శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 మే 2016 (15:26 IST)

తమిళనాడు : పత్తాలేని విజయకాంత్... డీఎండీకే భవిష్యత్ ఏంటి.. పార్టీ గుర్తింపూ ప్రశ్నార్థకమే!

తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ అధినేత విజయకాంత్ పత్తాలేకుండా పోయారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారో ఆయన కుటుంబ సభ్యులకు మినహా పార్టీలోని ఏ ఒక్క నేతకూ తెలియదు. దీంతో విజయకాంత్ పత్తాలేకుండా పారిపోయారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదేసమయంలో ఆయన సారథ్యంలోని దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం (క్లుప్తంగా డీఎండీకే) భవిష్యత్ ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆ పార్టీ గుర్తింపు కూడా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయకాంత్ తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా ఉన్నారు. అందుకే ఆయనతో పొత్తు పెట్టుకునేందుకు జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీతో పాటు... ప్రధాన ప్రాంతీయ పార్టీ అయిన డీఎంకే వంటి అనేక పార్టీలు వెంపర్లాడాయి. దీనికి కారణం కరుప్పు ఎంజీఆర్‌గా పేరు గడించడమే కాకుండా, మాస్‌లో మంచి ఇమేజ్ ఉండటంతో పాటు.. ఆ పార్టీకి 11 శాతం ఓటు బ్యాంకు ఉండటమే. ఇదంతా గురువారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికాకముందు. 
 
కానీ, ఇపుడు పరిస్థితి అంతా తారుమారైంది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి పోలైంది కేవలం 10,34,384 ఓట్లు మాత్రమే. అంటే 2.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికల్లో విజయకాంత్‌తో పాటు.. ఆ పార్టీ తరపునే కాదు.. ఆయన పొత్తుపెట్టుకున్న కూటమి తరపున పోటీ చేసిన అభ్యర్థులంతా చిత్తుగా ఓడిపోయారు. 
 
అదేసమయంలో డీఎండీకేకు కేవలం 2.4 శాతం ఓటు మాత్రమే వచ్చాయి. గత ఎన్నికల్లో అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుని ఆరు శాతం ఓట్లతో 29 సీట్లు దక్కించుకున్నారు. కానీ, ఈ దఫా ప్రజా సంక్షేమ కూటమితో పొత్తు పెట్టుకుని పోటీ చేసి.. ఉన్న ఓటు బ్యాంకును కోల్పోవడమే కాకుండా, చివరకు పార్టీ గుర్తింపుకు సైతం ముప్పు తెచ్చుకున్నారు. నిజానికి ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం 6 శాతం ఓట్లు రావాలి. ఇపుడు 2.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆ పార్టీ గుర్తింపు రద్దయ్యే అవకాశం ఉంది.