బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : సోమవారం, 11 మే 2015 (08:02 IST)

తనయులు అమెరికాలో.. తండ్రులు ఇండియాలో.. పోటా పోటీ

తండ్రులు తమ తమ పార్టీల కోసం ముఖ్యమంత్రుల స్థాయిలో పల్లెలు పట్టుకుని తిరుగుతుంటే.. వారి తనయులు తమ తండ్రుల పేరు ప్రతిష్టల కోసం అమెరికాలోని రాష్ట్రాలు పట్టుకుని తిరుగుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రుల కుమారులిద్దరూ అమెరికాలో పర్యటిస్తూ తమ తండ్రుల ఘనత ప్రవాసభారతీయులకు చెప్పడంలో పోటీపడుతున్నారు. 
 
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో టీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అక్కడ కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ ను, ఇక్కడ చంద్రబాబు నాయుడు తన తనయుడు నారా లోకేష్ బాబును ప్రమోట్ చేసుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కేసీఆర్ తన కుమారుడిని మంత్రి చేస్తే.. ఇక్కడ చంద్రబాబు తన కుమారుడికి పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఇక ఆ తనయులు ఏం తక్కువ తినలేదు. 
 
తమ తండ్రుల ఘనతను చాటడానికి పోటాపోటీగా అమెరికా పర్యటన చేసేస్తున్నారు. అక్కడున్న ప్రవాసాంధ్రులను, తెలుగువారిని లక్ష్యంగా చేసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్‌ స్మార్ట్‌ విలేజ్‌పై అవగాహనా కార్యక్రమం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌ గ్రామాల అభివృద్ధిలో ప్రవాసాంధ్యులను భాగస్వాములుగా చేసే లక్ష్యంతో పలు నగరాల్లో ఉన్న ఎన్నారైలను కలుస్తున్నారు. లోకేష్‌ ఆదివారం న్యూజెర్సీలో ప్రవాసాంద్రులతో సమావేశమయ్యారు. స్మార్ట్‌ విలేజ్‌ స్మార్ట్‌ వార్డులకి సేవలందించాలని కోరారు. 
 
మరోవైపు తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆయన శనివారం నాడు పిట్స్‌బర్గులోని కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. రాబోయే రోజుల్లో దేశంలోనే తెలంగాణను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. వీరు చేస్తున్నదేమిటీ అంటే తమ తండ్రులు ఘనత వహించిన వారని పెట్టుబుడులు పెట్టడానికి ముందుకొస్తే అన్ని వసతులు ఉచితంగా కల్పిస్తామని తెగ హామీలిచ్చేస్తున్నారు.