గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (15:26 IST)

అంత్యక్రియలు ప్రత్యక్ష ప్రసారాలు.. ఎక్కడ?

గొప్పవారి అంత్యక్రియలను ప్రత్యక్షంగా ప్రసారం చేయడం జరుగుతోంది. ఇప్పుడు సామాన్యుల అంతిమ సంస్కారాలనూ ప్రత్యక్షంగా ప్రసారం చేయగల పరిస్థితి వచ్చింది. ఎక్కడో కాదు.. తిరుపతిలోనే. అలాంటి సదుపాయాలు ఏర్పాటవుతున్నాయి. ఇక్కడ ఎవరైనా చనిపోతే వారి అంత్యక్రియలను ఎక

గొప్పవారి అంత్యక్రియలను ప్రత్యక్షంగా ప్రసారం చేయడం జరుగుతోంది. ఇప్పుడు సామాన్యుల అంతిమ సంస్కారాలనూ ప్రత్యక్షంగా ప్రసారం చేయగల పరిస్థితి వచ్చింది. ఎక్కడో కాదు.. తిరుపతిలోనే. అలాంటి సదుపాయాలు ఏర్పాటవుతున్నాయి. ఇక్కడ ఎవరైనా చనిపోతే వారి అంత్యక్రియలను ఎక్కడో విదేశాల్లో ఉన్న వాళ్ళ బంధువులూ ప్రత్యక్షంగా చూడవచ్చు. గోవింద... ధామం పేరుతో తిరుపతిలో ఏర్పాటవుతున్న అత్యాధునిక దహనవాటికలో సకల సదుపాయాలూ అందుబాటులోకి వస్తున్నాయి.
 
తిరుపతి నగర సమీపంలోని అక్కారంపల్లె వద్ద గ్యాస్ ఆధారిత దహనశాల నిర్మితమవుతోంది. గోవింద ధామం పేరుతో ఏర్పాటవుతున్న ఈ దహనవాటిక మరో రెండు నెలల్లో అందుబాటులోకి రానుంది. నెల్లూరుకు చెందిన మునగా నాగేశ్వరరావు చొరవతో 2011లో నిర్మాణం మొదలైన గోవింద ధామం తుదిమెరుగులు రూపుదిద్దుకుంటోంది. మరణాన్ని ఎవరూ ఆపలేరుగాని, తమవారి భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు కూడా సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి తలెత్తితే కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల శోకానికి అంతే ఉండదు. నేడు తిరుపతిలో కొన్నిచోట్ల ఆ పరిస్థితే కొనసాగుతోంది. కార్పొరేషన్ పరిధిలో నాలుగు స్మశానవాటికలు ఉన్నా ఆరడుగుల చోటు లేక శవాలను పూడ్చిన చోటే పూడ్చాల్సి వస్తోంది. మృతదేహాన్ని దహనం చేయాలన్నా అందుకు సరైన సదుపాయాలు లేవు. ఈ సమస్యలకు పరిష్కారంగానే గోవింద ధామం ఏర్పాటవుతోంది.
 
2011లో నాగేశ్వరరావు మదిలో వెలసిన ఈ ప్రాజెక్టు రూపకల్పనకు అహోరాత్రులు శ్రమించారు. తిరుపతి శ్రీ ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ టెంకాయల దామోదరం, మధుసూదన్, రవినాయుడు, మంజునాధ్ సహకారంతో గోవింద ధామంకు రూపకల్పన చేశారు. వీరబాహు సత్యహరిశ్చంధ్ర సేవా సంఘం, రోటరీ క్లబ్, ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యాన మహా ప్రస్థాన సేవా సమితి పేరుతో ఓ ట్రస్టు ఏర్పాటు చేశారు. ఆ ట్రస్టు ఆధ్వర్యంలోనే గోవింద ధామం పనులకు ఉపక్రమించారు. గ్యాస్ ఆధారితంగా పనిచేసే దహనవాటిక రాష్ట్రంలోనే ఇదే మొదటిది. గోవింధ ధామంలో రెండు గ్యాస్ బర్నర్స్ ఉన్నాయి. అంతిమ సంస్కారాల గది, పిండ ప్రధాన గదులు, కర్మక్రియల మండలపాలు, పురుషులకు, స్త్రీలకు ప్రత్యేక స్నానపు గదులు వంటివి కల్పించారు.
 
దహనవాటిక వద్ద ఉన్న హాలులో సంతాప సభలు వంటివి నిర్వహించుకోవచ్చు. బంధువులు రావడం ఆలస్యమైనా సంధర్భంలో భౌతిక కాయాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఫ్రీజర్ లో భద్రపరచవచ్చు. ఇదే విధంగా అస్తికలనూ భద్రపరచడానికి లాకర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నిర్వహించే అంతిమ సంస్కారాలనూ తమ వెబ్‌సైట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని, దీన్ని ఎవరైనా చూడవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. కోయంబత్తూరు నుంచి గ్యాస్ బర్నర్స్ తదితర సామాగ్రి సమకూర్చారు. 
 
దహన వాటికలను నిర్మించే నిపుణులనూ అక్కడి నుంచే తీసుకొచ్చారు. శవాల దహనం జరిగేటప్పుడు వాతావరణం కాలుష్యం కాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. దహన వాటిక నుంచి వచ్చే పొగ, శుభ్రమైన దాదాపు వంద అడుగుల గొట్టం ద్వారా పైకి వెళ్ళిపోయేలా ఏర్పాటు చేశారు. ఒక్కో మృతదేహం దహనమయ్యేందుకు 45నిమిషాల సమయం పడుతుందని, ఒక సిలిండర్ ఖర్చువుతుందని చెబుతున్నారు. దహన సంస్కారాలకు ఎంతో కొంత ఫీజు నిర్ణయిస్తామని చెప్పారు. అనాథ శవాలను ఉచితంగా దహనం చేస్తారు.