శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: బుధవారం, 13 జులై 2016 (15:21 IST)

అమ్మాయిలను చంపుతున్నారు... ఉగ్రవాదులు నరికేస్తున్నారు... ఈ దారుణ స్థితి అందుకేనట...

కలియుగం అంతానికి ఇంకాస్త టైముంది అని మన పెద్దలు అంటుంటారు. ఎందుకంటే నీతి ఒక పాదం, అవినీతి మూడు పాదాల రాజ్యంలో మనం ఉన్నాం. నీతి కాస్తా కనుమరుగై నాలుగు పాదాలను ఆక్రమిస్తే ఇక పోతులూరి వీరబ్రహ్మంగారు చెప్పింది జరిగేందుకు ఆట్టే కాలం పట్టదనుకోండి. ఇదిలావుం

కలియుగం అంతానికి ఇంకాస్త టైముంది అని మన పెద్దలు అంటుంటారు. ఎందుకంటే నీతి ఒక పాదం, అవినీతి మూడు పాదాల రాజ్యంలో మనం ఉన్నాం. నీతి కాస్తా కనుమరుగై నాలుగు పాదాలను ఆక్రమిస్తే ఇక పోతులూరి వీరబ్రహ్మంగారు చెప్పింది జరిగేందుకు ఆట్టే కాలం పట్టదనుకోండి. ఇదిలావుంటే సైంటిస్టులు ఏదో ఒక అంశంపై పరిశోధనలు చేస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న రక్తపాతం, అడ్డగోలుగా, అన్యాయంగా, అత్యంత కిరాతకంగా దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు వీటన్నిటిపైనా పరిశోధకులు తమతమ పరిశోధనలు చేస్తున్నారు. అసలు ఇంతటి హింసకు దారితీస్తున్న పరిస్థితుల పట్ల వారు లోతైన అధ్యయనం చేయగా కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. అవేంటో ఒక్కసారి పరిశీలిద్దాం.
 
మనం చూస్తూనే ఉన్నాం. ఎండాకాలంలో వానలు. వానాకాలంలో బండలు పగిలే ఎండలు. ఫలితం కరవు. పచ్చగా ఉండాల్సిన చెట్లు ఎండిపోతున్నాయి. చాలా గ్రామాల్లో గడ్డిపోచ లేదు. పశువుల మేతకు అల్లాడుతూ కబేళాలకు తరలుతున్నాయి. ఈ దారుణ పరిస్థితికి కారణం గ్లోబల్ వార్మింగ్... అదే భూతాపం. ఈ కారణంగా మానవ జీవితం కష్టాల సుడిగుండంలో కొట్టుకుపోయే పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. పంటలు పండక చాలామంది గ్రామాలను వదిలేసి నగర బాట పడుతున్నారు. దీనితో నగరాల్లో పరిస్థితులు అల్లకల్లోలమవుతున్నాయి.
 
మరోవైపు ఈ భూతాపం కారణంగా అడవులు, వృక్షాలు, జంతువులు నశించడమే కాదు దీని ప్రభావం మానవుడి మెదడు పైన కూడా చూపుతోందట. ముఖ్యంగా భూ ధృవాలకు సమీపంలో ఉన్నవారి కంటే భూమధ్య రేఖా ప్రాంతంలో ఉండే ఉష్ణమండలాల్లో నేరాలు ఎక్కువ కావడానికి కారణం భూతాపమే అని అంటున్నారు. మనిషి శ్రుతి మించిన కోపిష్టిగా మారిపోవడానికి ఈ భూతాపమే కారణమని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు.
 
సహజంగా వాతావరణ పరిస్థితులపైనే మానవ జీవన విధానం ఆధారపడి ఉంటుంది. ఇదివరకు పల్లెల్లో 80 నుంచి 90 శాతం మంది వేకువ జామునే లేచి పొలం పనులకు వెళ్లేవారు. కాయకష్టం చేసిన వారి శరీరాలు పూర్తిగా అలసిపోయి సాయంత్రం వేళల్లో ఇంటికి వచ్చేన తర్వాత తమ పొరుగింటివారితో, కుటుంబ సభ్యులతో కుశల ప్రశ్నలు వేస్తూ అలా తమ దినచర్యకు ముగింపు పలికేవారు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో మార్పులు వచ్చేశాయి. పల్లెల్లో వ్యవసాయం తగ్గిపోయింది. ప్రతి ఒక్కరూ ఆధునిక జీవితానికి అలవాటై, సంబంధిత సాధనాలకు బానిసలైపోయారు. తత్ఫలితంగా మనిషి మెదడు మరో రకంగా మారుతున్నట్లు పరిశోధకులు చెపుతున్నారు. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఒకవైపు భూతాపం, మరోవైపు మారుతున్న మనిషి మానసిక స్థితి అంతా కలిసి అతడిని తీవ్రమైన కోపోద్రిక్తుడుగా మార్చేసి నేరమయ జీవితంలోకి నెట్టివేస్తున్నట్లు శాస్త్రజ్ఞులు చెపుతున్నారు.
 
భూతాపం పెరిగినప్పుడు సహజంగా మనిషి మనస్తత్వంలో మార్పులు వస్తాయని తమ పరిశోధనలో తేలినట్లు వారు చెపుతున్నారు. అంతేకాదు... మామూలుగా కూడా ఎండ వేడిమి విపరీతంగా ఉన్న సమయంలో మనిషి తీవ్రమైన అసహనానికి గురవడమే కాకుండా అతడిని పలుకరించే వ్యక్తిని కసురుకోవడం వంటి చేష్టలు కూడా చూడవచ్చనీ, ఇలా కేవలం వేసవిలోనే మనిషి ఇలా ఉంటే ఇక మొత్తంగా భూమి గ్రహం వేడెక్కిపోతుంటే అతడి మానసిక స్థితి ఇలాగే ఉంటుందని వారు చెపుతున్నారు.
 
అంతేకాదు ఈ విషయాలను ఆధారాలతో సహా నిరూపించారు. వాతావరణం... 35 డిగ్రీలు ఉన్నప్పుడు జరుగుతున్న నేరాలు, 24 డిగ్రీలుగా ఉన్నప్పుడు జరుగుతున్న నేరాలను పరిశీలించినప్పుడు... 35 ఉన్నప్పుడు నేరాల శాతం ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. కాబట్టి ఈ భూతాపాన్ని నిలువరించేందుకు చర్యలు తీసుకోనట్లయితే కలియుగ అంతం దాకా కాదు... అంతకంటే ముందే మనిషులే మనుషుల్ని చంపుకుంటూ ఈ మానవ లోకం అంతం చేసుకునే ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వారు చెపుతున్నట్లుగానే ఇప్పటికే ప్రపంచాన్ని ఐసిస్ భూతం భయపెడుతోంది. ఎక్కడో సిరియా, ఇరాక్ దేశాల వరకే పరిమితమయ్యిందిలే అనుకుంటుంటే ఇప్పుడది భారతదేశంలోనూ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాబట్టి గ్లోబల్ వార్మింగ్ ను అంత తేలిగ్గా కొట్టేయకూడదు. తీవ్రంగా ఆలోచించి అందుకు తగ్గ చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.