గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : శనివారం, 4 జులై 2015 (22:04 IST)

వైసీపీలో బొత్స స్థానం ఏంటి..? నంబర్ 2 ఆయనేనా...!?

వైఎస్ఆర్సీపీలో జగన్ ఎవ్వరినీ లెక్క చేయడం లేదనీ, సీనియర్లు కూడా పక్కన పెడుతున్నారని ఎందరో నాయకులు జగన్ను ఆడిపోసుకుని తిరిగి వెళ్ళిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి సమయంలో పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ వైసీపీ గూటికి చేరారు. పీసీసీ స్థాయిలో పని చేసి ముఖ్యమంత్రి పీఠానికి పోటీ పడిన వ్యక్తి పార్టీలో ఇమడగలడా..! అక్కడ ఆయన స్థానం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉదయిస్తున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో బొత్ససత్యనారాయణ మీడియా ఎదుటకు వస్తున్నారు... బొత్స స్థానం రెండుగా ఉంటుందని భావిస్తున్నారు. ఇది సాధ్యమా..! 
 
వైసీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కాకపోయినా బొత్సకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు మాత్రం ఆ స్థాయిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడం.. రాష్ట్రంలో ఉన్న ప్రముఖులలో బొత్ససత్యనారాయణ ఒకరు అనడంలో అనుమానం లేదు. బలమైన నాయకుడు అనడంలో సందేహం లేదు. ఆయన నేరుగా ఒక బలమైన పార్టీకి అధ్యక్షుడుగా వ్యవహరించడం జిల్లాలోని అన్ని ప్రాంతాలలో పరిచయాలు ఉండడంతోపాటు బలమైన వాగ్ధాటి, స్టేచర్ గల నాయకుడు కావాలనే ఉద్దేశంతోనే బొత్సకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చెబుతున్నారు.

పార్టీ అంటే తల్లి, కొడుకు, కూతురు అనే భావన నుంచి బయట పడేయాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దాన్ని తుడిచి వేయడానికి బొత్స పాత్రను పెంచడం ఉపయోగపడుతుందని జగన్ భావించినట్లు చెబుతున్నారు. ఇప్పుడు పార్టీలో జగన్ తర్వాత బొత్సనే అనే ప్రచారం సాగుతోంది.
 
పైగా ఎవరినైనా తిట్టినా... విమర్శించినా ఓ స్థాయిలో విమర్శించగల సత్తా ఉన్న వ్యక్తి ఆయనను ఎంపిక చేసి ఆ స్థానాన్ని కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది.  ఇటీవల ప్రతి విషయంపైనా బొత్స సత్యనారాయణే ప్రధానంగా ప్రతిస్పందిస్తున్నారని అంటున్నారు.

రాజకీయానుభవం, విషయాల పట్ల అవగాహన మాత్రమే కాకుండా మీడియా దృష్టిలో ఓ స్థాయి బొత్స సత్యనారాయణకు ఉందని, దానివల్ల పార్టీ వైఖరి ప్రజల్లోకి ఎక్కువగా వెళ్తుందని జగన్ భావించినట్లు సమాచారం. ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై, మంత్రులపై, టిడిపి నాయకులపై బొత్స సత్యనారాయణ మాట్లాడే తీరు పార్టీకి ఉపయోగపడిందని కూడా ఆయన భావించారని సమాచారం. ప్రతీ విషయానికి నేరుగా జగనే స్పందిస్తే ఆ తరువాత ఎవరు స్పందించాలనే అనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఆయన బొత్సను ముందుకు తీసుకు వచ్చినట్లు సమాచారం.