బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : సోమవారం, 22 జూన్ 2015 (13:14 IST)

కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి నిజంగా ప్రయత్నాలు జరిగాయా..?!!

రాజకీయాలు చాలా వేగంగా కలుషితమవుతున్నాయని విశ్లేషకులు ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు. జంప్ జిలానీల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతోందనేది దేశంలో అభిప్రాయం. ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చాయి..! అయితే దానికోసం ఎవరు ప్లాన్ చేశారు.? ఇన్ని అనుమానాలు రావడానికి కారణం ఏంటి? అందుకు బలం చేకూర్చిన అంశాలు ఏమిటి..? ఇది ఎప్పటి నుంచో టీఆర్ఎస్‌ను వేధిస్తున్న ప్రశ్నలు. వారు నేరుగా చంద్రబాబు మీద వేస్తున్న నిందలు కూడా అవే. మరి దానిలో ఎంత నిజముంది..? దానిని బలపరిచే అంశాలేవి? 
 
జంపు జిలానీలు... పార్టీల విప్‌నకు వ్యతిరేకంగా ఓటింగు చేయడమనేది ఇప్పటి అంశం కాదు. ఎప్పటి నుంచో జరుగుతున్న సంగతే.. పార్లమెంటు సాక్షిగా ఇది సాగింది. యూపీఏ-1 తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి చేసిన పని అదే అనేది జగమెరిగిన సత్యం. అయినా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిని రాజకీయ పార్టీలు పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. మరి ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి ద్వారా స్టీఫెన్సన్‌కు డబ్బులు పంపి ప్రలోభ పెట్టాలనుకున్న అంశానికి కేసీఆర్ కూడా అంత ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం లేదని కొందరి వాదన. ఆ లెక్కకు వస్తే ఈ బేరసారాల వ్యవహారం ప్రతి రాజకీయ పార్టీకి తెలిసిన విషయమేననేది చాలామంది చెప్పే మాట.
 
అయినా ఆయన ఎందుకు ఈ వ్యవహారాన్ని ఇంత సీరియస్‌గా తీసుకున్నారు.? దీని వెనుక కేవలం ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రమేనా? ఈ మాత్రం దానికే బాబుతో కేసీఆర్ శాశ్వతమైన శత్రుత్వం పెట్టుకునే దిశగా వెళతారా? ఆయనను అరెస్టు చేయించినంత మాత్రానా కేసీఆర్‌కు వచ్చేది ఏమిటి? మొన్నటివరకూ బాబు, కేసీఆర్‌లు సన్నిహితంగానే కనిపించారు కదా! వాస్తు సలహాలు ఇచ్చుకొనేంత వరకూ వెళ్లారు కదా.. కొంచెం లోతుల్లోకి వెళ్లితే, చిన్న విషయంలానే కనిపిస్తున్న ఈ వ్యవహారాన్ని కేసీఆర్ ఎందుకు పెద్ద కర్రతో కొడుతున్నారనే ప్రశ్నలు వచ్చాయి. 
 
బాబుకు ఒక ముద్రవేసి వదిలేంతవరకూ ఎందుకు భావిస్తున్నారో.. తెలుస్తోంది! ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ఎమ్మెల్యేలతో శాసనసభా పక్ష సమావేశం పెట్టి ఓ ఘాటైన మాట అన్నారు. ‘అవసరమనుకుంటే శాసనసభను రద్దు చేస్తా...!’ ఇది సామాన్యమైన విషయం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంతో అభద్రతలో ఉన్నప్పుడు మాత్రమే చివరి అస్త్రంగా నాయకులు వినియోగిస్తారు. అలాంటిది ఎమ్మెల్సీ ఎన్నికలలో కేసీఆర్ వినియోగించారంటే పెద్ద సంకేతాలే కేసీఆర్‌కు అందాయట. 
 
అందుకే ఓటుకు నోటు విషయంలో కెమెరాలు.. ఆడియోలంత పెద్ద వ్యవహారం నడిపారు. గట్టి సమాధానం చెప్పాలనే ఉద్దేశ్యంతోనే వారు సన్నాహాలు చేశారు. ఇందులో రేవంత్ ఇరుక్కున్నారు. బాబును లాగారు. మొత్తం ముప్పై మంది ఎమ్మెల్యేలు.. ఒక్కోరికి ఐదుకోట్ల రూపాయల మొత్తం. మొత్తంగా రూ.150 కోట్ల రూపాయల డీల్ నడిచిందని టీఆర్ఎస్ వర్గాలు వాదిస్తున్నాయి. బాబు కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడమే లక్ష్యంగా నడిచారని ఆరోపిస్తున్నారు. 
 
ఈ డీల్‌లో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఒక ముఖ్య నేత ప్రమేయం ఉన్నట్టుగా టీఆర్ఎస్ అనుమానిస్తోంది. ఆడియో టేపుల్లోని కొంత సారాంశాన్ని పట్టుకున్న కేసీఆర్ అలెర్ట్ అయ్యారు లేకపోతే తాను దెబ్బతినేవాడిననే వాదన చేస్తున్నారు. అందుకే ఓటుకు నోటు కేసును ఈ స్థాయిలో లాగారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకప్పటి రాజకీయ గొడవల కారణంగా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసి తాను ముఖ్యమంత్రి అయిన చరిత్ర చంద్రబాబుకు ఉంది కనుక, ఈ వ్యవహారం చంద్రబాబే నడుపుతున్నారని తెరాస నాయకులు ఆరోపిస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఆ అవసరం తమకు లేదనే అదంతా టీఆర్ ఎస్ భ్రమ మాత్రమేనని చెబుతోంది. రాజకీయాల్లో పక్కనున్న నాయకుడు కూడా ఎలాంటివాడోనని నమ్మే స్థితిలో ఉండరు నాయకులు.