శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2016 (19:51 IST)

చెన్నైలో టెన్షన్‌.. టెన్షన్‌.. దేశంలోనే జయలలిత నెంబర్ వన్ సీఎం.. ఎందుకంటే?

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక్కడి పరిస్థితులు క్షణానికో విధంగా మారిపోతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందన

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక్కడి పరిస్థితులు క్షణానికో విధంగా మారిపోతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు ప్రకటించడంతో చెన్నైలో ఎటుచూసినా టెన్షన్‌ వాతావరణమే కనిపిస్తోంది. గత 74 రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న జయకు ఆదివారం సాయంత్రం గుండెపోటు వచ్చిందన్న వార్తలతో తమిళనాడు ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 
 
దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు చెన్నై అపోలో ఆస్పత్రి వద్దకు చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు బలగాలను మోహరింపజేశారు. అయితే చెన్నై నగరంలో దుకాణాలు, వ్యాపార సంస్థలు, కంపెనీలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు మూసివేశారు. అలాగే, ప్రజా రవాణా వ్యవస్థను కూడా పూర్తిగా నిలిపివేశారు. దీంతో మహానగర రోడ్లన్నీ బోసిపోయాయి. 
 
అంతేకాదు.. జయకు గుండెపోటు వచ్చిందన్న వార్తల నేపథ్యంలోనే పాఠశాలలు, కళాశాలలకు ఆదివారం రాత్రినే సెలువులు ప్రకటించిన సంగతి తెలిసిందే. సరిహద్దు రాష్ట్రాల నుంచి రాకపోకల్ని సైతం నిలిపివేశారు. 'అమ్మ' ఆరోగ్యం తీవ్రంగా విషమించిందన్న వార్తలతో ఆవేదనకు గురైన అభిమానులు అపోలో ఆస్పత్రితో పాటు.. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారన్న కోపంతో మీడియా ప్రతినిధులపై కూడా దాడికి దిగారు. 
 
మరోవైపు తమిళనాడులో కాకుండా, దేశ వ్యాప్తంగా అమ్మా అని ముద్దుగా పిలుచుకునే జయలలితకు ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు.. దేశంలో చాలామంది నాయకులున్నారు. చాలా మంది సీఎంలున్నారు. కానీ జయలలితకు ఉన్నంత మంది వీరాభిమానులు వేరే ఏ ఇతర నాయకుడికి కూడా లేడని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. అంతగా ఆ పురచ్చితలైవి ప్రజాభిమానం సంపాదించుకున్నారు.
 
గతంలో చాలాసార్లు జయలలిత వీరాభిమానులు తమ అభిమానం ప్రదర్శించారు. జయ సీఎం అయితే సిలువ వేయించుకుంటానని ఓ అభిమాని నిజంగానే సిలువ వేయించుకున్నాడు. గతంలో ఓ అభిమాని జయ జైలు నుంచి విడుదలైతే నాలుక కోస్తానని అమ్మవారికి మొక్కడమే కాకుండా.. ఆ మొక్కు చెల్లించాడు. తమ నాయకురాలి కోసం ప్రాణాలైనా ఇచ్చేంత అభిమానం వీరి సొంతం.
 
అలాంటి జయ అభిమానులు ఇప్పుడు కన్నీరుమున్నీరవుతున్నారు. జయలలిత క్షేమంగా తిరిగిరావాలని కోటి దేవుళ్లకు మొక్కుతున్నారు. మరికొందరు మాత్రం ఇంతటి విషమపరిస్థితిలోనూ అమ్మ క్షేమంగానే తిరిగి వస్తుందని ధైర్యంగా చెబుతున్నారు. జయలలిత అంటే ప్రజలకే కాదు.. ఆమె పార్టీలోని ముఖ్యనాయకులకు కూడా విపరీతమైన భక్తి.
 
ప్రతి నాయకుడి జేబులోనూ అమ్మ ఫోటో తప్పకుండా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అమ్ము ముందు సరిగ్గా నిలబడి మాట్లాడే ధైర్యం కూడా చేయరంటే అదంతా భయమే కాదు.. చాలా భక్తి కూడా. పార్టీలో అమ్మ మాటకు ఎదురు చెప్పడమే తెలియని నేతలే అంతా. అంతటి అభిమానం సంపాదించుకున్న నాయకురాలు దేశంలో జయలలిత ఒక్కరే అంటే అందులో వీసమెత్తు కూడా అబద్దం లేనట్టే.