదా? అసలు ఒక అడుగకుపైన విగ్రహం ఉండకూడదని స్వామీజీ చెపుతూ ఉంటే ఎత్తు 14 అడుగులు మించరాదని ప్రభుత్వం ఎలా చెపుతున్నది. దానికి ఆధారం ఏమిటి?
 
రాజకీయ ర్యాలీలు నడుపుతున్నారు. కులాల పేరుతో రైళ్లు, బస్సులు తగలపెడుతున్నారు. రాజకీయ నాయకుల కోసం కొన్ని గంటలు వాహనాల ట్రాఫిక్ ఆపేస్తున్నారు. దారులు మళ్లిస్తున్నారు. బంద్‌లు పేరుతో అంగళ్లు మూసేస్తున్నారు. పసిపిల్లలకు త్రాగడానికి పాలు కూడా దొరకని పరిస్థితి కల్పిస్తున్నారు. ఇలా ప్రజలకు ఎన్నో ఇబ్బందులు కలిగించే కార్యక్రమాలను వేడుకగా చూస్తున్నారు. కానీ ప్రజలు ఇష్టపడి కావాలని చేసుకునే వినాయకచవితిని విమర్శిస్తున్నారు.
 
సినిమా హీరోలు, రాజకీయ నాయకుల కటౌట్లు 30 అడుగులు, 40 అడుగులు పెడుతున్నారే... దానికి అభ్యంతరం లేదా. ఒక రాజకీయ నాయకుడి చిత్రపటం 40 అడుగుల ఎత్తుపెట్టంగా లేనిది హిందువుల ఆరాధ్య దైవమైన వినాయకుడి విగ్రహం 20 అడుగులు పెడితే దానికి ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, న్యాయస్థానాలు అభ్యంతరం తెలుపుతున్నాయంటే మనం హిందువులుగా సిగ్గుపడాల్సి వస్తున్నది.
 
కాషాయం ధరించిన ఒక మఠాధిపతి వినాయకుడి పూజకు ఖర్చు పెట్టే డబ్బు సంఘసేవకు ఖర్చు పెట్టమని అన్నాడు. మంచిదే, కానీ సినిమాలకు, క్రికెట్ క్రీడలకు ఖర్చు పెట్టే కన్నివేల కేట్లు వృథా చేయకుండా సంఘసేవకు ఖర్చు పెట్టమని చెప్పే దమ్ముందా వాళ్లకు. వినాయక చవితి ఆధ్యాత్మిక, సాంఘిక కార్యక్రమము. ఇది హిందువుల పండుగ మరియు వేడుక. మనం పెళ్లిలో చేసే తతంగమంతా ధర్మశాస్త్రంలో చెప్పబడినదా..? లేదే..! కొంతవరకు చెప్పబడింది. మిగతాది వేడుకగా చేసుకుంటారు. వరుడు గుర్రంపైన కానీ, కారులో కానీ ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఇది ధర్మశాస్త్రంలో చెప్పబడిందా? లేదని ప్రభుత్వం కానీ, న్యాయస్థానం కానీ జోక్యం కలిగించుకుంటున్నాయా?
 
ఇతర మతాల పండుగలలో జోక్యం చేసుకోని మన ప్రభుత్వాలు మన సంప్రదాయలలోనూ, ఆచారాలలోనూ, పండుగల్లోనూ ఎందుకు జోక్యం కలిగించుకుంటున్నది. నిజంగా ప్రజలు ఈ కార్యక్రమాలను వ్యతిరేకిస్తున్నారంటే మరి అంతమంది భక్తులు ఎలా ఈ వినాయకచవితి పండుగలో హాజరవుతున్నారు. భద్రతాపరమైన సమస్యలు ఉంటే అది చూసుకునే బాధ్యత ప్రభుత్వానిది. అంతేకానీ భద్రత కల్పించే స్థోమత లేక పండుగలో ఒక భాగమైన ఊరేగింపు చేయకూడదని ప్రభుత్వం ఎలా ఉత్తర్వులు జారీ చేస్తున్నది. 
 
రాత్రి 9 గంటల పైన షాపులు ఉండకూడదని, 11 గంటల పైన రోడ్లపైన తిరగకూడదని పోలీసు నిబంధనలున్నా, నెల రోజులు రాత్రివేళ రోడ్లపైన ఆహార పదార్థాలు అమ్ముతూ తింటూ ఒక మతం వాళ్లు పండుగలను చేసుకుంటున్నారు. మంచిదే, అది వారి సాంప్రదాయం, గౌరవిద్దాం. కానీ ఇతర మతాల పండుగలకు భద్రత కల్పించే ప్రభుత్వము మన పండుగలకు ఎందుకు కల్పించలేకపోతున్నది. 
 
ఎవరో ఒక పనికిమాలినవాడు కోర్టులో మన హిందూ సాంప్రదాయాలకు విరుద్ధంగా కేసు వేస్తే అతనికి అనుగుణంగా కోర్టు తీర్పు ఇస్తే వందల కోట్ల హిందువుల మనోభావాలను ఎంతగా దెబ్బతింటున్నాయో న్యాయస్థానాలు కూడా ఒక్కసారి గమనించవలసిన పరిస్థితి కలుగుతున్నది. 
 
కులాలకు, వర్గాలకు అతీతంగా అందరూ కలిసిమెలసి సామాజిక స్పృహతో కొన్నికోట్ల హిందువులు భక్తితో ఆనందంగా జరుపుకునే వినాయకచవితి పండుగను విమర్శించడం కానీ, ఊరేగింపు పైన నిర్ణయాలు, నిబంధనలు పెట్టడం ఖచ్చితంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటుందని వినయంగా మనవి చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా, మన సాంప్రదాయాలను మరచిపోకుండా ధర్మ మార్గంలో ఎవ్వరికీ తలవంచకుండా హిందువులంతా హిందువులుగానే చివరిదాకా బ్రతుకుదాం.
- ఆర్.బి.