శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2016 (11:57 IST)

మాజీ ఎమ్మెల్యే కుతూహలమ్మ ఎక్కడ...? తెదేపాలో ఉన్నారా...

చిత్తూరు జిల్లా రాజకీయ నాయకుల కథలు చెప్పుకుంటే పోతే ఒక జీవిత కాలం సరిపోదని రాజకీయ విశ్లేషకులే చెప్పుకుంటుంటారు. అది నిజమే. సీఎం చంద్రబాబు నాయుడు నుంచి రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఎంతోమంది రాజకీయ నాయకు

చిత్తూరు జిల్లా రాజకీయ నాయకుల కథలు చెప్పుకుంటే పోతే ఒక జీవిత కాలం సరిపోదని రాజకీయ విశ్లేషకులే చెప్పుకుంటుంటారు. అది నిజమే. సీఎం చంద్రబాబు నాయుడు నుంచి రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఎంతోమంది రాజకీయ నాయకులు ఇక్కడి నుంచే వెళ్ళినవారే. అలాంటి కోవలో గంగాధర నెల్లూరు మాజీ ఎమ్మెల్యే కుతూహలమ్మ కూడా ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు. రాజకీయాల్లో అందరికీ సుపరిచితురాలే. దివంగత నేత వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డికి అత్యంత సన్నిహితురాలు. సోదరుడిగా పిలిచేంత సన్నిహితం. 
 
ఆ సన్నిహితమే చివరకు ఆమెను స్పీకర్‌ను చేసింది. కొన్నిరోజుల పాటు కుతూహలమ్మ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగినా కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగుతో ఆమె కూడా కనిపించకుండా వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ తీర్థం కూడా పుచ్చుకున్నారు. తెదేపా పార్టీలో ఆమె చేరిన విషయం ఆ పార్టీలోని చాలామంది నాయకులకే అసలు తెలియదు. అయితే ప్రస్తుతం కుతూహలమ్మ ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియదు. అసలు ఆమె తెదేపాలో ఉన్నారా? అన్న అనుమానం జిల్లా వాసులకు వస్తోంది.
 
కుతూహలమ్మ. ఒక వైద్యురాలు. రాజకీయాలపై ఉన్న మక్కువతో ఈ రంగంలోకి వచ్చారు. ఆ తర్వాత గెలవడం అసెంబ్లీలోకి అడుగుపెట్టడం అన్నీ ఒకటొకటిగా జరిగిపోయాయి. ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్‌, పార్టీలో రకరకాల పదువులు ఇలా ఎన్నో చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కుతూహలమ్మ అంటే తెలియని వారుండరు. ఇది నిజమే. కానీ ప్రస్తుతం మాత్రం కుతూహలమ్మ అంటే ఎవరో తెలియదంటున్నారు జిల్లా వాసులు. రాష్ట్ర విభజన తర్వాత ప్రజలకు కాంగ్రెస్‌పార్టీ ఏ విధంగా దూరమైందో అదే విధంగా నాయకులు కూడా ఒక్కొక్కరుగా దూరమవుతూ వస్తున్నారు. ప్రస్తుతం కుతూహలమ్మ కూడా అదేవిధంగా మారిపోయారు.
 
సీఎం చంద్రబాబునాయుడుతో ఉన్న పరిచయంలో కుతూహలమ్మ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో పేరుకే చేరారు తప్ప ఆ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా కనిపించరు. అసలు పార్టీ అంటే ఇష్టం లేదా.. రాజకీయమంటే కుతూహలమ్మకు నచ్చడం లేదా అన్న విషయం ఆ పార్టీ నాయకుల్లోనే పెద్ద చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేగా జి.డి. నెల్లూరు నియోజవర్గంలో అంతో.. ఇంతో అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉన్న కుతూహలమ్మ ఎవరికీ కనిపించకుండా తిరగడం, ఎవరితో కలవకపోవడం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.
 
కుతూహలమ్మ పార్టీ కార్యక్రమాలకు హాజరుకాలేదన్న విషయాన్ని రెండురోజుల క్రితం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబునాయుడు దృష్టికి స్థానిక నేతలు కూడా తీసుకెళ్ళారు. అయితే దీనిపై బాబు పెద్దగా స్పందించలేదట. కారణం ఆమెకు పార్టీలో ఎలాంటి పదవులు లేదు కాబట్టి. అసలు కుతూహలమ్మ రాజకీయ సన్యాసం తీసుకుంటారన్న ఊహాగానాలు మరోవైపు వినిపిస్తున్నాయి. కుతూహలమ్మ రాజకీయాల్లో ఉంటారో.. లేదో మరి కొన్నిరోజుల్లో తేలిపోనుంది.