బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2016 (14:33 IST)

చంద్రబాబు ఆంధ్రాకు వెళ్లారు.. తెరాసకు జైకొట్టకుంటే చిక్కులే... ఇదీ గ్రేటర్ సీమాంధ్రుల మనోగతం!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గతంలో ఎన్నడూలేని విధంగా గట్టి ఎదురుదెబ్బ తగలడానికి ప్రధాన కారణం... జీహెచ్ఎంసీ పరిధిలోని సీమాంధ్రుల మనస్సులు పూర్తిగా మారిపోవడమే. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇక్కడకు వచ్చి పరిపాలన చేయలేరు కదా అని సెటిలర్లు భావించడమే. పైగా మన రాష్ట్రానికి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఏమి చేస్తారని తెలంగాణాలోని తెలుగుదేశం కార్యకర్తలు సైతం భావించడంతో పాటు టీ టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. 
 
దీనిపైనే ఇపుడు గ్రేటర్ హైదరాబాద్‌లోని టీ టీడీపీ నేతల్లో విస్తృతస్థాయిలో చర్చ సాగుతోంది. వాస్తవానికి హైదరాబాద్‌లో సెటిలర్లు ఉన్న సరిహద్దు ప్రాంతాలన్నింటిలో ఆంధ్రా టీడీపీ నేతలు మోహరించారు. ఒక్క కృష్ణా జిల్లా నుంచే మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్‌, బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.... వైవీబీ రాజేంద్రప్రసాద్‌ వంటి నేతలు హైదరాబాద్‌లో మకాం వేసి ప్రచారం చేశారు. సెటిలర్ల హక్కులను కాపాడాలంటే తెలుగుదేశం పార్టీకే ఓటు వేయాలని వీధివీధికి తిరిగి ప్రచారం చేశారు. 
 
సహజంగా హైదరాబాద్‌లో కోస్తా వాసులు ఎక్కువ మందే ఉన్నారు.. ఎన్నో ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. విస్తృతంగా ప్రచారం చేసి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలు ఓ అంచనాకైతే వచ్చారు. గ్రేటర్‌ పీఠం దక్కడం కష్టం కానీ.. గౌరవప్రదమైన స్థానాలను గెల్చుకోగలమని భావించారు. ఇదే విషయాన్ని ఇక్కడ నేతలకు వివరించారు. మరి కొంతమంది మాత్రం హైదరాబాద్‌లో పరిస్థితి మునుపటిలా లేదని తేల్చి చెప్పారు. 
 
కానీ ఫలితాలు వచ్చిన తర్వాత అందరూ డీలాపడిపోయారు. ఘోర పరాజయం ఎదురుకావడంతో ఏం చేయాలో పాలుపోని స్థితికి వచ్చేశారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి ప్రజలు ఎక్కువగా రావడం పార్టీ శ్రేణులలో నైతికస్థైర్యాన్ని నింపినప్పటికీ అది ఓట్ల రూపంలో మారలేదనేది పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కారణం ఒక్కటే... చంద్రబాబు ఇక్కడకు వచ్చి పరిపాలన చేయలేరు కదా అని సెటిలర్లు భావించడమే. మన రాష్ట్రానికి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఏమి చేస్తారని తెలంగాణవారు నిర్ణయించుకున్నారనేది మరో తెలుగుదేశంకు చెందిన మెజార్టీ నేతల అభిప్రాయంగా ఉంది.  
 
అంతేకాకుండా, ఎప్పుడైతే చంద్రబాబు విజయవాడకు వెళ్లిపోయారో... హైదరాబాద్‌లో ఉన్న సెటిలర్లకు తాము ఇక తెలుగుదేశం పార్టీపై ఆధారపడలేమనే భావనకు వచ్చారు. దీంతో పాటు అయ్యప్ప సొసైటీ, మరికొన్ని ప్రాంతాలలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ కట్టడాల కూల్చివేత వంటి చర్యలతో అక్కడ ఉండే సెటిలర్లలో కొంత భయాన్ని, అలజడిని రేకెత్తించింది. ఆ భయమే టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకపోతే ఇబ్బందులు వస్తాయనే భావనను తెచ్చిందని ఇక్కడి నేతలు అంటున్నారు. పోలింగ్‌బూత్‌కు వెళితే తెరాసకు ఓటు వేయవలసి వస్తుందనే ఉద్దేశంతో కొంతమంది ఓటింగ్ కూడా వెళ్లడం మానేశారు. అందువల్లే తెలుగుదేశం పార్టీకి ఘోర పరాజయం ఎదురైందని విశ్లేషిస్తున్నారు.