గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : మంగళవారం, 19 జులై 2016 (13:22 IST)

తెదేపాలో కొనసాగలేం... వైసిపికి పోదామా... : మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అంతర్మథనం!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది అందరికీ తెలిసిందే. అలాగే ఒక పార్టీలో ఉండే వారు మరో పార్టీలోకి వెళ్ళిపోవడం షరామామూలే. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఈ జంప్‌ జిలానీల సంఖ్య మరింత పెరి

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది అందరికీ తెలిసిందే. అలాగే ఒక పార్టీలో ఉండే వారు మరో పార్టీలోకి వెళ్ళిపోవడం షరామామూలే. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఈ జంప్‌ జిలానీల సంఖ్య మరింత పెరిగింది. ఎన్నో యేళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ ఏపీని విభజించిన తర్వాత ఆ పార్టీలో ఒక వెలుగు వెలిగిన నాయకులందరు పార్టీలో మారిపోయారు. కొందరైతే పార్టీని మారినా మంత్రి పదవులు మాత్రం చేజిక్కించుకుంటే మరికొందరు మాత్రం పార్టీలో సీనియర్లుగా కొనసాగుతున్నారు. మరికొందరైతే పార్టీ మారినా వారికి సముచిత స్థానం మాత్రం లభించకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. అదేపరిస్థితి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఎదుర్కొంటున్నారు.
 
కాంగ్రెస్‌ పార్టీ హయాంలో భూగర్భ, గనుల శాఖామంత్రిగా గల్లా అరుణకుమారి పనిచేశారు. దివంగత నేత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌లో పనిచేశారు గల్లా అరుణకుమారి. గల్లా అరుణకుమారి నాయుడు సామాజిక వర్గానికి చెందిన వారు. ప్రముఖ పారిశ్రామికవేత్త. ఈ నేపథ్యంలో అప్పట్లో వై.ఎస్‌.మంత్రి పదవి ఇచ్చి కేబినెట్‌లో కూర్చోబెట్టారు. మంత్రిగా పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు గల్లా అరుణకుమారి చేయకున్నా ఆ పదవికి మాత్రం న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. ఎలాగంటారా..ఆమె హుందాతనం..ఎక్కడికి వెళ్ళినా మంత్రికన్నా ఎక్కువగా ఫీలవడం ఇలాంటిది. 
 
అయితే ఇదంతా బాగానే ఉన్నా వై.ఎస్‌.చనిపోవడం, ఆ తర్వాత రాష్ట్ర విభజన. కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగై పోవడం. గల్లా అరుణకుమారి సైలెంట్‌ అయి పోవడం. ఇలా ఒక్కొక్కటిగా జరుగుతూ వచ్చాయి. చివరకు గల్లా అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్‌ ఏకంగా తెదేపా తీర్థం పుచ్చుకుని గుంటూరు ఎంపిగా గెలిచాడు. రాజకీయాలకు కొత్తముఖమే అయినా యువ రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. కేవలం తెదేపా పార్టీ జెండాతోనే జయదేవ్‌ గెలిచారని చెప్పిన వారు లేరు.
 
కుమారుడు తెదేపాలోకి వెళ్ళిపోయిందే ఇక తల్లి గల్లా అరుణకుమారి కూడా అదే బాటలోకి వచ్చింది. తెదేపాలోకి రావాలన్న ఆశక్తి ఎంతమాత్రం అరుణకుమారికి లేదని ఆమె అనుచరులే బహిరంగంగా చెప్పుకుంటుంటారు. తెదేపాలోకి వెళ్ళినా ఆమెకు ఇంత వరకు సముచిత స్థానం కల్పించలేదన్నది అందరికీ తెలిసిన విషయమే. మొదట్లో ఆమెకు మంత్రి పదవి ఖాయమని అందరూ భావించారు. ఎమ్మెల్సీ చేసి ఆ తర్వాత మంత్రి పదవి ఇస్తారన్న పుకార్లు వినిపించాయి. అయితే చివరకు మంత్రి పదవి కాదు కదా ఎమ్మెల్సీ కూడా లేకుండా పోయింది. చివరకు సాధారణ మహిళా కార్యకర్తగా గల్లా అరుణకుమారి పార్టీలో కొనసాగుతున్నారు. 
 
అంతేకాదు గత కొన్ని రోజులకు ముందు తిరుపతిలో జరిగిన తెదేపా మహానాడులో కూడా గల్లా అరుణకుమారికి ఒక ప్రత్యేకమైన వింగ్‌ను అప్పజెప్పారు. అదేంటో తెలుసుకుంటే నవ్వుకోవాల్సిందే. భోజనాలను పర్యవేక్షించే బాధ్యత. వచ్చిన అతిథులు, కార్యకర్తలు, నాయకులకు అందరికీ భోజనాలను దగ్గరుండి చూసుకోవాలన్నదే ఆ వింగ్‌. అయితే ఇచ్చిన బాధ్యత ఏదైనా సరే దానిని సక్రంగా నిర్వర్తించడం గల్లా అరుణకుమారికి ముందు నుంచి ఉన్న అలవాటే. బ్రహ్మాండంగా ఎన్నో రకాల వెరైటీలను దగ్గరుండి చేయించి అందరికీ వడ్డించి సెహబాష్‌ అనిపించుకున్నారు గల్లా అరుణకుమారి.
 
స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే మహానాడులో గల్లా అరుణకుమారిని మెచ్చుకుని సత్కారం కూడా చేశారు. అయితే పదవి మాత్రం ఇవ్వలేదు. పార్టీలో ఎంత కష్టపడి పనిచేసినా కార్యకర్తలు, నాయకులును కలుపుకుని పోయినా పార్టీలో మాత్రం పదవులు మాత్రం లభించకపోవడంపై గల్లా అరుణకుమారి ఆవేదనలో ఉన్నారు. ఆదివారం తిరుపతి సమీపంలోని గల్లా ఫుడ్స్ (గల్లా అరుణకుమారి సొంత ఫ్యాక్టరి)లో తన అనుచరులతో సమావేశమయ్యారు అరుణకుమారి. పార్టీలో ఉండాలా వద్దా అనే విషయంపై అనుచరులతో సుధీర్ఘంగా చర్చించారు.
 
అయితే కొంత మంది అనుచరులు మాత్రం పార్టీని వదిలేయడమే మంచిదని చెబితే మరికొందరు బాబు(గల్లా జయదేవ్‌) ఎంపిగా ఉండగా పార్టీని వీడటం సమంజసం కాదని నచ్చజెపుతున్నారు. అనుచరులు చెప్పిన సలహాలపై దీర్ఘాలోచనలో పడ్డారు గల్లా అరుణకుమారి. పార్టీ మారితే ఇక ఉన్నది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే. అందులో చేరక తప్పదు. అయితే కొడుకు తెదేపా ఎంపిగా ఉంటే మనం పార్టీ మారితే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశమూ లేకపోలేదు. ఇలాంటి ఆలోచనలో పడ్డారు గల్లా అరుణకుమారి. మొత్తం మీద గల్లా అరుణకుమారి రహస్య అనుచరుల సమావేశం ప్రస్తుతం చిత్తూరుజిల్లా వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది.