శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : బుధవారం, 1 జులై 2015 (09:21 IST)

సోనియా నమ్మినబంటు ధర్మపురి శ్రీనివాస్ కారెక్కడానికి కారణమేంటి?

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఏకైక నమ్మినబంటు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్). సోనియాను నేరుగా కలిసేవారిలో డీఎస్ ఒకరు. అలాంటి వ్యక్తి సోనియాపైనే నొచ్చుకుని గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత, ప్రస్తుత తెరాస రాజ్యసభ సభ్యుడు కెకేశవ రావు నడిపిన రాయబారం ఫలించింది. ఫలితంగా మరో రెండు మూడు రోజుల్లో డీఎస్ కారులో ప్రయాణించనున్నారు. అయితే, సోనియాకు అత్యంత నమ్మకస్తుడిగా పేరొందిన డీఎస్.. తెరాస తీర్థం పుచ్చుకునేందుకు గల కారణమేంటనే విషయాన్ని ఆరా తీస్తే... 
 
గత 2004లో టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ పొత్తు కుదుర్చుకోవటంలో డీఎస్‌ క్రియాశీలకపాత్ర పోషించారు. అప్పుడు నిజామాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన డీఎస్‌.. వైఎస్‌ కేబినెట్‌లో మంత్రిగా కొనసాగారు. తర్వాత వైఎస్‌తో టీఆర్‌ఎస్‌ వైరం భగ్గుమన్నప్పటికీ... కేసీఆర్‌, డీఎస్‌ మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతూ వచ్చాయి. 2009 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా, డీఎస్‌కు పదవి దక్కలేదు. వైఎస్‌ మరణం తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది ఈ క్రమంలో ఆయనకు 2011లో ఎమ్మెల్సీగా పార్టీ అవకాశం ఇచ్చింది. 
 
2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి ప్రచారంలో ఉన్న వారిలో డీఎస్‌ కూడా ఉన్నారు. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మెజార్టీ స్థానాలను గెల్చుకొని అధికారంలోకి వచ్చింది. దీంతో డీఎస్‌ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసే వరకు శాసనమండలిలో విపక్షనేతగా కొనసాగారు. అయితే ఆయన తన ఎమ్మెల్సీ పదవి రెన్యువల్‌ కోసం గట్టిగా ప్రయత్నించారు. దీనికి దిగ్విజయ్ సింగ్ మోకాలొడ్డి, మహిళకు కేటాయించేలా చేసినట్టు వినికిడి. 
 
దీంతో దిగ్విజయ్ సింగ్‌పై డీఎస్ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. పైగా.. రాహుల్ కూడా చొరవ తీసుకోలేదనే భావన డీఎస్‌లో ఏర్పడింది. పైగా, ఇటీవల ఆదిలాబాద్‌ జిల్లా పర్యటనకు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు డీఎస్‌కు తగిన ప్రాధాన్యం దక్కకలేదు. ఇది పార్టీలో పెద్ద చర్చనీయాంశమైంది. మరోవైపు.. జాతీయ స్థాయిలో కూడా డీఎస్‌కు పార్టీ పదవులు దక్కే ఛాన్స్ లేదనే ప్రచారం ఉంది. వీటన్నింటిని బేరీజు వేసిన డీఎస్.. గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 
 
డీఎస్‌ కాంగ్రెస్‌ పార్టీపై అసంతృప్తిగా ఉన్నారనే సంకేతాలు అందడంతో మొదట బీజేపీ జాతీయ స్థాయి నేతలు తమ పార్టీలోకి రావాలంటూ ఆయనను ఆహ్వానించారు. ఇదేక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ సన్నిహితులు టచ్‌లోకి వచ్చి టీఆర్‌ఎస్‌లోకి రావాలని డీఎస్‌ను కోరినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌లోనే చేరాలని డీఎస్‌ సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని సమాచారం.