శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 మే 2016 (20:07 IST)

టీడీపీ గూటికి మరో ఐదుగురు జగన్ ఎమ్మెల్యేలు.. ఎవరు వారు? విజయసాయిరెడ్డిని అడ్డుకోవడమే ధ్యేయం!

రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడి కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని, ఫిరాయింపుల చట్టం మేరకు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయకుండా నిషేధం విధించాలని కోరుతూ వైకాపా సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. 
 
అదేసమయంలో వైకాపాకు చెందిన మరో ఐదుగురు ఎమ్మెల్యేలు అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఇప్పటికే 17 మంది జగన్ ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఐదుగురు శాసనసభ్యులు సైకిలెక్కనున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో రాజ్యసభ ఎన్నికల నాటికి ఈ క్రీడ మరింత రసపట్టుకి చేరుకోనుంది. వైసీపీ పక్షాన ఆ పార్టీ నేత విజయసాయి రెడ్డి రాజ్యసభకు వెళ్లకుండా అడ్డుకోవడమే ధ్యేయంగా సాగుతున్న ఈ రాజకీయం క్షణక్షణానికీ ఉత్కంఠని పెంచుతోంది.
 
నిజానికి బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, తూర్పుగోదావరిజిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వైసీపీని వీడక ముందు పార్టీ నేతల్లో ఆత్మస్థైర్యం పుష్కలంగా ఉండేది. ఈ ముగ్గురు నేతలు ఎపుడైతే జగన్‌కు షాకిచ్చారో... పరిస్థితి ఒక్కసారి తారుమారైంది. దీంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా తెలుగుదేశం నేతలతో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లోకి వస్తున్నారు. చివరకు పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ కన్వీనర్, మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పేరు కూడా ఈ లిస్టులో చేరింది.
 
జగన్ కుటుంబ బంధువు, కర్నూలు జిల్లా నేత భూమా నాగిరెడ్డితో ప్రారంభమైన ఈ వలసల సంఖ్య అంతకంతకూ పెరిగి... 17 వద్ద ప్రస్తుతానికి ఆగింది. అయితే, జగన్ కుడిభుజంగా ఉన్న విజయసాయిరెడ్డిని రాజ్యసభకు వెళ్లకుండా అడ్డుకోవాలంటే తెలుగుదేశం పార్టీలోకి కనీసం 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు రావాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగానే తెలుగుదేశం నేతలు పావులు కదుపుతున్నట్టుగా సమాచారం. నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు కొంతమంది తెలుగుదేశం నేతలతో టచ్‌లో ఉన్నారు. వీరితో సంప్రదింపుల ప్రక్రియను పూర్తిచేసి ఈ నెలాఖరులోపు వీరికి తెలుగుదేశం తీర్ధం ఇవ్వనున్నారని విశ్వసనీయవర్గాల కథనం. ఏదిఏమైనా.. ఈనెలాఖరు నాటికి ఓ క్లారిటీ వచ్చే అవకాశం లేకపోలేదు.