శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : బుధవారం, 27 జనవరి 2016 (14:50 IST)

భారత్‌లో చాపకిందనీరులా విస్తరిస్తున్న ఐసిస్.. మోడీ ఏం చేస్తారో?

ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదం భారత్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీనికి నిదర్శనం ఇటీవల దేశ వ్యాప్తంగా ఎన్.ఐ.ఏ నిర్వహించిన తనిఖీల్లో పదుల సంఖ్యలో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు అరెస్టు కావడమే నిదర్శనం. భారత్‌లో తన నెట్‌వర్క్‌ను దశలవారీగా పక్కా వ్యూహంతో అమలు చేస్తూ దాడులకు పక్కా వ్యూహాలు పన్నుతోంది. 
 
భారత గణతంత్ర వేడుకలను విచ్ఛిన్నం చేసేందుకు ఐఎస్ కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు హెచ్చరికతో ఉగ్రవాదుల కుట్ర బయటపడింది. అయితే ఐబీ హెచ్చరికలతో రంగంలోకి దిగిన ఎన్.ఐ.ఏ ముమ్మర తనిఖీలు నిర్వహించాయి. ఉగ్రమూకలు కలుగులోంచి బయటికి వస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 18 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఎన్.ఐ.ఎ అదుపులో మరో 20 మంది ఐసిస్ అనుమానితులు ఉన్నారు.
 
ముఖ్యంగా కర్ణాటక, హైదరాబాద్‌లో అరెస్ట్ అయిన ఐసిస్ సానుభూతిపరులు రిపబ్లిక్‌ డే రోజున దక్షిణ భారతదేశంలో భారీ విధ్వంసానికి వీరు కుట్ర పన్నినట్లు గుర్తించారు. ఐసీస్‌ భావజాలం పట్ల ఆకర్షితులవడంతో పాటు మరికొందరిని వీరు ఆ రొంపిలోకి దింపినట్లు అనుమానిస్తున్నారు. ఫేస్‌బుక్‌, ఇతర సోషల్‌ మీడియా ద్వారా ఎవరెవరితో సంప్రదింపులు జరిపారనేది ఆరాతీస్తున్నాయి. హైదరాబాద్‌లో శుక్రవారం అరెస్ట్ చేసిన వారందరినీ... ఎన్.ఐ.ఏ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తున్నారు.
 
మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు చిన్నారుల్ని పావులుగా వాడుకోవాలని ఐఎస్‌ ప్రణాళిక రచించింది. ఈ విషయాన్ని ఇంటిలిజెన్స్‌ వర్గాలు ముందుగానే పసిగట్టాయి. రిపబ్లిక్‌ డే రోజున టీనేజ్‌ బాలలను ఆత్మహుతి దళంగా ఉపయోగించాలని ప్లాన్‌ చేసింది. ఇందుకోసం 12 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న వారికి ఆయుధాలు, పేలుడు పదార్థాలను వినియోగించడంలో శిక్షణ ఇచ్చింది కూడా. దీంతో రిపబ్లిక్‌ డేకు హైఅలర్ట్‌ ప్రకటించడంతో భారత నిఘా సంస్థలు, ఫ్రెంచి నిఘా సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. ఇపుడు ఈ వేడుకలు ప్రశాంతంగా ముగియడంతో ఎన్.ఐ.ఏతో పాటు.. నిఘా సంస్థలు ఐఎస్ ఉగ్ర నెట్‌వర్క్‌పై దృష్టిసారించాయి.