శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: మంగళవారం, 11 నవంబరు 2014 (14:03 IST)

తెలంగాణ విద్యుత్ సమస్య కార్గిల్ యుద్ధంతోనా...? టి. నవజాత శిశువు లెక్కేంటి...?

‘నవజాత శిశువు’ ఇది ప్రస్తుతం తెలంగాణలో పదేపదే వినిపిస్తున్న పదం. తెలంగాణ ప్రభుత్వం సొంతం చేసుకున్న రాజకీయ ఊతపదం. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుకుని టీఆర్ఎస్ సాధారణ కార్యకర్త వరకూ అన్ని స్థాయిలలోని వారు వల్లెవేస్తున్న పదం. ఇంతకీ ఈ పదం రాజకీయాలలో ఎప్పుడు పుట్టింది? ఎలా పుట్టింది? అంటే దీనికీ కొన్ని కారణాలున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్తు సమస్య పట్టిపీడిస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు విద్యుత్తు సమస్యను ఏమాత్రం రానివ్వమని బీరాలు పోయిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక విద్యుత్తు సమస్యను పరిష్కరించలేక చతికిలబడి పోయాడు. మాటల గారడీ చేసి సెంటిమెంటుతో నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

 
ఇదే అదునుగా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసే పనిని మొదలు పెట్టాయి. కాంగ్రెస్ ఓ అడుగు ముందుకేసి పాదయాత్ర షురూ చేసేసింది. దీనిని చూసి బెదిరిన కేసిఆర్ తమ ప్రభుత్వాన్ని నవజాత శిశువుతో పోల్చుకుని సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. ఇక ఇక్కడ నుంచి ఈ ‘నవజాత శిశువు’ టీఆర్ఎస్ కు రాజకీయ ఊతపదంలా మారిపోయింది. అసలు నవజాత శిశువు అంటే ఏమిటి? పుట్టినప్పటి నుంచి మూడు నెలల వరకూ ఉన్న బిడ్డను వైద్య పరిభాషలో ‘నవజాత శిశువు’ అంటారు. గాలి పీల్చుకోవడం, నిద్రపోవడం తప్ప మరే ఇతర పనులను స్వయంగా చేసుకోలేక తల్లి మీద ఆధారపడే అన్నెంపున్నెం తెలియని పసిబిడ్డే నవజాత శిశువు. ఆకలేస్తే ఏడ్వడం కూడా పూర్తిస్థాయిలో తెలియని స్థితి వారిది.

 
ఇక టీఆర్ఎస్ చెబుతున్న రాజకీయ నవజాత శిశువును పరిశీలిస్తే... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత తెలంగాణ ఏర్పడింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ప్రత్యేక పరిస్థితులలో, ప్రత్యేక పద్ధతులలో అన్ని వసతులతో ‘వడ్డించిన విస్తరి’లా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఒక్క విద్యుత్ సమస్య మినహా తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కంటే ముందే ఉంది. అనుకుంటే ఆ సమస్యకు కూడా పరిష్కారం సాధ్యమే. కాకపోతే కాస్త ఆలస్యం కావచ్చు. 
 
మిగులు బడ్జెట్, పూర్తిస్థాయిలో అన్ని హంగులతో ఉన్న రాజధానితో ఉన్నది తెలంగాణ రాష్ట్రం. ఒక్క పాలన చేసుకోవడం తప్ప వారికి మరో ఆలోచన అవసరం లేదు. ఇలాంటి సౌకర్యాలతో ఏర్పడిన రాష్ట్రాన్ని ఏమనవచ్చు? ఇదే నవజాత శిశువు అయితే రాజధాని ఎక్కడో.. రాష్ట్రం ఎక్కడో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మరోవైపు లోటు బడ్జెట్టు, ఇంకొకవైపు తుఫానులు, కరువులు వెంటాడుతున్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్. ఈ రెండింటిలో ఏ రాష్ట్రం నవజాత శిశువు అవుతుంది?
 
రాజకీయ ప్రాపకం కోసం తెలుగు జాతిని విడదీసిన వారే ఏలుతున్నారు. తెలంగాణ శాసనసభనే తీసుకుంటే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మొదలుకుని ప్రధాన ప్రతిపక్షనేత జానా రెడ్డి, తెలుగుదేశం నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మంచిచెడులకు బాధ్యులే. దశాబ్దాలకు దశాబ్దాలు రాజకీయ అనుభవం గడించిన వారే. ఉద్యమాలను ఒంటి చేత్తో నడిపిన వారే. కానీ, నవజాత శిశువు అనేది ఏ పాప పుణ్యాలు తెలియని ఓ పసికందు. 
 
ఇంత అనుభవం కలిగిన వీరు రాజకీయ నవజాత శిశువులా? ఒక చిన్న విద్యుత్తు సమస్యపైన శాసనసభలో తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వాస్తవ గణాంకాలు తెలియజేసే సందర్భంలో నవజాత శిశువుగా అభివర్ణించుకుంటున్న మంత్రి హరీష్ రావు ఆంధ్ర, తెలంగాణ మధ్య ఉన్న విద్యుత్తు సమస్యలను పాకిస్తాన్, భారతదేశం మధ్యనున్న కార్గిల్ యుద్ధంలా అభివర్ణించడం ఏ నవజాత శిశువు లక్షణం? ఇంకా సెంటిమెంటుతో ఎన్నాళ్ళు మోసం చేస్తారు? విద్యుత్తు ఉత్పాదక సంస్థలను ఎందుకు తెలంగాణలో ఏర్పాటు చేయలేదో ఈ నవజాత శిశువులకు తెలియదా..? విద్యుత్తు ఉత్పాదక సంస్థలను ఏర్పాటు చేసే నాడు ఈ నవజాత శిశువులు ఏం చేస్తున్నట్లు?
 
అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌లో ఐదు నెలల కిందట అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్తు సమస్యను జాగ్రత్తగా పరిష్కరించినట్లు, ఈ భూమి మీద ఒక్క చంద్రబాబు మినహా మరే ఒక్కరు కూడా పరిష్కరించలేరన్నట్లు రేవంత రెడ్డి చెప్పడం విచిత్రంగానూ అనిపించిక మానదు. వాస్తవానికి ఇక్కడ మిగులు బడ్జెట్ ఏమీ లేదు. వ్యవసాయానికి 7 గంటల విద్యుత్తు ఇవ్వడం వలన అలా అనిపిస్తోంది. 
 
రాబోవు రోజులలో వ్యవసాయానికి విద్యుత్తు సరఫరా సమయం పెంచినా, మరిన్ని పరిశ్రమలు ఇక్కడకు వచ్చినా అదే సమస్య ఇక్కడా ఉత్పన్నం కాదనే ధైర్యం ఏ ఒక్కరికీ లేదు. కేవలం రెండు ప్రాంతాల ప్రజలను మభ్యపెట్టడానికి తెలుగుదేశం, టీఆర్ఎస్ ఆడుతున్న నాటకాలనే విమర్శలు వినబడుతూనే ఉన్నాయి. రాష్ట్ర విభజన సందర్భంలో బంగారు తెలంగాణ అని ఒకరు, నవ్యాంధ్రప్రదేశ్‌ను నిర్మిస్తామని మరొకరు ప్రజలను నమ్మించి విజయం సాధించారు. ప్రస్తుత పరిస్థితులు జాగ్రత్తగా లేకపోతే.. వీరిద్దరూ జనాన్ని నవజాత శిశువులను చేయడం ఖాయం.

- పుత్తా యర్రంరెడ్డి, సీనియర్ పాత్రికేయులు