శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : ఆదివారం, 7 ఫిబ్రవరి 2016 (08:55 IST)

'గ్రేటర్' పీఠం తెరాసదే : గెలిచిన సీట్లు 99.. బలం 133... చిరంజీవికి కూడా ఓటు... ఎలా?

హైదరాబాద్ నగర పాలక సంస్థ పీఠాన్ని తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెరాస కైవసం చేసుకోనుంది. తాజాగా జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకుగాను తెరాస ఏకంగా 99 సీట్లను కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ గెలుపు.. గ్రేటర్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.
 
ఈ పరిస్థితుల్లో ఈనెల 11వ తేదీన జీహెచ్ఎంసీ సమావేశం జరుగనుంది. అదే రోజున మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోనున్నారు. ఈ రెండింటిని కూడా తెరాసనే కైవసం చేసుకోనుంది. అది ఎలాగంటే.. 
 
ఈ ఎన్నికల్లో తెరాస కైవసం చేసుకున్న కార్పొరేట్ డివిజన్లు 99 కాగా, 34 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి తెరాస బలం 133కు చేరుకుంది. దీన్నిబట్టి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 24 మంది సభ్యులు అదనంగా ఉంది. ఆ పార్టీ మేయర్ పీఠాన్ని సునాయాసంగా చేజిక్కించుకోనుంది. కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులు చేతులెత్తే పద్ధతిలో వీరిని ఎన్నుకుంటారు. 
 
ఈ నేపథ్యంలో తాజా నిబంధనల ప్రకారం నగరంలో ఓటుహక్కు ఉన్న ప్రజాప్రతినిధులు, ఒకవేళ వారు రాజ్యసభ సభ్యులైతే వారు ఏ రాష్ట్రం వారనే విషయంతో సంబంధం లేకుండా ఇక్కడ ఎక్స్‌అఫీషియో సభ్యులుగా కొనసాగే అవకాశం ఉంది. దీంతో కొత్తగా ఏఎం ఖాన్, చిరంజీవి, కె.కేశవరావు, జైరాంరమేశ్ తదితరులకు ఓటుహక్కు లభించింది.
 
అదేసమయంలో మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇదివరకే తమ ఓటుహక్కును రంగారెడ్డి జడ్పీ ఛైర్మన్ ఎన్నికలో వినియోగించుకోవడంతో వారికి నగరంలో ఎక్స్‌అఫీషియోలుగా అవకాశం లేకుండా పోయింది. వీరిని వదిలేస్తే 24 మంది (నామినేటెడ్ ఎమ్మెల్యేసహా) ఎమ్మెల్యేలు, 9 మంది రాజ్యసభ సభ్యులు, నలుగురు లోక్‌సభ సభ్యులు, 30 మంది ఎమ్మెల్సీలు మొత్తం 67 మంది ఎక్స్‌అఫీషియోలు ఉన్నట్లు అధికారులు తేల్చారు.