మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2015 (21:10 IST)

22 యేళ్లు.. బీకాం పట్టభద్రుడు.. గుజరాత్‌ను ఊపేస్తున్నాడు... ఎవరా యువహీరో?

కేవలం పట్టుమని రెండు పదుల వయస్సు కూడా నిండని యువకుడు. బీకాం పూర్తి చేసిన నిరుద్యోగి. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సాధారణ రైతుబిడ్డ. ఇపుడు ఒక్క గుజరాత్‌నే కాదు.. దేశం యావత్తును తనవైపునకు తిప్పుకున్న యువ సంచలనం. జాతీయ అంతర్జాతీయ మీడియాలో ఆ యువకుడి మాటలు తూటాలై పేలుతున్నాయి... ఫలితంగా గుజరాత్ పాలకులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఆ యువ కెరటం పేరే హార్దిక్ పటేల్. వయస్సు 22 యేళ్లు.
 
 
గుజరాత్ రాష్ట్ర జనాభాలో పటేల్ సామాజికవర్గం ప్రజలు 15 శాతం. ప్రస్తుతం ఈ వర్గం వారంతా ఏకమై తమకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తున్నారు. ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.. నాంది పలికింది ఈ యువకుడే. నిజానికి ఈ పటేల్‌ వర్గీయులు సాధారణంగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయరు. అపుడెపుడో మూడు దశాబ్దాల క్రితం దళితులు, ఆదివాసీలు, బీసీలకు విద్యాలయాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తంచేశారు. 
 
ఆ తర్వాత ఇపుడు మళ్లీ రోడ్డెక్కారు. తమ కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఏకంగా పోరాటబాటను పట్టారు. శాంతియుతంగా ప్రారంభమైన ఈ ఉద్యమం క్రమేణా హింసాత్మకంగా రూపుదాల్చింది. పటేల్ కులానికి చెందిన లక్షలాది మంది తమ డిమాండ్‌ను సాధించుకునేందుకు కదంతొక్కారు. ఫలితంగా ఒక్క గుజరాత్‌లోనే కాదు, యావత్ భారతదేశ దృష్టిని ఈ ఉద్యమం ఆకర్షించింది. 
 
ఈ ఉద్యమం వెనుక ఉన్నది కేవలం ఒకే ఒక్కడు. అదీ ఓ యువశక్తి. ఆ యువశక్తి ప్రభంజనంతో గుజరాత్ రాజకీయాలు అట్టుడికిపోతున్నాయి. రాష్ట్రంలోని పటేల్ సామాజిక వర్గానికి ఏకతాటిపైకి తీసుకుని రావడంతో ఆ ఒక్కడి పోరాటపటిమ, మార్గదర్శనం అమోఘం. ఏ ఒక్క రాజకీయ శక్తి అండలేకుండా, లక్షలాది మంది పటేల్ సామాజిక వర్గాన్ని ఏకం చేసి తన అడుగుజాడల్లో నడిచేలా చేసి శాభాష్ అనిపించుకోవడానికి అతని బాణాల్లాంటి మాటలే. ఈ మాటలు తూటాలై పేలాయి. ఎంతలా అంటే.. రాజకీయ నేతలు సమాధానం చెప్పుకోలేనంతగా. పటేల్ వర్గీయులు మరింత ఐక్యం చేసేటంతటి విధంగా. అందుకే ఈ యువకుడిని గుజరాత్ నుంచి పుట్టిన రెండో మోడీగా కీర్తిస్తున్నారు పటేల్ సామాజికవర్గం ప్రజలు. 
 
వాస్తవానికి హార్దిక్ పట్లే చదువుల్లో అత్తెసరు మార్కులతో పాసయ్యే ఓ సాధారణ యువకుడు. కానీ, తన వాగ్ధాటితో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. మంత్రమగ్ధులను చేస్తున్నాడు. ఫలితంగా పటేల్ సామాజికవర్గంలో హార్దిక్ ఇప్పుడొక హీరోగా మారిపోయాడు. కేవలం రెండు నెలల క్రితం అతను ప్రారంభించిన ఈ పోరాటానికి యావత్ సామాజికవర్గం మద్దతు పలకడంతో, అతని ఇమేజ్ దిగంతాలకు వ్యాపించింది. తమను ఓబీసీల్లో చేర్చకపోతే 2017లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాధికడతామంటూ కమలనాథులకు బహిరంగ హెచ్చరిక చేశారు. ఫలితంగా గుజరాత్‌లో బీజేపీ పాలకులు హడలి పోతున్నారు.
 
ఈ కుర్రోడి వ్యక్తిగత విషయాలు పరిశీలిస్తే... అహ్మదాబాద్ సమీపంలోని వీరంగామ్ అతని స్వస్థలం. బీకాం పూర్తి చేసి, డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు. ఈయన తండ్రి ఓ రైతు. చిరు వ్యాపారి కూాడా. తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. "పటేల్ వర్గానికి చెందిన విద్యార్థి 100కు 90 మార్కులు సాధించినా ప్రభుత్వ కోటాలో ఎంబీబీఎస్ సీటు రాదు. కానీ, ఓ ఎస్సీ ఎస్టీ, ఓబీసీ వర్గానికి చెందిన విద్యార్థులకు 45 శాతం మార్కులు సాధించినా సీటు వస్తుంది". ఇది ఆ యువకుడుని తీవ్రంగా ఆలోచింపజేసింది. ఇకేమాత్రం ఆలోచన చేయకుండా పటేల్, పటీదార్ అమానత్ ఆందోళన్ సమితిని స్థాపించాడు. 
 
ఈ సమితి ద్వారా తన సామాజికవర్గం అభ్యున్నతి కోసం ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. తమ బతుకులు బాగుపడటానికి తమను ఓబీసీల్లో చేర్చండి అంటూ ఉద్యమానికి ఊపిరి ఊదాడు. కొద్ది మందితో ఓ మోస్తరు సమావేశాలు ఏర్పాటు చేసి, వారిలో చైతన్యం కలిగించాడు. హార్దిక్ మాటలు బాణాల్లాంటివి... ఖచ్చితంగా అవి లక్ష్యాన్ని తాకాయి! ఒకరి నుంచి మరొకరికి భావజాల వ్యాప్తి జరిగింది. హార్దిక్ కూడా పెద్ద డైలాగుల జోలికి వెళ్లకుండా, ఎందుకు చేయాలి? ఏంచేయాలి? అంటూ స్పష్టంగా విడమర్చి చెబుతూ సామాన్యుల్లో సైతం రిజర్వేషన్లపై అవగాహన కల్పించాడు. 
 
తమ సామాజిక వర్గ భవిష్యత్తును విజయవంతంగా కళ్లకు కట్టాడు. ఇది సఫలీకృతమైంది. అక్కడి నుంచి మొదలైంది అతడి హవా. చిరు సమావేశాల నుంచి భారీ బహిరంగ సభల స్థాయికి ఎదిగింది ఉద్యమం. అతడి పిలుపే ఓ ప్రభంజనంలా మారిపోయింది. హార్దిక్ సభకు వస్తున్నాడంటే పిల్లాపెద్దలు, ఆడామగా తేడా లేకుండా అందరూ వచ్చేస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం కావడంతో సహజంగానే మీడియా బాగా ప్రాధాన్యం కల్పించింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏం చేయాలో అదే చేసింది. ఓ సభ నేపథ్యంలో, నిబంధనల పేరిట పోలీసులు హార్దిక్‌ను అదుపులోకి తీసుకోవడంతో పటేళ్లు ఆగ్రహోదగ్రులయ్యారు. దాంతో, అల్లర్లు ప్రారంభం కాగా, పలువురు ప్రాణాలు విడిచారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రంలో జరుగుతుండటంతో ఈ ఉద్యమంపై కేంద్రం కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. 
 
22 ఏళ్ల హార్దిక్ పటేల్‌కు చెందిన గ్రూప్ మొత్తం యువకులతో నిండి ఉంటుంది. తమ పోరాట లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీరంతా సోషల్ మీడియానే ప్రధాన అస్త్రంగా ఎంచుకున్నారు. ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ మాధ్యమాల ద్వారా ఉద్యమాన్ని అనతికాలంలోనే రాష్ట్ర వ్యాప్తం చేశారు. గత 50 రోజుల నుంచి తన కమ్యూనిటీ ప్రజలను ఏకం చేయడానికి హార్దిక్ పటేల్ రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలన్నింటినీ చుట్టేశాడు. తమ సమస్యల సాధన కోసం హార్దిక్ చేస్తున్న కృషిని పటేల్ సామాజిక వర్గం మొత్తం గుర్తించింది. 
 
దీంతో, హార్దిక్ పిలుపు మేరకు వారంతా రోడ్డెక్కి నిరసనలు, ధర్నాలు, చివరకు బుధవారం బంద్ కూడా నిర్వహించారు. తమ డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే, ఢిల్లీలో తమ నిరసన వ్యక్తం చేస్తామని కూడా హార్దిక్ హెచ్చరించాడు. అంటే, తమ పోరాటాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి కూడా అతను వెనుకాడటం లేదన్నమాట. ఈ లక్షణాలే అతన్ని గుజరాత్‌లో హీరోను చేశాయి. మరి, తన లక్ష్యాన్ని హార్దిక్ పటేల్ సాధిస్తాడా? లేదా? అనేది వేచిచూడాలి!.