శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By chj
Last Modified: బుధవారం, 21 సెప్టెంబరు 2016 (17:01 IST)

#internationaldayofpeace... శాంతి శాంతిః కోసం పాక్ పనిపట్టాల్సిందేనా...?

యుద్ధ రహిత సమాజం కోసం, హింస లేని జీవనం కోసం ఉద్దేశించబడినదే ‘ప్రపంచ శాంతి దినోత్సవం’. అనేక దేశాలూ, రాజకీయ సమూహాలూ కలిసి మొదటగా ఈ పండుగని 1982లో జరుపుకున్నాయి. తర్వాత 2002 నుంచి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ, సెప్టెంబర్ 21వ తేదీని శాశ్వత శాంతి దినోత్స

యుద్ధ రహిత సమాజం కోసం, హింస లేని జీవనం కోసం ఉద్దేశించబడినదే ‘ప్రపంచ శాంతి దినోత్సవం’. అనేక దేశాలూ, రాజకీయ సమూహాలూ కలిసి మొదటగా ఈ పండుగని 1982లో జరుపుకున్నాయి. తర్వాత 2002 నుంచి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ, సెప్టెంబర్ 21వ తేదీని శాశ్వత శాంతి దినోత్సవ తేదీగా ప్రకటించింది. ఐరాస అప్పటి నుంచి ప్రపంచ దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి కృషి  సలుపుతోంది. అంతర్జాతీయంగా అహింస, శాంతి, సోదరభావాల సాధన కోసం ప్రతి ఏటా ఈ శాంతి దినోత్సవం (International Day of Peace) జరుపుకుంటున్నాము. శాంతియుత జీవనం కోసం పాటుపడేలా  మానవాళికి స్ఫూర్తినివ్వడం, శాంతి సుహృద్భావాలు ప్రజల మధ్య పెంపొందేలా కృషి చేయడం, ఈ రెండే ప్రపంచ శాంతి దినోత్సవాన్ని జరుపుకోవడంలోని ప్రధానోద్దేశ్యాలు. వీటినిసాధించడం కోసం వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రజలతో మమేకమై ఈ ఉత్సవాన్నినిర్వహిస్తాయి.
 
ప్రపంచవ్యాప్తంగా ఆఫ్రికా తప్ప మిగిలిన అన్ని దేశాల బాలలూ విరాళంగా ఇచ్చిన నాణాల నుండి తయారైన 'శాంతి గంట'ను  మోగించి, ఈ పండగని న్యూయార్క్ నగరంలో ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మొదటిసారిగా జరుపుకున్నారు. ఈ గంటపైనున్న' సంపూర్ణ ప్రపంచ శాంతి వర్ధిల్లాలి!'అన్న నినాదం, ప్రాణికోటి మనుగడకు శాంతి ఎంత  అవసరమో తెలియజేస్తుంది. ప్రతి యుద్ధంలోనూ అనివార్యంగా జరిగే జననష్టం గురించి ప్రజలకి తెలియ జేయడం కోసం, ఈ శాంతి గంటని యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఆఫ్ జపాన్, ఐక్య రాజ్య సమితికి కానుకగా ఇచ్చింది.
 
ప్రపంచానికి శాంతి అవసరం గురించి ప్రబోధించే ఈ ఉత్సవ సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో, వెస్ట్ కోర్ట్ తోట ఆవరణలో ఏర్పాటు చేసిన శాంతి గంటను మోగిస్తారు. అనేక సంస్థలు, దేశాలు, ప్రపంచ శాంతి కోసం తమవంతు ప్రయత్నాలు చేయడానికి, ఆచరణీయ కార్యక్రమాలు చేపట్టడానికి ఉద్దేశించిన ఈ రోజున అనేక కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తారు. దేశాలు, జాతులు, సమూహాల మధ్య తీవ్ర ఘర్షణలు నిరంతరంగా సాగుతూనే ఉన్నా ఈ రోజు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా కాల్పుల విరమణ ప్రకటిస్తూ, శాంతి కోసం అవసరమైన కొన్ని తీర్మానాలు చేస్తారు. 
 
వ్యక్తులు, సంస్థలూ, దేశాలూ తమ ఆధిపత్యపు పోరులో హింసకు పాల్పడడం , విధ్వంసానికి పూనుకోవడం అనాదిగా జరుగుతూనే ఉంది. ఒక దేశ భూభాగంపై మరో దేశం దురాక్రమణ సాగించడం, రాజకీయంగా దృఢమైన, అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉగ్రవాద కార్య కలాపాలకు చేయూతనిచ్చి, అల్లకల్లోలం సృష్టించి, బలహీనపరచి తమ ఆధిపత్యాన్ని నెలకొల్పుకునే ప్రయత్నం చేయడం, ఆ దేశంలోని ప్రకృతి వనరుల్ని కొల్లగొట్టి, తమ ఇంధన అవసరాలను తీర్చుకోవడం సాధారణమైపోయింది. అనేక దేశాలలో చమురు నిల్వల కోసం ఆయిల్ కంపెనీలు చేపట్టే కార్యక్రమాల వల్ల ఆదివాసీ తెగల వారెందరో నిర్వాసితులవుతున్నారు.
 
మత మార్పిడుల ద్వారా, పర మతాల పట్ల అసహనాన్ని రేకెత్తించడం ద్వారా అల్లకల్లోలాన్ని సృష్టిస్తూ తీవ్రవాదులు ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తుంటే, సహజ పరిసరాల్లో ప్రశాంతంగా జీవిస్తున్న ఆదివాసులని కుతంత్రాల ద్వారా నిర్వాసితుల్ని చేసి, ప్రకృతి వనరుల కోసం ఆయా ప్రాంతాలనూ, చిన్నచిన్న దేశాలనూ లోబరచుకునే వ్యవహారాలు జాతీయంగా, అంతర్జాతీయంగా ఎక్కువవుతున్నాయి. పరాయి దేశాల వనరుల్ని దోపిడీ చేయడం, ఆయా దేశాలు అందుకు ఒప్పుకోనపుడు దౌర్జన్యానికి తెగబడటం అగ్ర రాజ్యాలకి అలవాటైపోయింది. అభివృద్ధి చెందిన దేశాల మొదలు అభివృద్ధి చెందుతున్న దేశాల వరకు ప్రతి దేశం తమ ఆదాయంలో అత్యధిక భాగం రక్షణ కొరకు ఖర్చు చేస్తున్నాయి. దీంతో ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులు దిగజారుతున్నాయి. చిన్న దేశాల పరిస్థితి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి దేశం భయం గుప్పిట్లో బ్రతుకుతుంది.
 
ఇలాంటి పరిస్థితులు మారాలి. ప్రతి దేశం ప్రపంచ శాంతికి తమ వంతు కృషి చేయాలి. పరాయి దేశాలపై దురాక్రమణలకు స్వస్తి పల్కాలి. జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని గ్రహించాలి. ప్రపంచంలోని ప్రతి మతం అందించిన సిద్ధాంతం శాంతి సిద్ధాంతం. ఈ అంశాలను అర్ధం చేసుకోవాలి. శాంతికి విఘాతం కలిగిస్తున్న విచ్ఛిన్న శక్తులపై సమిష్టిగా పోరు సాగించాలి. ఉగ్రవాదాన్ని – తీవ్రవాదాన్ని అణిచివేయాలి. ఈ విషయంలో అగ్ర రాజ్యాలు చిన్న దేశాలకు ఆదర్శంగా నిలవాలి. శాంతి స్థాపనలో కీలకపాత్ర పోషించాలి. ఇక మన దేశం విషయానికి వస్తే పొరుగున ఉన్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు నిత్యం వాస్తవాధీన రేఖ వద్ద ఉల్లంఘనలకు పాల్పడుతూ కాల్పులు జరుపుతూ కవ్విస్తోంది. ఎందరో ప్రాణాలను హరిస్తోంది. శాంతి స్థాపన కోసం భారతదేశం పాకిస్తాన్ దేశంపై తీసుకొచ్చే ప్రతి చర్యకు ప్రపంచం మద్దతు తెలపాల్సి ఉంది. ఇలాగే ప్రపంచంలో ఉగ్ర చర్యలకు పాల్పడే అన్నిచోట్లా ప్రపంచం అంతా ఒక్కటై ఎదుర్కోవాలి.
 
 ఓం శాంతి: శాంతి: శాంతి: సర్వేజనా సుఖినోభవంతు