మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By chj
Last Updated : శనివారం, 17 సెప్టెంబరు 2016 (12:11 IST)

నరేంద్ర మోదీ 66వ జన్మదినోత్సవం... The "make in INDIA" man

టీ అమ్మే స్థాయి నుండి దేశ ప్రధానమంత్రిగా ఎదిగిన వ్యక్తి నరేంద్ర మోదీ. కాంగ్రెస్ పార్టీ పాలనకు ప్రత్యామ్నాయం లేదని భారత ప్రజలు దిగులుపడుతున్న తరుణంలో వారికి కనిపించిన ఆశా కిరణం నరేంద్రమోదీ. 1950 సెప్టె

టీ అమ్మే స్థాయి నుండి దేశ ప్రధానమంత్రిగా ఎదిగిన వ్యక్తి నరేంద్ర మోదీ. కాంగ్రెస్ పార్టీ పాలనకు ప్రత్యామ్నాయం లేదని భారత ప్రజలు దిగులుపడుతున్న తరుణంలో వారికి కనిపించిన ఆశా కిరణం నరేంద్రమోదీ. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని వాద్‌నగర్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నరేంద్ర మోదీ పాఠశాల విద్య స్థానికంగానే పూర్తి చేశారు. గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందినారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే అఖిల భారతీయ విద్యార్థి పరుషత్తు నాయకుడిగా పనిచేశారు. 1970లలో విశ్వ హిందూ పరిషత్తులో చేరారు. శాసనమండలి సభ్యుడిగా, గుజరాత్ రాష్ట్ర మంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవులు పొంది భారతదేశ ప్రధానమంత్రి పదవి అధిష్టించారు.
 
1987లో నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీలో ప్రవేశించారు. కొద్దికాలంలోనే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ  ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. 1990లో లాల్ కృష్ణ అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రకు, 1992లో మురళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి - కాశ్మీర్ రథయాత్రకు ఇన్చార్జీగా పనిచేశారు. 1998లో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. పార్టీలో సీనియర్ నాయకుడైన కేశూభాయి పటేల్ గుజరాత్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. 
 
ఆ సమయంలో గుజరాత్‌లో సంభవించిన పెనుభూకంపం తర్వాత సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశూభాయి ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించడంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వం 2001 అక్టోబర్‌లో నరేంద్ర మోదీని గుజరాత్ ముఖ్యమంత్రి పీఠంపై అధిష్టించింది. అప్పటి నుంచి మే 21, 2014 నాడు ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు వీలుగా రాజీనామా చేసేవరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీనే కొనసాగినారు. 14 ఏళ్ళపాటు గుజరాత్ రాష్ట్రానికి విశేషమైన పాలనను అందించి రాష్ట్ర ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.
 
సంకీర్ణ ప్రభుత్వాల పాలనే దేశానికి శరణ్యమనుకుంటున్న వేళలో 2014 ఎన్నికల్లో భారతీయ జనాతాపార్టీకి తిరుగులేని మెజార్టీని సాధించడానికి మోదీయే ప్రధాన కారణం. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్న అసంతృప్తి, నరేంద్ర మోదీ పైన ప్రజలకు గల ప్రత్యేక ఆకర్షణ ఎన్నికల్లో విజయానికి దోహదం చేశాయి. రెండున్నరేళ్ళ పాలనలో మోదీ అత్యధికంగా విదేశీ సంబంధాలను మెరుగు పర్చుకునే విధానం పైనే దృష్టి సారించారు. గతంలో పోలిస్తే పాలనలో అవినీతి తగ్గుముఖం పట్టింది. స్వచ్ఛ భారత్ లాంటి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టి దేశ ప్రజలను చైతన్యపర్చడంలో విజయం సాధించారు. 
 
మన్ కీ బాత్ లాంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి – ప్రజలకు ఉన్న దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. పేద ప్రజానీకం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారు. ఐతే ఆ పథకాలను ప్రజల్లోని తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయలేదనే విమర్శలు ఉన్నాయి. అట్లే నల్ల ధనాన్ని వెలికితీస్తామని ఎన్నికల్లో ప్రకటించిన మోదీ అటువంటి కార్యచరణ ఒక్కటి కూడా చేపట్టలేకపోయారు. ధరల నియంత్రణలోను ఆయన విజయం సాధించలేకపోయారనే విమర్శలు వినబడుతున్నాయి. పార్టీలోని అన్ని వర్గాల వారిని కలుపుకొనిపోవడంలో ఆయన వైఫల్యం చెందారనే వాదనలు వినిపిస్తున్నాయి.
 
2002లో అమెరికా నరేంద్రమోదీకి వీసా ఇవ్వడానికి నిరాకరించింది. అదే అమెరికా 2014 మోదీ విజయానంతరం ఆయనకు సాదర స్వాగతం పల్కింది. నరేంద్ర మోడికి నలుగులు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆయన వెంట ఎప్పుడు లాప్ టాప్‌ను ఉంచు కుంటారు. ఖరీదైన దుస్తులు ధరిస్తారు. అనేక వ్యాసాలతో పాటు 3 పుస్తకాలను కూడా రచించారు. సొంత ఆస్తి కూడబెట్టుకోలేదు. మంచి వక్త, వ్యూహకర్త అయిన మోడీ జీవితంలో చాలా భాగం ఇప్పటికీ రహస్యమే. సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రుల వంటి పదవులను అధిష్టించినవారి కుటుంబసభ్యులు ఏదో ఒక విధంగా లబ్ధి పొందుతుంటారు. రాజకీయాల్లోకి వస్తుంటారు. కానీ, మోడీ కుటుంబం ఇందుకు పూర్తి విరుద్ధం. ఆయన సోదరులు, సోదరీమణులు ఎవరి జీవితం వారిదే. తండ్రి దామోదర్‌దాస్ మరణించగా, తల్లి హీరాబెన్ మోడీ వద్దే ఉంటారు. మోడీ శాకాహారి.
 
సమకాలీన రాజకీయ నాయకులలో మోదీది భిన్నమైన శైలి. భారతదేశాన్ని పరిపాలించిన భారత ప్రధానులలో మోదీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనకు ప్రత్యామ్నాయం లేదని భారత ప్రజలు దిగులు పడుతున్న తరుణంలో వారికి కనిపించిన ఆశా కిరణం నరేంద్రమోదీ. అప్పటి వరకు భారతీయ జనతాపార్టీకి దూరంగా ఉన్న ముస్లిం మైనార్టీలు, దళిత సామాజిక వర్గాలు సైతం ఆయనను నమ్మి భాజపాకు అధికారాన్ని కట్టబెట్టారు. దురదృష్టశాత్తూ క్రమంగా ఈ వర్గాల ప్రజల అభిమానాన్ని మోదీ కోల్పోతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఆ వర్గాల అభిమానాన్ని కోల్పోకుండా, పేద - మధ్య తరగతి ప్రజల ఆశలను, ఆకాంక్షలను తీర్చగలిగితే ఇంకొంత కాలం ఆయన భారత ప్రధానిగా కొనసాగతారనుటలో సందేహం లేదు.