శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : బుధవారం, 4 మే 2016 (13:49 IST)

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా చిత్తూరు జిల్లా... రెండు నెలల్లో పది రేప్‌లు

ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి ప్రతిరోజు చిత్తూరు జిల్లాలోని పుణ్యక్షేత్రాల సందర్శన కోసం 70 నుంచి 80 వేలమంది భక్తులు వస్తూపోతుంటారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ జిల్లాలో ఈ మధ్యకాలంలో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకానొక దశలో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా చిత్తూరు జిల్లా మారిపోతోంది.
 
సరిగ్గా మూడేళ్ళ క్రితం కొంతమంది తీవ్రవాదులు చిత్తూరు జిల్లాలోని పుత్తూరులో బస చేసి విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించారు. అయితే కేంద్ర ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో మొత్తానికి ఆ విషయం కాస్త బయటపడింది. చిత్తూరు జిల్లా ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా ఈ విషయం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇదిలావుంచితే ఒక ఉగ్రవాది ఏకంగా తిరుమలకు వచ్చి రెక్కీ నిర్వహించి మరీ దర్జాగా వెళ్ళిపోయాడు. ఆ ఉగ్రవాది తిరుమలకు వచ్చి వెళ్ళిన చాలా రోజుల తర్వాత ఈ విషయం కేంద్ర ఇంటిలిజెన్స్‌ చెవిన పడింది. 
 
ఈ మధ్య కాలంలో చిత్తూరు జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ప్రతిరోజు ఒక హత్య, లేకుంటే అత్యాచారాలు జరుగుతున్నాయి. క్షణికావేశంలో భార్యలను భర్తలు చంపేయడం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఒంటరిగా పనులకు వెళ్ళే యువతులను నిర్మానుష ప్రాంతంలోకి కొంతమంది యువకులు తీసుకెళ్ళి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అంతటితో ఆగకుండా యువతిని హత్య చేసి ఆనవాళ్ళు కూడా లేకుండా చేసేస్తున్నారు. ఇటీవల తిరుమలలో ఒక జంట ఆత్మహత్య చేసుకోవడం మరింత చర్చనీయాంశంగా మారింది. కుటుంబ కలహాలతో నవ్వుతూనే యువజంట ఆత్మహత్యకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. 
 
జిల్లాలో గత రెండు నెలల కాలంలో 30కిపైగా హత్యలు 10కిపైగా అత్యాచారాలు జరిగాయంటే ఈ ప్రాంతంలో ఎంతటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుందో ఇట్టే అర్థమైపోతుంది. ఇంత జరుగుతున్నా పోలీసుల్లో మాత్రం ఏ మాత్రం చలనం కనిపించడం లేదు. కుటుంబ సమస్యలతో స్టేషన్‌కు వెళ్ళినపుడు వారికి నచ్చజెప్పి పంపించి తిరిగి వారు గొడవ పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం పోలీసులపై ఉంటుంది. కానీ పోలీసులు మాత్రం తమకేమీ సంబంధం లేనట్లు కుటుంబ వ్యవహారాల కేసులను పెద్దగా పట్టించుకోవపోవడమే ఇలాంటి సంఘటనలకు కారణమవుతున్నాయి.
 
కుటుంబ సమస్యలతో పోలీస్టేషన్‌కు వచ్చిన వారికి ధైర్యం చెప్పి వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపాలి పోలీసులు. కానీ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు పోలీసులు. అన్నీ అయిపోయాక వచ్చి కేసులు పెట్టి మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించే పనులకే పరిమితమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా హత్యలు, అత్యాచారాలు ఎక్కువవుతుండటంతో జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నాయి. ఎప్పుడూ ప్రశాంతంగా, ఆధ్మాత్మిక వాతావరణం ఉండాల్సిన జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు, ఆందోళన కలిగించే సన్నివేశాలు జరుగుతుండడం ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి.