శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: మంగళవారం, 10 నవంబరు 2015 (19:44 IST)

తిరుపతమ్మ అలా చెప్పింది... ఎంతకాలం ఈ సహనం...?

నిండుగా నవ్వుతూ రేపటి జీవితాన్ని గురించి కలలు కంటూ ఆనందంగా జీవితాన్ని అనుభవించాల్సిన పసిమొగ్గలు కాలం తీరకుండానే రాలిపోతున్నాయి. ఒకపక్క అమ్మాయిల శాతం తగ్గిపోతోందని, భవిష్యత్తు తరం చాలా ప్రమాదంలోకి వెళ్ళబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నా సదరు హెచ్చరికలను అబార్షన్లను అడ్డుకోవడం వరకే పరిమితం చేసేసి చేతులు దులుపుకొంటున్న మేధావులు ప్రస్తుత సమాజంలో మనతో పాటే బ్రతుకుతున్న బంగారు తల్లులను కాపాడే విషయంలో ఎటువంటి ప్రణాళికలూ రూపొందించలేకపోతున్నారు.
 
తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన తిరుపతమ్మ విషయానికే వస్తే చదువుకోవడానికి కాలేజీకి వెళ్ళే అమ్మాయి తనకు జరుగుతున్న వేధింపులను తట్టుకోలేక బలవన్మరణానికి గురైంది. అది సభ్య సమాజానికే ఒక తీరని మచ్చగా నిలిచిపోతుంది. తన తదనంతరం తన కుక్కలను కూడా భద్రంగా చూసుకోమని సూచించిన ఆ జాలి గుండె ఎంత వేదనకు గురికాకపోతే ఒక వ్యక్తి పురుషాంగాన్ని గురించి అంత కర్కశంగా వివరించి వుంటుందోనని ఆలోచిస్తేనే మనచుట్టూ వున్న ఈ సమాజమ్మీద జుగుప్సాకరమైన భావం కలుగుతుంది. 
 
ఇది నిజానికి ఈ రోజు జరిగిన సంఘటన కాదు, ఆడబిడ్డల మీద మృగాళ్ళ అకృత్యాలకు సాక్షాత్తూ మన దేశ రాజధాని కూడా వేదికగా మారిందంటే మన సహనశీల దేశానికి తీరని మచ్చ పడుతుంది. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డులో జరిగిన నిర్భయ విషయం దీనికి ఒక ఉదాహరణ మాత్రమే... ఇటువంటి సంఘటనలు దేశంలో మరెక్కడా జరగకుండా కఠినంగా వ్యవహరించడంలో మాత్రం మన సహనశీలి భారతదేశం చాలా సహనం చూపిందని విమర్శలనెదుర్కోవలసివచ్చింది. ఆ సహనం ఎంతగా హద్దు మీరిందంటే మళ్ళీ అదే తరహా సంఘటనలు పునరావృతమయ్యాయంటే పరిస్థితి ఎంతగా చేయి జారిపోతోందో తెలుస్తూనే వుంది. 
 
ఇటువంటివి ఒక ఎత్తయితే, శ్రద్ధాబుద్ధులు నేర్పుతారని విద్యాలయాలకెళితే అక్కడ కామంతో కళ్ళు మూసుకుపోయిన మేధావుల నుండి, సాటి విద్యార్ధుల నుండి తమను తాము కాపాడుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న రిషితేశ్వరి లాంటి అమ్మాయిలకు ఇప్పుడు న్యాయం చేస్తామని ప్రభుత్వాలు చెపుతున్నా రాలిపోయిన వారి వారి ప్రాణాలకు వెలకట్టలేమనేది నిర్వివాదాంశం. 
 
“నా దేశంలో ఎప్పుడైతే ఒక మహిళ అర్థరాత్రి నిర్భయంగా సంచరించగలుగుతుందో అప్పుడే నా దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు” అన్న మహాత్ముడి మాటలను మనం గుర్తుపెట్టుకొన్నా, వదిలేసినా కనీసం మన కుటుంబసభ్యులను పగటి పూటనైనా ఒంటరిగా ధైర్యంగా ఇంట్లోంచి బయటకు పంపగలిగేంత స్వచ్ఛమైన సమాజం కోసం మనం ఇంకా ఎన్ని తరాల పాటు వేచివుండాల్సి వస్తుందోనని భయం వేస్తూంది.
 
పాశ్చాత్య పోకడలు, పాశ్చాత్య ధోరణులతో వింత పోకడలు పోతున్న ఈ మృగాళ్ళను శిక్షించడంలో కూడా పాశ్చాత్య తరహాలోనే మన దేశ న్యాయశాస్త్రాలు కూడా కాస్త తమ సహజసిద్ద సహనాన్ని వదిలి కరుకుగా వ్యవహరిస్తేనన్నా మార్పు వస్తుందేమో వేచి చూడాల్సిందే.