బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2015 (13:01 IST)

నెట్ న్యూట్రాలిటీ అంటే ఏమిటి...? దానికి చట్టబద్ధత వచ్చేముందు... నెటిజన్లు బీకేర్‌ఫుల్

ప్రైవేట్ టెలికామ్ సంస్థలకు కళ్లెం వేయాలంటే అంతర్జాల సమానత్వం (నెట్ న్యూట్రాలిటి)కి చట్టబద్ధత కల్పించక తప్పదనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ పని చేయడంలో అతి చిన్నదేశమైన చిలీ ముందుండి... శభాష్ అనిపించుకుంది. అదేదారిలో నెదర్లాండ్స్‌, బ్రెజిల్‌, అమెరికా వంటి దేశాలు పయనిస్తున్నాయి. 
 
ప్రస్తుతం దేశంలోని యువత అమితంగా చర్చించుకుంటున్న విషయం నెట్ న్యూట్రాలిటీ. ఇపుడు ఈ అంశం దేశ పార్లమెంట్ వరకు వ్యాపించింది. ఈ అంశానికి సంబంధించి టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్‌) కఠినాతికఠినంగా తయారు చేసిన పత్రం(అభిప్రాయ సేకరణ) మీద స్పందించడానికి గడువు మరికొన్ని గంటలే మిగిలివుంది. 
 
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దీనిపై వకాల్తా పుచ్చుకున్నారు. నెట్‌ న్యూట్రాలిటీ కోసం దాదాపు పది లక్షల ఈమెయిల్స్‌ పంపి నెటిజన్లు ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తే... రైతుల తర్వాత మరో బలమైన ఓటు బ్యాంకు పక్షాన రాహుల్‌ గాంధీ నిలబడ్డారు. ప్రభుత్వంపై కాలుదువ్వారు. బడా కార్పొరేట్ల కోసం రైతుల నుంచి భూముల్ని లాక్కుంటున్నట్టే ఇప్పుడు వాటికోసం నెటిజన్ల హక్కులను గుంజుకుంటున్నారంటూ మండిపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలు ‘సేవ్‌ ఇంటర్నెట్‌’ ఉద్యమకారుల ప్రచార మద్దతు కూడా విస్తృతంగా లభించింది. 
 
నెట్ న్యూట్రాలిటీ ప్రకారం... ఆరంభంలో ఉచితంగా అందేది అనంతర కాలంలో ఒక అవసరంగానో, వ్యసనంగానో మారిపోయాక కాసులు దండుకోవడం మొదలవుతుంది. ఉచితం సముచితం కాదనడంతో పాటు, ఖరీదు కట్టి, తదనుగుణంగా వడకట్టడమూ మొదలవుతుంది. ఆఖరుకు ఉన్నవాడికీ, కొన్నవాడికే అది దక్కుతుంది. పుట్టిన పాతికేళ్ళలో ఒక నిత్యావసరంగా, వ్యసనంగా తయారైన ఇంటర్నెట్‌ను కొన్నవాడికే కట్టబెట్టి లాభాలు దండుకోవాలన్న కుళ్లు ఆలోచనలు చేశాయి కొన్ని ప్రైవేట్ టెలికాం సంస్థలు. 
 
అమెరికా విద్యావేత్త టామ్‌ వూ 2003లో ‘నెట్‌వర్క్‌ న్యూట్రాలిటీ’ అనే మాటను ప్రయోగించారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు, ఎటువంటి వడపోతలూ, వేగంలో తక్కువఎక్కువలూ లేకుండా ఏ వెబ్‌సైట్‌నైనా వీక్షించగలిగే అవకాశం ఇప్పటివరకూ ఉంటూ వచ్చింది. వెబ్‌సైట్ల నిబంధనలో, ఆ దేశాల చట్టాలో అడ్డుపడితే, వాటికి అంగీకరించడం ద్వారానో, కాస్తంత సొమ్ము చెల్లించో ఎక్కడి డేటానైనా దిగుమతి చేసుకొనే అవకాశం ఉండేది. అప్లికేషన్ల విషయంలోనూ అంతే. ఇదే నెట్ న్యూట్రాలిటీ.. అంతర్జాల సమానత్వం. 
 
అయితే, గత ఏడాది ఆఖరులో భారతి ఎయిర్‌టెల్‌ స్కైప్‌, వైబర్‌ వంటి అప్లికేషన్లు వాడుతున్నందుకు వినియోగదారుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయాలని ప్రయత్నించి, చివరకు తోకముడవక తప్పలేదు. ఇదే నెట్‌ న్యూట్రాలటీ ఉద్యమానికి నాంది పలికింది. బ్యాండ్‌ విడ్త్‌ పేరుతో వెబ్‌సైట్లను బాదేయాలన్న ఆలోచన అంతిమంగా యూట్యూబ్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి అధిక బ్యాండ్‌ విడ్త్‌ ఉపయోగించే సైట్లను డబ్బులు కట్టేవారికి తప్ప మిగతావారికి అందకుండా చేయాలని భావించింది. 
 
ఇంటర్నెట్‌ను రెండుగా విడగొట్టి, సొమ్ముచెల్లించే సైట్లు అధికవేగంతో వినియోగదారుడికి దక్కేట్టుచేయడం, చెల్లించనివి ఎంత ముఖ్యమైనవైనా దక్కకుండా చేయాలనుకోవడం సర్వీస్‌ప్రొవైడర్ల మరొక దుష్టచింతన. స్కైప్‌, వాట్సప్‌ వంటివాటిని ఆయా సంస్థలు ఉచితంగా అందిస్తున్నప్పటికీ, టెలికాం కంపెనీల కారణంగా త్వరలోనే కొనుక్కోవలసిన పరిస్థితికి తీసుకుని రావాలని కుట్ర పన్నాయి. నెట్‌ న్యూట్రాలిటీ కారణంగా బాగా ఎదిగిన ఫేస్‌బుక్‌ కూడా ఆదిలో ఈ భావనకు విరుద్ధంగా వ్యవహరించి తర్వాత కాలు వెనక్కుతీసుకుంది. రిలయెన్స్‌తో కలిసి ఉచితమంటూ అది ప్రవేశపెట్టిన ఇంటర్నెట్‌ ఓఆర్‌జీ‌పై నెటిజన్లు విరుచుకుపడడంతో మార్క్‌ జుకర్‌బర్గ్‌ సైతం వెనక్కి తగ్గి నెట్ న్యూట్రాలిటీకి కట్టుబడివున్నట్టు ప్రకటించక తప్పలేదు. 
 
తమకు డబ్బులు ముట్టచెప్పిన వెబ్‌సైట్లనూ, అప్లికేషన్లనో, లేదా చివరకు తాము రూపొందించిన వాటినే బలవంతంగా కట్టబెట్టాలనుకొనే టెలికం ఆపరేటర్ల కుట్రకు వ్యతిరేకంగా ఆరంభమైన సేవ్‌ ఇంటర్నెట్‌ ఉద్యమం భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. టెలికాం సంస్థలు విధించాలనుకుంటున్న పరిమితులు ఏమేరకు సహేతుకమో చెప్పమంటూ ట్రాయ్‌ ఆరంభించిన అభిప్రాయ సేకరణకు అనూహ్యమైన స్పందన వచ్చింది. దీనికితోడు అన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వంతో సహా నెటిజన్ల పక్షాన నిలువడంతో ట్రాయ్ కూడా తుది తీర్పును వారికి అనుకూలంగా వెలువరించే అవకాశాలు లేకపోలేదు.