గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Eswar
Last Modified: సోమవారం, 7 జులై 2014 (15:25 IST)

ఇదీ పేదరికపు భారతదేశం... ప్రతి మూడో భారతీయుడు నిరుపేద

ప్రపంచవ్యాప్తంగా 1.2 బిలియన్ల మంది పేదరికంతో బాధపడ్తుంగా అందులో ఏకంగా మూడోవంతు మంది మనదేశంలోనే పేదరికంతో బాధపడ్తున్నారు. ఈ దేశంలో రోజుకి 65 రూపాయల కంటే తక్కువ వేతనంతో జీవనాన్ని కొనసాగిస్తున్నారని ప్రపంచబ్యాంకు నివేదిక వెల్లడించింది. 2011-12 ప్రణాళికా సంఘం నివేదికల ప్రకారం గ్రామాల్లో నివసించే ప్రజలు నెలసరి ఆదాయం 816 రూపాయలు కంటే తక్కువ ఆదాయం, పట్టణ, నగరాల్లో నివసించే వారి ఆదాయం నెలకు 1000 రూపాయలు కంటే తక్కువ ఆదాయం వున్న వారిని దారిద్ర్య రేఖకు దిగువన వున్న వారిగా గుర్తించింది. 
 
పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో చత్తీస్‌ఘడ్ రాష్ట్రం ముందు వరుసలో వుంది. ఈ రాష్ట్రంలో 39.93 శాతం మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నారని ప్రణాళికా సంఘం నివేదికలు చెబుతున్నాయి. 2000 నవంబర్ 1న మధ్యప్రదేశ్ నుంచి విడిపోయిన చత్తీస్‌ఘడ్ ఆర్థిక స్వావలంబన దిశగా ఇప్పటికీ బాలారిష్టాలను దాటలేకపోతోంది. చత్తీస్‌ఘడ్‌లో ఎక్కువగా గ్రామీణ గిరిజనులు, నగరాల్లో షెడ్యూలు కులాల వారు దారిద్ర్య రేఖకు దిగువన వున్నారు. రాష్ట్ర జనాభాలో 50 శాతం కంటే ఎక్కువ జనాభా కలిగిన ఎస్టీలు ఎక్కువశాతం దారిద్ర్య రేఖకు దిగువన నివశించడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇదో ప్రధాన సమస్యగా తయారైంది.  
 
దేశంలో సగానికిపైగా పిల్లలకు పోషకాహారాలు లేవు. నవజాత శిశువులకు అందించే పోషకాహారం లేక దేశంలో సగంమంది పిల్లలు బాధపడ్తున్నారు. ఇటువంటి జాబితాలో మనదేశం ఐదో స్థానంలో వుంది. ప్రభుత్వ విధానాలు సరిగ్గా అమలు కాక దేశంలో సగమంది పిల్లలు పోషకాహార లోపంతో బాధ పడ్తున్నారని యునిసెఫ్ అధ్యయనంలో వెల్లడైంది. ఆఫ్రికా దేశాలతో పోలిస్తే పోషకాహారలోపం దేశంలో సర్వసాధారణమైపోయింది. ఈ పరిస్థితిని తక్షణమే చక్కదిద్దాల్సిన అవసరం తాజాగా కొలువుదీరిన ప్రభుత్వాలపై వుంది. 
 
46 శాతం మంది పిల్లలు సాధారణ ఎదుగుదల కంటే మూడేళ్లు లేదా అంతకంటే తక్కువగానే వుందని నివేదికలు చెబుతున్నాయి. 47 శాతం మంది పిల్లలు ఉండాల్సిన బరువుకంటే తక్కువగా వుంటున్నారు. ఇందులో ఆడశిశువుల పరిస్థితి మగపిల్లలతో పోలిస్తే మరింత దారుణంగా వుంది. పిల్లలకు పోషకాహార లోపం ఎక్కువగా వున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ 55 శాతంతో మొదటిస్థానంలో వుండగా కేరళ 27 శాతంతో జాబితాలో చివరిస్థానంలో వుంది. సరైన ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోవడం, గర్భం దాల్చిన సమయంలో మహిళలు పోషక విలువలున్న ఆహారం తీసుకోకపోవడం వంటి అంశాలు పిల్లల పోషకాహార లోపాలకు ప్రధాన కారణాలు నిలుస్తున్నాయి. 
 
పోషకాహార లోపంతో దేశంలో ఏడాదికి మూడు వేల మంది నవజాత శిశువులు చనిపోతున్నారు. దేశమంతటికీ ఒకేవిధమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా చెబుతున్న మోడీ ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. ప్రతి రంగంలోనూ అభివృద్ధిని ఆశిస్తోన్న దేశ ప్రజలకు ఇప్పుడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు అత్యవసరంగా కనిపిస్తోంది. నూతన సాంకేతికత,పరిశోధన, ఆవిష్కరణల ద్వారా వైద్య ఆరోగ్య రంగంలో సరికొత్త మార్పులకోసం మోడి ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రణాళికను ప్రారంభించిన నేపథ్యంలో యునిసెఫ్ చెబుతున్న గణాంకాలు మోడి ప్రభుత్వంపై మరింత బాధ్యతను నెత్తిమీద పెట్టాయి. భవిష్యత్తులో ప్రారంభంకానున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఆచరణలోకి వస్తే దేశ ప్రజలకు ఆరోగ్యం పట్ల కొంతమేర ఊరట లభించినట్లే.